Atishi Marlena Singh: దిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న ఈ మహిళ ఎవరు?

Delhi new CM Atishi Marlena
x

అతిషి మార్లేనా సింగ్: దిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న ఈ మహిళ ఎవరు?

Highlights

Atishi Marlena Delhi New CM: అతిషి మార్లేనా సింగ్.. దిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Atishi Marlena Delhi New CM: అతిషి మార్లేనా సింగ్.. దిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో, తదుపరి ముఖ్యమంత్రిగా పార్టీ అతిషిని ఎంపిక చేసింది. మనీషి కుమార్ సిసోడియా కూడా ఆమెకు మద్దతు తెలిపారు. దిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం తరువాత తాను లెఫ్టినెంట్ జనరల్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు.

దిల్లీ ప్రజలు తనను ‘నిజాయతీపరుడు’గా ప్రకటించిన తరువాత మళ్ళీ సీఎం పదవి చేపడుతానని కేజ్రీవాల్ గత ఆదివారం ప్రకటించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద విడుదలైన తరువాత కేజ్రీవాల్ ఆ ప్రకటన చేశారు. ఆయన తరువాత అతిషి దిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నారు. దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.

ఎవరీ అతిషి?

ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయనే కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ కుమార్ సిసోడియా జైలుకు వెళ్ళిన తరువాత అతిషి ఆప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆమె 2023లో విద్య, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అంతకుముందు, 2015-2018 మధ్య కాలంలో ఆమె మనీష్ కుమార్ సిసోడియాకు సలహాదారుగా ఉన్నారు. ముఖ్యంగా, విద్యా విధానానికి సంబంధించి ఆమె కీలక సలహాదారుగా వ్యవహరించారు.

అతిషి 1981 జూన్ 8న జన్మించారు. ప్రొఫెసర్లయిన అతిషి తల్లితండ్రులు విజయ్ సింగ్, తృప్త వాహి ఆమె పేరులో మార్లెనా అనే పదాన్ని చేర్చారు. ఆప్ వర్గాలు చెప్పిన ప్రకారం, మార్క్స్-లెనిన్ పేర్లు కలుపుతూ వారు తమ కూతురికి ఆ పేరు పెట్టారు.

అయితే, ఈ సామాజిక కార్యకర్త 2018 ఎన్నికలకు ముందు తన ఇంటిపేరును తన వ్యావహారిక నామంలోంచి తీసేయాలని నిర్ణయించుకున్నారు. అతిషి అనే పేరుతోనే రాజకీయాల్లో పాల్గొంటూ వచ్చారు. దిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన అతిషి, సెయింట్ స్టీఫెన్ కాలేజి నుంచి 2001లో హిస్టరీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె షెవెనింగ్ స్కాలర్షిప్‌తో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. ప్రతిష్ఠాత్మక రోడ్స్ స్కాలర్‌గా ఆమె 2005లో ఆక్స్‌ఫర్డ్‌లోని మగ్డాలెన్ కాలేజీలో చదువుకున్నారు.

ఆమ్ ఆద్మీగా రాజకీయాల్లోకి...

అతిషి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ విధివిధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో 2015లో జరిగిన చరిత్రాత్మక జల్-సత్యాగ్రహంలో ఆమె పాల్గొన్నారు. ఆ తరువాత కూడా ఆమె దానికి సంబంధించిన చట్టపరమైన పోరాటంలో ఆప్ నాయకుడు అలోక్ అగర్వాల్‌కు అండగా ఉన్నారు.

గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమి

అతిషి 2019లో తూర్పు దిల్లీ లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. అయితే, అప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ తరువాత 2020లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆమెకు కల్కాజీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో ఆమె బీజేపీ ప్రత్యర్థి అయిన ధరంవీర్ సింగ్‌ను 11,000 ఓట్ల తేడాతో ఓడించారు.

విద్యా రంగంలో విలువైన సేవలు

ఈ కల్కాజీ ఎమ్మెల్యేకు ఆప్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి పదవిని కట్టబెట్టింది. దిల్లీలోని విద్యా వ్యవస్థను అనూహ్యంగా మార్చేసిన నాయకురాలిగా అతిషి పేరు సంపాదించారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రమాణాలను పెంచుతూ, మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటుతో నిర్వహణను పటిష్టం చేస్తూ ఆమె తీసుకువచ్చిన మార్పులు దిల్లీ విద్యా వ్యవస్థకు కొత్త రూపాన్నిచ్చాయి. అలాగే, ప్రైవేట్ స్కూళ్ళలో అడ్డగోలుగా ఫీజులు పెంచకుండా ఆమె నియంత్రణ చర్యలు చేపట్టారు.

పాఠశాలలో విద్యార్థులు సంతోషంగా ఉండేందుకు బోధన ప్రణాళికలో ఆనందాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టారు. చిన్నారుల్లో ఇమోషనల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్‌తో వారి వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించారు.

ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి ఎదుగుదలకు కారణం ఆమెలోని సామాజిక చైతన్యమే అని చెప్పవచ్చు. ప్రజలకు ఉపయోగకరంగా పాలనా విధానాన్ని పటిష్టం చేయాలనే దిశగా ఆమె పని చేస్తూ వచ్చారు. ఆమె ఇప్పుడు దిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం భారత మహిళా రాజకీయాల చరిత్రలో ఒక ముందడుగు అనడంలో సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories