PM Modi - Xi Jinping Meeting: భారత్ - చైనా భాయి భాయి?
PM Modi - Xi Jinping Meeting: ఇండియా, చైనా శత్రుదేశాలనే భావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. గాల్వాన్ ఘర్షణలు, కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు ఈ...
PM Modi - Xi Jinping Meeting: ఇండియా, చైనా శత్రుదేశాలనే భావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. గాల్వాన్ ఘర్షణలు, కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు ఈ అభిప్రాయానికి బలం చేకూర్చాయి. కానీ, ఇదంతా ఇక గతం కానుందని తాజాగా పరిణామాలు చెబుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఔను.. గతం గతః అన్నట్లు ఇప్పుడు మళ్లీ రెండు దేశాలు ఒక్కచోట చేరాయి. రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సదస్సు ఈ కలయికకు వేదికైంది. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం, దౌత్య సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ధికి కీలక ఒప్పందాలు లక్ష్యంగా జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలుసుకున్నారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, షీ జిన్‌పింగ్ లు కలుసుకోవడం రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు ఒక అడుగు ముందుకు పడినట్లయింది. 2020 మే నెలకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలనే అంగీకారం ఈ ఇద్దరి చర్చల్లో కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అంటే, గాల్వాన్, లద్దాఖ్ ఘర్షణలకు పూర్వం ఉన్న స్థితిని రెండు దేశాలు కొనసాగిస్తాయన్న మాట. అంతేకాకుండా, సరిహద్దు ప్రాంతంలో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి రెండు దేశాల సైనికుల గస్తీ ఏర్పాట్లు ఎలా ఉండాలన్నదానిపై కూడా ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గత నాలుగేళ్ళుగా జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే బ్రిక్స్ సదస్సు సైడ్ లైన్స్ లో జరిగిన మోదీ, జిన్ పింగ్ సమావేశాన్ని ఒక కీలకమైన మలుపుగానే భావించాలి.
భారత్, చైనా మధ్య ఎక్కడ తేడాలొచ్చాయి?
ఇండియా, చైనా దేశాధినేతలు చివరిసారిగా ఇలా ఒకే వేదికపైకి వచ్చి సరిగ్గా ఐదేళ్లవుతోంది. ఈ ఐదేళ్ల కాలంలో రెండు దేశాల మధ్య దూరం పెంచేలా ఎన్నో ఘటనలు జరిగాయి. అందులో అతి ముఖ్యమైనది లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ. 2020 సంవత్సరం జూన్ 15న గల్వాన్ వ్యాలీలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన భారీ ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అటువైపు నలుగురు సైనికులు మృతి చెందారు. భారత్ వైపు అమరులైన వారిలో మన తెలుగు బిడ్డ, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఇరు దేశాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఘటన వైరానికి ఆజ్యం పోసింది.
లద్దాఖ్ ఘటన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్, చైనాల మధ్య దూరం బాగా పెరిగింది. కానీ రెండు దేశాలు కూడా సోదర భావంతో మెలిగిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒకరినొకరు ఆత్మీయ స్వాగతం పలకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
2019 అక్టోబర్ 12న చివరిసారిగా షీ జిన్‌పింగ్ ఇండియాకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికి రిసీవ్ చేసుకున్నారు. జిన్‌పింగ్‌కి మోదీ స్వాగతం పలికిన తీరు, అందుకోసం చారిత్రాత్మక ప్రదేశమైన మామళ్లపురం పుణ్యక్షేత్రాన్ని ఎంచుకోవడం వెనుకున్న మోదీ స్ట్రాటెజీ అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కింది.
మహాబలిపురమే ఎందుకు?
తమిళనాడులో చెన్నైకి సమీపంలో ఉన్న మామల్లాపురమే తెలుగువాళ్ళు పిలుచుకునే మహాబలిపురం. తమిళనాడుకు, చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్‌కు మధ్య చాల కాలంగా మంచి వ్యాపార, సాంస్కృతిక సంబంధాలున్నాయి. అందుకోసమే, చైనా దేశాధినేతను రిసీవ్ చేసుకోవడానికి అప్పట్లో ఆ స్థలాన్ని ఎంచుకున్నారు. అక్కడి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ కొబ్బరిబోండాలు తాగిన దృశ్యాలు అప్పట్లో ఇంటర్నెట్లో ఓ సెన్సేషన్ అయ్యాయి.
చైనా వెళ్లిన ప్రధాని మోదీ
షీ జింగ్‌పింగ్ ఇండియాకు రావడానికి ఒక ఏడాది ముందే.. అంటే 2018 మే 14న మన ప్రధాని మోదీ చైనాలోని వుహాన్‌లో పర్యటించారు. అప్పట్లో మోదీ పర్యటన కూడా ఒక సెన్సేషనే. ఎందుకంటే సరిగ్గా ఆ పర్యటనకు 73 రోజుల ముందు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని డోక్లాంలో ఇరు దేశాలు సైనికులు తలపడ్డారు. ఆ ఘటన తరువాత మోదీ చైనాలో పర్యటించడం అదే తొలిసారి కావడంతో ప్రపంచదేశాలు ఆ పరిణామాన్ని ఆసక్తిగా గమనించాయి.
మోదీని ఎదుర్కోవడానికి జింగ్‌పింగ్ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు ఆయన భారత్‌కి ఇచ్చిన గౌరవ మర్యాదలను సూచించాయి. మోదీ దిల్ పసంద్ చేసేందుకు భారతీయ నేపథ్యాన్ని ఉట్టిపడేలా, అక్కడక్కడ త్రివర్ణ పతకాన్ని గౌరవించేలా జింగ్‌పింగ్ ఏర్పాట్లు చేశారు. చైనీస్ సింగర్ల చేత బాలీవుడ్ పాటలు పాడించారు. సరస్సు ఒడ్డున నడుస్తూ స్పెషల్ ఛాయ్ రుచి చూపించారు.
భారత ప్రధాని మోదీ పర్యటన తనకు ఎంత ముఖ్యమో జిన్‌పింగ్ ఒక్కముక్కలో చెప్పారు. ఒక దేశాధినేతను రిసీవ్ చేసుకునేందుకు తాను చైనా రాజధాని బీజింగ్‌ని విడిచిపెట్టి రావడం రెండుసార్లు మాత్రమే జరిగిందన్నారు. ఆ రెండుసార్లు కూడా వచ్చిన దేశాధినేత మరెవరో కాదు. మోదీనే అని వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తరువాత.. అంటే 2015 లో చైనాలో పర్యటించారు. చైనా ప్రీమియర్ లి కెకియాంగ్ ఆహ్వానం మేరకు జియాన్‌లో పర్యటించిన మోదీని అప్పట్లోనూ జింగ్‌పింగ్ అంతే గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నారు.
ఇక ప్రస్తుతంలోకి వస్తే.. సరిహద్దుల్లో ఇన్నేళ్లుగా నెలకున్న పాత పంచాయతీలను పక్కనపెట్టి ఇరు దేశాధినేతలు మరోసారి పరస్పరం స్నేహ భావం చాటుకున్నారు. ఇలా స్నేహభావంతో వీళ్లిద్దరూ కలుసుకోవడం ఇదేం తొలిసారి కాకపోయినా.. ఈసారి బ్రిక్స్ వేదికగా జరిగిన ఈ భేటీ మాత్రం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య ఒప్పందాలతో ఇకనైనా పరిస్థితి మారుతుందా అనే ప్రశ్నకు విశ్లేషకులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైనా ఇండియా చెలిమి శాశ్వతమా లేక దీనికేమైనా కాలపరిమితి ఉందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire