SC About Kolkata Doctor Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసుపై సుప్రీం కోర్టు అసలు ఏం చెప్పింది ?

SC About Kolkata Doctor Rape-Murder Case
x

SC About Kolkata Doctor Rape-Murder Case

Highlights

SC About Kolkata Doctor Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసుని సుప్రీం కోర్టు ఎప్పుడైతే సుమోటోగా తీసుకుంటున్నట్లుగా ప్రకటించిందో, అప్పటి నుంచే అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ లైంగిక దాడి, హత్యపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనే ఆలోచన మదిని తొలిచేస్తోంది.

Supreme Court About Kolkata Doctor Rape-Murder Case: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసుని సుప్రీం కోర్టు ఎప్పుడైతే సుమోటోగా తీసుకుంటున్నట్లుగా ప్రకటించిందో, అప్పటి నుంచే అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఒక మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా జరిగిన ఈ లైంగిక దాడి, హత్యపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎవరిపై చర్యలకు పూనుకుంటుంది, బాధితురాలి కుటుంబానికి ఎలా న్యాయం చేకూరుస్తుంది అనే సందేహాలు కలిగాయి.

తాజాగా ఇవాళ సుప్రీం కోర్టు ఈ కేసు విచారణ చేపట్టిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1) దేశవ్యాప్తంగా డాక్టర్స్ భద్రత కోసం తీసుకుంటున్న చర్యలో వ్యవస్థాత్మక లోపాలు, సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు వేలెత్తి చూపింది. అందుకే ఈ కేసుని సుమోటోగా తీసుకున్నట్లుగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

2) డాక్టర్స్ కోసం పనిచేసే చోట సరైన సదుపాయాలు (వర్కింగ్ కండిషన్స్) లేకపోవడం తమని విస్మయానికి గురిచేసింది అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

3) మహిళలు పనిచేసే చోట వారికి అన్ని వసతులు కల్పించడం లేదంటే... ఈ సమాజంలో సమానత్వం అనే మాటకు ఇంకెక్కడ చోటుంది అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

4) కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం అవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

5) " చాలామంది యువ డాక్టర్లను 36 గంటలపాటు విధుల్లో ఉపయోగిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చింది. ఇది సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ప్రోటోకాల్స్‌కి విరుద్ధం. పనిచేసే చోట సరైన వర్కింగ్ కండిషన్స్ ఉండేలా ప్రోటోకాల్స్‌ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది " అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

6) తెల్లవారిజామునే నేరాన్ని గుర్తించినప్పటికీ ఆ ఘటనను కాలేజ్ ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చెప్పడంపై కూడా సుప్రీం కోర్టు అనుమానాలు వ్యక్తంచేసింది.

7) ఇంత ఘోరమైన దుర్ఘటన జరిగిన నేపథ్యంలో ఓవైపు కాలేజ్ ప్రిన్సిపల్ పాత్రపై విచారణ జరుగుతున్న దశలోనే అంత హడావుడిగా అతడిని కోల్‌కతా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా నియమించడం ఏంటని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ సర్కారుని ప్రశ్నించింది. అది కూడా వైద్య విద్యలో నగరంలోనే పేరున్న కోల్‌కతా మెడికల్ కాలేజీకి ఆయన్ను బదిలీ చేయడంపై కోర్టు అనుమానాలు వ్యక్తంచేసింది.

8) శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోన్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపే అధికారం పశ్చిమ బెంగాల్ సర్కారుకు లేదు అని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఒక రకంగా ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న ఆందోళనలు, ధర్నాల పట్ల అక్కడి సర్కారు వ్యవహరిస్తున్న తీరుకి ఇది పశ్చిమ బెంగాల్ సర్కారుకి హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది.

9) ఇంత పెద్ద నేరం జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్ సర్కారు శాంతి భద్రతల విషయంలో మరింత జాగ్రత్త వహించి నేరం జరిగిన స్థలానికి ఎవ్వరూ వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సింది. కానీ మమతా బెనర్జి సర్కారు ఆ విషయంలో ఎందుకు విఫలం అయ్యిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

10) డాక్టర్లు, మహిళా డాక్టర్లకు భద్రత అందించడం అనేది కనీస బాధ్యత. సమానత్వం అనే రాజ్యాంగసూత్రానికి ఇది తక్కువేం కాదు. కానీ వాస్తవ పరిస్థితి అలా ఉన్నట్లుగా కనిపించడం లేదు. మరొక చోట మరో దుర్ఘటన జరిగే వరకు వేచిచూడలేం. వైద్య రంగంలో పనిచేసే వారికి పనిచేసే చోట భద్రత కల్పించేందుకు రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నాయి అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories