India Elections 2024: నోటా అంటే ఏమిటి.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమవుతుంది..?
NOTA: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే తమ పాలకులను ఎన్నుకోవడం.
NOTA: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే తమ పాలకులను ఎన్నుకోవడం. అందుకు ప్రజలకు ఓటు అనే ఆయుధం ఇచ్చింది. ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా పాలకులను ఎన్నుకునే ప్రక్రియనే ఎన్నికల నిర్వహణ. ఈ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా అవసరం. ఇది ప్రజాస్వామ్యనికి ప్రతీక. అయితే ఓటర్లు ఏ అభ్యర్థినీ అర్హులుగా గుర్తించకపోతే.. ఎలా అన్న అనుమానాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఒక కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎంత మంది ప్రజలు ఎవరికీ ఓటు వేయడం సరికాదని భావిస్తున్నారో తెలుసుకునేందుకు నోటా ఆప్షన్ తీసుకుని వచ్చింది.. నోటా అంటే ఏమిటి..? నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమవుతుంది..?
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలే న్యాయనిర్ణేతలు. ప్రజా స్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం. కాలానుగుణంగా ఈ ఎన్నికల ప్రక్రియలో మార్పులు, సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో నిలిచే అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడుతూ ఉంటారు. వారిలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేయడం.. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో మోజార్టీ వ్యక్తుల అభిప్రాయం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది.. కానీ ఈ ప్రక్రియలోనూ కొన్ని లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 100 మంది ఓటర్లు ఉన్న ఓ నియోజకవర్గంలో నాలుగైదు పార్టీలు, ఒకరిద్దరు స్వతంత్రులు పోటీ చేస్తే.. వారిలో ఒక అభ్యర్థికి 25 ఓట్లు, మిగతా అభ్యర్థులు, స్వతంత్రులకు 20 ఓట్ల కంటే తక్కువ వచ్చాయని అనుకుందాం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 25 ఓట్లు పొందిన అభ్యర్థి గెలిచినట్టు లెక్క. కానీ నిజానికి గెలిచిన అభ్యర్థిని వ్యతిరేకించిన ఓటర్లు 75 మంది ఉన్నారు. అందుకే వారు తమకు నచ్చిన ఇతర అభ్యర్థికి ఓటేశారు. కానీ ఓటర్లు నిరాకరించడం అనేది లెక్క లోనికి తీసుకోవడం లేదు. కాబట్టి మెజార్టీ ప్రజలు అంగీకరించకపోయినా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో గెలుపొందే అవకాశం ఉంది.
ఇంతకుముందు... పోటీలో ఉన్న అభ్యర్ధులెవరూ ఓటరుకు నచ్చలేదంటే.. తన వ్యతిరేకతను తెలియ చేయడానికి ఒకటే మార్గం ఉండేది. అది పూర్తిగా ఎన్నికలను బహిష్కరించడమే. ఇప్పుడు నోటా దానికి ప్రత్యామ్నాయంగా వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో 100 ఓట్లకు పోలవుతున్నది గరిష్టంగా 70 శాతం కూడా ఉండడం లేదు. పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ఓట్లు పోలైతే గొప్ప విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లు... తమకు అభ్యర్థులు నచ్చలేదని ఓటేయడం మానేస్తే.. ప్రజాస్వామ్య దేశంలో ఆ ఎన్నికలకు అర్ధం లేకుండా పోతుంది. అందుకే అభ్యర్థులు నచ్చకపోయినా సరే... ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సరికొత్త అవకాశమే నోటా. నన్ ఆఫ్ ద అబోవ్... అనే పదానికి సంక్షిప్త రూపమే NOTA. అంటే పైన ఉన్న అభ్యర్థులెవరూ కాదు.. అని దాని అర్థం. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒక గుర్తు కలిగి, ఈవీఎంలో అన్నింటి కంటే చివరన ఉంటుంది. అభ్యర్ధుల జాబితాలో ఏ ఒక్కరూ నచ్చలేదని అనుకున్నప్పుడు ఓటర్ ఈ నోటాకు ఓటు వేయచ్చు.
కేంద్ర ఎన్నికల సంఘం నోటాను అందుబాదులోకీ తీసుకరావడం వరకు ఒకే. అయితే నోటా ఎంత వరకు సద్వినియోగం అవుతుందన్నది కూడా పెద్ద ప్రశ్నగానే మారింది.. ఆచరణలో నోటాచుట్టూ ఎన్నో సవాళ్ళు ఉన్నాయి.. అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి... ఎవరూ నచ్చలేదని నిర్ణయించుకుని నోటాకు ఓటేసే ప్రజలు చాలా తక్కువ. 100 మందిలో ఒకరిద్దరు ఉంటే ఎక్కువ. అటూ ఇటూగా సగటున 1 శాతం లోపే ఈ గుర్తుకు ఓట్లు పోలవుతుంటాయి. 2023 ఏడాది చివర్లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 1.5 శాతం ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనిద్వారా ఆ మేరకు ఓటర్లు తమ నిరసన వ్యక్తం చేసినట్లు రికార్డవుతోంది. కానీ ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లు నోటా సాధిస్తే ఏమవుతుంది..? ఇదే ప్రశ్న ఓటు వేయడానికి వెళ్లేచాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. అసెంబ్లీ, లోకసభకు జరిగి ఎన్నకల్లో.... ఒకవేళ ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయంటే అక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అంటే మోజార్టీ ప్రజలు అభ్యర్థులను తిరస్కరించినా సరే... వారి తిరస్కరణకు ఫలితం లేకుండా పోతోంది. ఇదే అంశం పై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హోరాహోరీగా వాదనలు జరిగియి. తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిటీషనర్లు కొన్ని సూచనలు చేశారు. ఓటర్ల తిరస్కరణను కచ్చితంగా గుర్తించాలని... ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు సాధిస్తే... అక్కడ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు.
రెండోసారి కూడా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లను ప్రభావితం చేయగల సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తే... పదే పదే నోటాకే ఓట్లు వేయించే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందన్న చర్చ తలెత్తింది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల సంగతి ఇలా ఉంటే... ఇప్పటికీ నోటా అంటే కోరల్లేని పులిగా మారిందనే వాదన ఉంది. అయితే నోటా ఎన్నికల్లో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వా మ్యాన్ని పెంచుతుంది. ఈ అప్షన్‌తో ఓటర్ తన అయిష్టతను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది. దీంతో తాము నిలపెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించలేదని, మంచి అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీలకు సందేశం పంపినట్లువుతుంది.
ప్రజలు తిరస్కరించిన అభ్యర్థులను మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా చేయాలన్న వాదన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయింది. నోటా నిబంధనలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే మిగత అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు. డిసెంబర్ 2018 లో హర్యానాలోని 5 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితిలో అభ్యర్థలందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం మళ్ళీ ఎన్నికలు నిర్వహించింది.
మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 లో ఆ రాష్ట్రంలో నోటాకు కల్పిత ఎన్నికల అభ్యర్థి హోదా ఇచ్చింది. ఆ ఉత్తర్వులప్రకారం ఊహాత్మక అభ్యర్థిగా ఉన్న నోటాకు, వాస్తవ అభ్యర్థికి సమాన ఓట్లు వస్తే... అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన నిజమైన అభ్యర్థిని విజేతగా నిలుస్తాడు. అన్నింటి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో పర్యాయం కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మూడో సారి ఎన్నికలు నిర్వహించరు. అటు వంటి పరిస్థితిలో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలను రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ తరహా మార్పులు, సంస్కరణలు చట్టసభలకు జరిగే ఎన్నికల్లో అమలు చేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
నోటా లేని కాలంలో ఓటరు ఏ అభ్యర్థినీ ఇష్టపడకపోతే...ఓటు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. దీంతో ఆ ఓటు వృథా అయ్యేది...అయితే ఇన్ని అవకావకాశాలు ఉన్నా ఓటు వేయడానికి బద్దకిస్తున్న వారు ఇంకా చాలా మందే ఉన్నారు. నిర్బంధ ఓటింగ్ విధానం అమలు చేస్తే తప్ప నోటా లాంటి ఆప్షన్లకు విలువ ఉండదు. 50 నుంచి 70 శాతం పోలింగ్ నమోదు అయ్యే నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు పలువురు అభ్యర్థులు గెలిచేది 30శాతం ఓట్లతోనే అంటే ఇంకా 70శాతం ఓటర్లు ఆ అభ్యర్థిని వ్యతిరేకించినట్లే.. నోటా ప్రయోజనం ఖచ్చితంగా నెరవేరాలంటే నిర్బంధ ఓటింగ్ ఒక్కటే సరైన మార్గమని.. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire