ఇ-సిగరెట్‌ అంటే ఏంటి..ఇ-సిగరేట్ల నిషేధం ఫలితాలిచ్చేనా?

ఇ-సిగరెట్‌ అంటే ఏంటి..ఇ-సిగరేట్ల నిషేధం ఫలితాలిచ్చేనా?
x
Highlights

ఓ సమస్య నివారణ చర్యలు మరో సమస్యకు దారి తీశాయి. ఓ అడిక్షన్ నుంచి తప్పించాలని భావిస్తే మరో అడిక్షన్ కి కారణమైంది. టోటల్ గా ఆ అలవాటే పొగ బారింది....

ఓ సమస్య నివారణ చర్యలు మరో సమస్యకు దారి తీశాయి. ఓ అడిక్షన్ నుంచి తప్పించాలని భావిస్తే మరో అడిక్షన్ కి కారణమైంది. టోటల్ గా ఆ అలవాటే పొగ బారింది. కొత్తపుంతలు తొక్కిన ఆ పాగ పొగకే పొగ పెట్టి నిషేధానికి గురైంది.

పొగాకుకు బానిసలైన వాళ్ళని మళ్ళించే ప్రయత్నంలో వచ్చిన ఇ-సిగరెట్ కొత్త సమస్యలను తెచ్చింది. పొగాకు పొగ అలవాట్లు లేని పిల్లలు, యూత్ కూడా ఇ-సిగరెట్లకు అలవాటు పడ్డారు. అంతేగాక ఇందులో ఉండే నికోటిన్ అనే ప్రమాదకర పదార్థం అనారోగ్యాలకు దారితీస్తున్నది. దీంతో ఇ-సిగరెట్లని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఇ-సిగరెట్లకు పొగ పెట్టిన ప్రభుత్వ చర్యపై భిన్నవాదనలు కూడా వినిపిస్తున్నాయి.

పొగాకు ని ఇంగ్లీష్ లో టొబాకో అంటారు. టోబాకో అనే పదం స్పానిష్-పోర్చుగీసు పదం. దీనికి పూర్వ పదం టయానో అంటే చుట్ట చుట్టిన పొగాకు ఆకులని అర్థం. ఇటాలియన్ లో దీన్నే ఔషధ మూలికలు అనే అర్థంలో వాడేవాళ్ళు. అరబిక్ లో టుబ్బాక్ అనే పదం ఉంది. దీని అర్థం కూడా ఔషధ మూలికలు అనే. అమెరికాలో మూలవాసులు వాడిన ఈ టోబాకోని స్పెయిన్ రాజు కింగ్ ఫిలిప్ -2 1559లో ప్రపంచానికి పరిచయం చేశారు. క్రమేణా 1700 నాటికే, యూరప్ లో పొగాకు తాగడం, నమలడం వంటివి వచ్చేశాయి. అయితే టోబాకో నికోటియానా అనే జాతికి చెందిన మొక్క.

మన దేశంలో క్రీ.పూ.2000 ఏడాదిలోనే కన్నాబీస్ పొగతాగాడట. అథర్వణ వేదంలో ఇది ఉంది. ఆయుర్వేదంలో ధూప, హోమ అనే పదాలు కూడా ఉన్నాయి. అయితే, 17వ శతాబ్ధంలో ఇండియాలో పొగాకు వచ్చింది. ఇక్కడి సంప్రదాయ పొగాకుతో కలిసిపోయింది. ప్రస్తుతం దేశంలో 70శాతం పురుషులు, 15శాతం మహిళలు పొగతాగుతున్నారు. అలాగే పురుషుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు, మహిళల్లో ప్రతి 20మందిలో ఒకరు టొబాకో బారిన పడి చనిపోతున్నారు. అత్యధికంగా బీడీలు తాగే వాళ్ళు ఉత్తరాఖండ్ లో ఉంటే అత్యధికంగా 82శాతం పురుషులు, 23.5శాతం మహిళలు సిగరెట్స్ తాగే ప్రాంతం కోల్కటా. దేశంలో కేవలం 10శాతం టొబాకో వినియోగంతోనే ఏటా 40వేల కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వస్తున్నది. ట్యాక్స్ రెవిన్యూలో 86శాతం లీగట్ సిగరెట్ల దే అంటే ఆశ్యర్యం వేయక మానదు.

ఇంతగా ఆదాయం ఉన్నప్పటికీ పొగకు బానిసలవుతున్నవాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతున్నది. పొగతాగేవాళ్ళేగాక, పక్కనే ఉండి ఆ పొగని పీల్చేవాళ్ళు పాసివ్ స్మోకర్లుగా మారుతున్నారు. ఈ పొగ బారి నుంచి అడిక్ట్ అయిన వాళ్ళని రక్షించేందుకు వచ్చిందే ఇ-సిగరెట్లు. తాజాగా ఇ-సిగరెట్లను కూడా ప్రభుత్వం నిషేధించింది. మోదీ ప్రభుత్వం ఈ ఇ-సిగరెట్స్ ని ఎందుకు నిషేధించింది? ఆ వివరాలు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇ-సిగరెట్లని నిషేధించింది. ఇ-సిగెటర్లకు అడిక్ట్ అవుతున్న యూత్, పిల్లల సంఖ్య పెరగడంతోపాటు అనారోగ్య కారకం కావడంతో ఈ నిషేధం విధించిట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తన నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక దేశంలో ఈ ఇ-సిగరెట్లని తయారు చేయడం, నిల్వ చేయడం, అమ్మకాలు సాగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. చట్టం అమలులోకి వచ్చాక వినియోగించడం, ఉత్పత్తి చేయడం, తయారు చేయడం, ఎగుమతి, దిగుమతులు చేయడం, రవాణా చేయడం, అమ్మకాలు సాగించడం, పంపిణీ చేయడం, నిల్వ ఉంచడం వంటి వన్నీ చట్ట వ్యతిరేకం. చివరకు ఈ సిగరెట్ల మీద ప్రకటనలు కూడా నిషేధమే.

ఇ-సిగరెట్లతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇ- సిగార్స్ కి వాడే పరికరాలను కూడా నిషేధించింది. అవి హీట్‌-నాట్‌ బర్న్‌ ధూమపాన పరికరాలు, వేపింగ్‌ పరికరాలు, ఈ-నికోటిన్‌ ఫ్లేవర్డ్‌ హుక్కాలు. నిజానికి చైన్ స్మోకర్లు, పొగ తాగడానికి అడిక్ట్ అయిన వాళ్ళను దాన్నుంచి దూరం చేయడానికి ఈ సిగరెట్ల పద్ధతి వచ్చింది. తర్వాత దీన్ని బాగా ప్రోత్సహించారు. కానీ, ధూమపాన వ్యసనపరులను మార్చడానికి వచ్చిన ఈ ఇ-సిగరెట్లు యూత్ ని, పిల్లల్ని ఏమారుస్తున్నాయని, సమాజానికి, ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ సిగరెట్లను వారు ఒక ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. ఇది విస్తృతంగా వ్యాపించకముందే దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2016-17 మరియు 2017-18 ఏడాదుల్లో ఇ-సిగరెట్ల దిగుమతులు లక్షా 91 వేల, 781 రూపాయల కోట్ల వరకు ఉంది. కేంద్రం చేసిన ప్రస్తుత ప్రకటనకు ముందే 15 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో వీటి నిషేధం అమలులో ఉంది. పంజాబ్, కర్ణాటక, మిజోరాం, కేరళ, జమ్ము కశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్,మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, హిమచాల్ ప్రదేశ్, పుదుచ్ఛేరి, రాజస్థాన్, మేఘాలయ, ఓడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో నిషేధం అమలు అవుతున్నది. దేశంలో మొదటిసారి పొగతాగడాన్ని నిషేధించిన రాష్ట్రం కేరళ. 1999 జులై 12న కేరళలో స్మోకింగ్ ని పబ్లిక్ ప్లేసెస్ లో తాగడాన్ని నిషేధించారు.

అసలీ ఈ ఇ-సిగరెట్లు అంటే ఏంటి? వాటి వివరాలేంటి? వాటి వినియోగం, ఉపయోగాలేంటో ఓసారి చూద్దాం

సిగరెట్‌ లేదా పెన్నులాగా ఉండే ఎలక్ట్రానిక్‌ పరికరం. వీటిలో పొగాకు ఉండదు. రకరకాల ఫ్లేవర్లతో కూడిన నికోటిన్‌ ద్రావకం, ఇతర రసాయనాలు ఉంటాయి. సిగరెట్‌ అంత ప్రమాదకరం కాకపోయినా, వీటిలో ఉండే రసాయనాలు కూడా హానికరమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ-సిగరెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అందులోని నికోటిన్‌ ద్రావకం పొగలాగా మారి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సిగరెట్‌ తాగిన అనుభూతినిస్తుంది. అందుకే సిగరెట్‌ మానాలనుకునేవారు ఈ-సిగరెట్లవైపు మళ్లుతారని ఒక అంచనా. అయితే, అసలు సిగరెట్‌ అలవాటు లేని యువత, పిల్లలు ఇ-సిగరెట్ల వైపు ఆకర్షితులవుతున్నారు.

ఇ-సిగార్ లో క్లియర్ ట్యూబ్ ట్యాంక్ ఉంటుంది. దీనికి 4విక్స్ తో కూడిన బేస్ విత్ బ్యాటరీ ఉంటుంది. వినియోగదారు గుప్పుమని తాగడానికి డ్రిప్ టిప్ కూడా ఉంటుంది. దానినే మౌత్ పీస్ అని కూడా అంటారు. ట్యాంక్ లోనే ఇ-లిక్విడ్ ఉంటుంది. దీనికి బ్యాటరీ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. ఎల్ఇడి డిజిటల్ డిస్ ప్లేతో, పవర్ గ్రిడ్ ఓల్టేజీ బటన్ తో కూడి మైక్రో ‍యుఎస్ బి పోర్ట్ కలిగి ఉంటుంది. దీనిలో నికోటిన్ పోస్తారు. ఆ నికోటిన్ నికోటియానా ట్యాబాకమ్ అనే మొక్క ఆకుల నుంచి తీస్తారు. రెడీ మేడ్ గా ఉన్న పెన్ ఇ-సిగార్ ని, రీచార్జర్ ని కూడా మీరు చూడొచ్చు.

ఆ సిగరెట్ల బ్యాటరీ శక్తి, యూనిట్ సర్క్యూట్ పరిస్థితి, అందులో వాడే రసాయనిక పదార్థాలు, వినియోగదారుడి ప్రవర్తనను బట్టి ఇ-సిగరెట్ ప్రభావం ఆధారపడి ఉంటుంది. వేపర్లు, వాటి తీవ్రతల వల్ల వచ్చే పొగల ఆధారంగా వాటి ప్రభావాన్ని లెక్కగడతారు. బ్యాటరీ ఓల్టేజ్, సర్క్యూట్ శక్తి అనేక ముఖ్యమైన అంశాలు. బ్యాటరీ ఓల్టేజీని, సర్క్యూట్ ని ఎంత ఎక్కువ చేస్తే దాని ప్రభావం అంతగా పెరుగుతుంది. ఈ అంశాల మీదే నికోటిన్ విడుదల ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే మత్తు పదార్థం విడుదల మోతాదు ఉంటుంది. 2014 రిపోర్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే విషయాలను గుర్తించి, ప్రకటించింది. ప‌ఫ్ ల సంఖ్య... అంటే... గుప్పుగుప్పున వచ్చే పొగలు, ఉచ్ఛాశ్వ లోతు, వినియోగ ఫ్రీక్వెన్సీ ల మీద అందులో ఉండే నికోటిన్ విడుదల-వినియోగం ఆధార పడి ఉంటుందని కూడా ఆ సంస్థ వివరించింది. వేగం, లోతైన పఫ్లు నికోటిన్ ని అంతే వేగంగా అందిస్తాయి. తాపన మూలకం యొక్క శీతలీకరణ కారణంగా ఇది ఇ-సిగరెట్ల నుండి తగ్గిపోతుంది.

ఈ ఇ-సిగరెట్ల వల్ల వచ్చిన సమస్యలేంటి? అనారోగ్య కారకాలా? అయితే.. వీటి ద్వారా ఏయే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో చూద్దాం.

ఇ-సిగరెట్ యొక్క ద్రావణంలో నికోటిన్ ఉపయోగించిన తర్వాత, దాని మధ్య వ్యత్యాసం మరియు సాంప్రదాయ సిగరెట్ అస్పష్టంగా ఉంటుంది. ఆరోగ్య ప్రమాదాల పరంగా, ఇ-సిగరెట్ బట్వాడా చేసే శక్తి నికోటిన్ దాని ఉపయోగం ఎంత ప్రమాదకరమో నిర్ణయిస్తుంది. నికోటిన్ డెలివరీ త్వరగా మరియు శక్తివంతంగా ఉంటే, ఇ-సిగరెట్ సాంప్రదాయ సిగరెట్ కంటే భిన్నంగా ఉండదు. నికోటిన్ డెలివరీ సామర్థ్యం ఒక బ్రాండ్ నుండి మరొక బ్రాండ్‌కు మారుతుంది. ఈ సామర్థ్యం ఉపయోగించిన పరిష్కారం యొక్క బలం మరియు వినియోగదారు పఫ్ లను తీసుకునే ప్రవర్తనపై కూడా ఆధారపడి ఉంటుంది. వారి వ్యసన శక్తి విషయానికి వస్తే, ఇ-సిగరెట్లలో నికోటిన్ సొల్యూషన్స్ వాడటం వలన అవి సమానంగా వ్యసనపరుడవుతాయనే వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుంది

ఇ-సిగార్ తరచూ తాగడం వల్ల మెదడు అడిక్ట్ అవుతుంది. మెదడులోకి క్రమంగా పోగ ద్వారా నికోటిన్ ఎక్కుతుంది. కళ్ళు మసకబారి, మంటలు పుట్టి ఇరిటేషన్ గా ఉంటుంది. నోటిలో ఇరిటేషన్ తోపాటు, దగ్గు వస్తుంది. గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఛాతిలో నొప్పి, బీపీ వస్తుంది. కడుపులో నొప్పి, వాంతులు వస్తాయి. అంతేకాదు ఊపిరితిత్తులు, పెద్దపేగు, కాలేయం దెబ్బతింటాయి. కండరాలు బిగుసుకుపోతాయి. జాయింట్ పెయిన్స్ వస్తాయి. మహిళల్లో ఇది గర్భధారణ సమయంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదమే. టైప్ 2 డయాబెటీస్ కి ఛాన్సుంది. ఓబెసిటీ, హైపర్ టెన్షన్ అనేకానేక విపత్తులున్నాయి. హృదయ సంబంధ వ్యాధులకు దోహదం చేస్తుంది. నికోటిన్ కూడా క్యాన్సర్ కానప్పటికీ, ఇది కణితి ప్రమోటర్‌గా పనిచేస్తుంది. ప్రాణాంతక వ్యాధుల జీవశాస్త్రం ప్రాథమిక అంశాలలో నికోటిన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ-సిగరెట్ల అమ్మకం, నిల్వ మరియు తయారీని నిషేధించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ చర్యను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "ఇ-సిగరెట్లు ప్రజలను వారి ధూమపాన అలవాట్ల నుండి బయటపడటానికి ఒక మార్గంగా ప్రచారం చేయబడ్డాయి, కాని చాలా మంది దీనిని ఉపయోగించడం లేదని నివేదికలు చూపించాయి, అందువల్లే నిషేధం తప్పలేదన్నారు. ఇ-సిగరెట్లను నిషేధించే నిర్ణయం యువతను రక్షించడమే లక్ష్యంగా ఉందని, ఇ-సిగరెట్ల ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగించే విభాగం ఇది అని మంత్రి చెప్పారు. దేశంలో ప్రస్తుతం 400 బ్రాండ్ల ఈ-సిగరెట్లు 150 ఫ్లేవర్లలో లభ్యమవుతున్నాయి. వాటిలో ఒక్కటి కూడా భారతదేశంలో తయారవుతున్నవి కావు'' అని ఆమె పేర్కొన్నా రు.

హైదరాబాద్ లోనూ ఇ-సిగరెట్ల అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నా సరే, అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. మొజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, అల్వాల్, సికింద్రాబాద్ లలో రహస్యంగా ఈ దందా నడుస్తున్నది. బాగా తెలిసిన వ్యక్తులకే ఇవి దొరుకుతాయి. గుట్కా, పాన్ సెంటర్లలో బాగా పరిచయం ఉన్న వాళ్ళకే పెన్ అంటే చాలు తీసి ఇస్తున్నట్లుగా hmtv పరిశోధనలో తేలింది. ఒక్కో ఇ-సిగరెట్ ధర 700 రూపాయల నుంచి 5వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. కొందరు ఆన్ లైన్ లో కూడా కొనుగోళ్ళు చేస్తున్నారు.

అత్యంత ఆకర్షణీయమైన ప్యాకుల్లో యూత్ ని అట్రాక్ట్ చేసే ఈ ఇ-సిగరెట్ల మార్కెట్ ఏంటి? నిషేధం వల్ల ప్రయోజనాలేంటి? నిషేధ పరిణామాలేంటో చూద్దామా

ఈ ఇ-సిగరెట్ల ఉత్పత్తులు ఆకర్షణీయమైన ప్యాక్ లలో, రకరకాల రుచులతో వస్తాయి. వాటి ఉపయోగం విపరీతంగా పెరిగింది. వీటి విచ్చలవిడి వినియోగం వల్ల ఇదో వ్యసనంలా విస్తరించింది. ముఖ్యంగా యువత. పిల్లలలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం అంటున్నది. నేషనల్ యూత్ టోబాకో సర్వే ప్రకారం ఈ ఇ-సిగార్స్ మీద ప్రకటనలతోపాటు వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. ఇ-సిగరెట్లపై నిషేధం వల్ల ప్రధానంగా ఈ వ్యసనం బారిన పడిన యువత, పిల్లలను రక్షించడానికి వీలవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇ-సిగరెట్ల ఆదరణ నానాటికి పెరుగుతున్నది. 2013 లో ఇ-సిగరెట్ల ప్రపంచ మార్కెట్ అంచనా విలువ 3 బిలియన్లు. 2014 నాటికే 466 బ్రాండ్లు ఇ-సిగరెట్లను ఉత్పత్తి చేస్తున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయని, యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ అనే మార్కెట్ పరిశోధన సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచ ఇ-సిగరెట్ మార్కెట్ 17 రెట్లు పెరుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం, అత్యంత ప్రాచుర్యం పొందిన వేరియంట్ ఇ-సిగరెట్లు, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చైనా, యుఎస్, హాంకాంగ్, జర్మనీ దేశాల నుండి ఇవి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. 2018 ఏడాది మధ్య యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఓ సర్వే చేసింది. హై స్కూల్స్ లో 3.62 మిలియన్ల మంది విద్యార్థులు ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారని అంచనా వేసింది. అలాగే, 2017 మరియు 2018 మధ్య, ఇ-సిగరెట్ వాడకం హైస్కూల్ విద్యార్థులలో 78 శాతం, హై స్కూల్ లోపు పాఠశాల విద్యార్థులలో 48 శాతం పెరిగింది.

ప్రత్యేకంగా ఇ-సిగరెట్లు, పొగాకు ధూమపానం మానేయడానికి ప్రజలకు సహాయపడటంలో బాగానే పని చేస్తున్నాయనే వాదన ముందుకు వస్తున్నది. అయితే, ఈ ఇ-సిగరెట్ల ప్రభావాన్ని అంచనా వేయడానికి అవసరమైన అధ్యయనాలు మాత్రం పెద్దగా అందుబాటులో లేవు. మరోవైపు పోగాకు వాడకాన్ని పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. అయితే కొత్త చట్టం ఏం చెబుతున్నది? ఏయే శిక్షలు విధిస్తున్నదో చూద్దాం.

ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం ఆర్డినెన్స్, 2019 త్వరలోనే అమలులోకి వస్తుంది. ఆ చట్టం ప్రకారం ఈ నిబంధనలు వర్తిస్తాయి.

1) ఇ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, ఆన్‌లైన్ సహా, అన్ని రకాల అమ్మకాలు, పంపిణీ లేదా ప్రకటనలు చేయడం దేశంలో పూర్తిగా నిషేధం

2) నిషేధిత చట్టంలోని ఏ నిబంధనను అతిక్రమించినా, ఏడాది వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ శిక్షలు.

3) ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.

4) కొత్త నిబంధన ప్రకారం, ఇ-సిగరెట్లు నిల్వ చేసినవారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 50 వేల జరిమానా లేదా రెండూ శిక్షలూ విధిస్తారు.

ఒకవేళ ఇ-సిగరెట్ల నిల్వలు ఉన్నవారు ఆర్డినెన్స్ అమల్లోకి రాకముందే వాటిని స్వయంగా సమీప పోలీస్ స్టేషన్లో డిక్లేర్ చేయాలి.

మరోవైపు ఇండియాని అనేక దేశాలు అభినందించాయి. భారత్‌లో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, ప్రకటనలపై నిషేధాన్ని విధిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించిన వెంటనే, అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అమెరికాలోని అడ్వకసీ గ్రూప్ సైతం భారత ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురిపించింది. భారత్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని యూత్‌ను కాపాడే విషయంలో అన్ని దేశాల కంటే భారత్ పై స్థానంలో ఉందని అమెరికాకు చెందిన నేత మ్యాథ్యూ ఎల్ మైయర్స్ కొనియాడారు. ఆయన పొగాకు రహిత సమాజాన్ని సృష్టిద్దామంటూ అమెరికాలో స్థాపించిన ఓ ప్రచార సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు.

ఈ ఇ-సిగరెట్లు నిషేధించినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయా? బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహించినట్లవుతుందన్న ఆరోపణలున్నాయి. నకిలీవి, తక్కువ ప్రమాణాలతో కూడినవి కూడా బ్లాక్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇ-సిగరెట్లు అందుబాటులో లేని వాళ్ళు తిరిగి పోగాకు సిగరెట్లకి మళ్ళే ప్రమాదం కూడా ఉంది.

ఇ-సిగరెట్ల మీద చర్యలు సరే, అంతా అభినందిస్తున్నారు కానీ, పొగాకు సిగిరెట్ల పరిస్థితి ఏంటి? పొగాకు సిగరెట్ల నిషేధం లేదా నియంత్రణ వంటి అంశాలను కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకూడదన్న చట్టం అమలు అంతంత మాత్రంగానే ఉంది. చట్టాల సంగతి ఎలా ఉన్నా ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచడంపైన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories