Amit Shah About Dr BR Ambedkar: పార్లమెంట్‌లో అంబేద్కర్ గొడవ- అసలు ఏం జరిగింది?

Amit Shah About Dr BR Ambedkar: పార్లమెంట్‌లో అంబేద్కర్ గొడవ- అసలు ఏం జరిగింది?
x
Highlights

What Amit Shah said about Dr BR Ambedkar: అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించారనే వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి....

What Amit Shah said about Dr BR Ambedkar: అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించారనే వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. దీనిపై రెండు రోజులుగా పార్లమెంట్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. అమిత్ షాను కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంబేద్కర్‌పై అమిత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై టీఎంసీ ఎంపీ డెరాక్ ఒబ్రాయన్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది.

కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని మోదీ చెప్పారు. తాను అంబేద్కర్‌ను అవమానించలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు. కానీ, విపక్షాలు మాత్రం శాంతించలేదు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఇంతకీ అంబేద్కర్‌పై అమిత్ షా ఏం వ్యాఖ్యలు చేశారు? విపక్షాల నెక్స్ట్ స్టెప్ ఏంటి?


అమిత్ షా ఏమన్నారు?

రాజ్యసభలో డిసెంబర్ 17న రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తన ప్రసంగంలో అంబేద్కర్ గురించి ప్రస్తావించారు.ఈమధ్య అంబేద్కర్... అంబేద్కర్.. అంబేద్కర్.. అని చెప్పడం ఫ్యాషనై పోయింది. వారు దేవుడి పేరును ఇన్నిసార్లు ప్రస్తావిస్తే వారికి స్వర్గంలో స్థానం లభించేదని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరును కాంగ్రెస్ తీసుకోవడం సంతోషంగా ఉందని... ఆయన పట్ల తమ మనోభావాల గురించి కూడా ఆ పార్టీ మాట్లాడాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఇండియా కూటమి సభ్యులు నిరసనకు దిగారు. అమిత్ షా రాజీనామా చేయాలని కోరారు. డిసెంబర్ 18న ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్ సభ ,రాజ్యసభ వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ విపక్షాలు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. వెల్ లోకి వచ్చి నిరసనకు దిగారు. డిసెంబర్ 19న కూడా ఉభయసభల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

నరేంద్ర మోదీ ఏమన్నారంటే?

అంబేద్కర్ ను అవమానించేలా చేశారని విపక్షాలు అమిత్ షా పై విరుచుకుపడుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అండగా నిలిచారు. అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపివేసేందుకు ఓ పార్టీ ప్రయత్నించిందని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని.. ఈ వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఖంగుతిందని మోదీ ఎక్స్ లో పోస్టు పెట్టారు. అంబేద్కర్ లండన్ లో నివసించిన భవనాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అమిత్ షా

పార్లమెంట్ లోపలే కాదు బయట కూడా ఇదే విషయమై విపక్షాలు అమిత్ షా ను టార్గెట్ చేశాయి. అమిత్ షా ను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని ఎఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వ్యాఖ్యలను అమిత్ షా తోసిపుచ్చారు. తన మాటలను కాంగ్రెస్ వక్రీకరించిందని ఆయన చెప్పారు. రాజ్యసభలో తన ప్రసంగాన్ని పూర్తిగా వింటే అసలు ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకి. తాను కానీ, తమ పార్టీ కానీ ఏనాడూ అంబేద్కర్ ను అవమానించలేదని ఆయన వివరణ ఇచ్చారు.

బీజేపీ వైఖరిని సూచిస్తున్నాయి: ప్రకాశ్ అంబేద్కర్

ఈ వ్యాఖ్యలపై విపక్షాలే కాదు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా తప్పుబట్టారు.అమిత్ షా వ్యాఖ్యలు ఆ పార్టీ పాత మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని ఆయన అన్నారు. బీజేపీకి పూర్వ రూపం జన్ సంఘ్ అని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో జన్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ ను వ్యతిరేకించాయని ఆయన చెప్పారు.

అమిత్ షా వ్యాఖ్యలపై ఎవరేమన్నారు?

అమిత్ షా వ్యాఖ్యలను ఆర్ జే డీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఆయనకు పిచ్చి పట్టిందని లాలూ అన్నారు. తన పదవికి రాజీనామా చేయాలని ఆయన అమిత్ షాను డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోయి ఉంటే అమిత్ షా పాత ఇనుము వ్యాపారిగా ఉండేవారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సెటైర్లు చేశారు.

అంబేద్కర్ ను గౌరవించేవాళ్లు ఎవరూ కూడా బీజేపీకి మద్దతివ్వరనే భావనకు జనం వచ్చారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై నితీష్ కుమార్, చంద్రబాబు స్పందించాలని ఆయన కోరారు. ఈ మేరకు వారిద్దరికి లేఖలు రాశారు.

అత్యంత పాపాలు చేసేవారు మాత్రమే పుణ్యం గురించి ఆలోచించాలి. దేశం గురించి ఆలోచించేవాళ్లు అంబేద్కర్ గురించి ఆలోచిస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. బీజేపీ అహంకారానికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని శివసేన యూబీటీ అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.ఈ వ్యాఖ్యలను బీజేపీ మిత్రపక్షాలు సమర్ధిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదానికి ఎలా పుల్ స్టాప్ పెట్టేందుకు అధికార పక్షం ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుందో.. అధికారపక్షానికి విపక్షం ఎలాంటి ప్రతి వ్యూహలను సిద్దం చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories