గెలవలేదు..ఓడలేదు.. బీజేపీ పాలకులకు హెచ్చరికలా రెండు రాష్ట్రాల ఫలితాలు?
గెలవలేదు..ఓడలేదు..విజయం కాదు...పరాజయం కాదు. కొట్టీ కొట్టనట్టు, తిట్టీ తిట్టనట్టు...గుచ్చీ గుచ్చనట్టు...బీజేపీ పాలకులకు హెచ్చరికలా రెండు రాష్ట్రాల...
గెలవలేదు..ఓడలేదు..విజయం కాదు...పరాజయం కాదు. కొట్టీ కొట్టనట్టు, తిట్టీ తిట్టనట్టు...గుచ్చీ గుచ్చనట్టు...బీజేపీ పాలకులకు హెచ్చరికలా రెండు రాష్ట్రాల ఫలితాలు...? మహారాష్ట్రలో ఇరగదీస్తాం, హర్యానాలో దుమ్మురేపుతాం అంటూ ఛాతి విరుచుకుని అరిచిన కాషాయ నేతలకు, జనం వార్నింగ్ బెల్ మోగించారా జాతీయత, హిందూత్వ అనే భావోద్వేగ అస్త్రాలే కాదు, దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను కూడా కాస్త పట్టించుకోండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారా? మహారాష్ట్రలో బీజేపీకి అఖండ విజయం తథ్యమన్న కమలం నేతలకు, ఈ ఫలితాలు గర్వభంగంగా ఎలా పరిణమించాయి...? సామదాన దండోపాయలు ప్రయోగించిన మహారాష్ట్రలో బీజేపీ, ఎందుకు అంతగా సత్తా చూపలేకపోయింది కారణాలేంటి?
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అఖండ విజయం సాధించి కేవలం ఆరేడు నెలలు. అటు మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు, బడుగు వర్గాలకు వరాలు, ఎలాంటి అవినీతి మరకాలేని దేవేంద్ర ఫడణవిస్ నాయకత్వం, బలహీన ప్రతిపక్షాలు, కాశ్మీర్, పాకిస్తాన్, దేశభక్తి ఇలా ఎటు చూసినా, మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించి తీరాలి. అసలు శివసేన గానీ, అటు ఎన్సీపీ వైపు చూడాల్సిన పనిగానీ, యాచించాల్సిన అగత్యమూ ఉండకూడదు. శాసించే స్థానాలు సాధించాలి. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిందన్న మాటే గానీ, అతి నిజంగా చచ్చి బతికిన చందంగా మారింది.
మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం ఖాయమని, సొంతంగానే మెజారిటీ కూడా సాధించినా ఆశ్చర్యంలేదని ఎగ్జిట్‌పోల్స్ సహా చాలామంది కాషాయ నేతలు అంచనాలు వేసుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం, ఆశించినవిధంగా రాలేదు. 288 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా, అంచనాల కంటే మరింత దిగువ ఫలితాలు పొందింది భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికల కంటే, ఈ కూటమికి 25కి పైగా స్థానాలు తక్కువగా వచ్చాయి. ఈ సీట్లతో ఆనంద పడాలో, సంతోష పడాలో అర్థం కాక, శివసేన విర్రవీగి గాండ్రిస్తే ఏం చెయ్యాలో అర్థంకాక సతమతమైపోతున్నారు కమలం అగ్రనేతలు.
మహారాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సమస్యలు గానీ, లేదంటే దేశవ్యాప్తంగా అలజడి రేపుతున్న ఆర్థికమాంద్యం, నిరుద్యోగిత, రైతాంగ సంక్షోభం వంటి ఇష్యూలను బట్టి గానీ ఎన్నికలకు వెళ్లలేదు బీజేపీ. మోడీ-ఫడణవిస్‌ల పనితీరును చూసి కూడా ప్రజలను అభ‌్యర్థించలేదు. కేవలం భావోద్వేగాలనే ఎన్నికల అస్త్రాలుగా వదిలింది. కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికలకు ఒక రోజు ముందు సర్జికల్ స్క్రైక్, ఐరాసతో పాటు అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం వంటి అంశాలనే ప్రస్తావించింది. జాతీయత, హిందూత్వ అనే తన అమ్ములపొదిలోని పాత అస్త్రాలనే బయటకు తీసింది. అయితే ఇవేమీ ఎన్నికల్లో పని చేయలేదనడానికి మహారాష్ట్ర ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కొంత వరకు అపజయాన్ని ఆపగలిగారే గానీ, సంపూర్ణ విజయాన్ని మాత్రం సాధించలేకపోయారు. అంటే ప్రజలు ఆర్థిక మాంద్యం, నిరుద్యోగిత, వ్యవసాయ సంక్షోభం, అధిక ధరలపై గుర్రుగా వున్నారని అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలు మాత్రమే ఎల్లకాలం నమ్ముకుంటే కష్టమని ఈ ఎన్నికలు హెచ్చరిక పంపాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో, 288 స్థానాల్లో 260 స్థానాల్లో సొంతంగా పోటీ చేసిన బీజేపీ, 122 సీట్లలోనే గెలుపొందింది. బీజేపీతో పొత్తు చెడిన కారణంగా, శివసేన ఏకంగా మొత్తం 288 స్థానాల్లోనే కంటెస్ట్ చేసింది. అయినా 63 స్థానాలనే గెలిచింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న శివసేన తోక ముడుచుకుని మళ్లీ బీజేపీ చెంతకు చేరింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు దాదాపు సమామనైన స్థానాల్లోనే పోటీ చేశాయి. బీజేపీ 25 మంది అభ్యర్థులను నిలబెడితే, అందులో ఏకంగా 23 మంది గెలిచారు. శివసేన 23 మందిని బరిలో నిలిపింది. 18మందిని గెలుచుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా రోజుల తర్జనభర్జన, పట్టువిడుపుల మధ్య రెండు పార్టీ మధ్య సీట్ల షేరింగ్ జరిగింది. బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తామంది. దీంట్లో రామథాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించింది. మిగతా 124 సీట్లలో పోటీ చేసింది శివసేన. కానీ రెండు పార్టీలు కలిసి 220 పైగా స్థానాల్లో విజయం సాధిస్తాయని, నాయకులు బీరాలు పలికారు. కానీ మునుపటి కంటే పాతిక స్థానాలకు పైగా నష్టపోయారు. దీంట్లో బీజేపీనే అత్యధికంగా కోల్పోయింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. కానీ రాష్ట్రాల ఎన్నికలు వచ్చే సరికి జనం కాస్త భిన్నంగా తీర్పిచ్చారు. దేవేంద్ర ఫడణవిస్ తమ కూటమికి 220 ప్లస్ సీట్లు వస్తాయన్న నినాదం, ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలన్న సందేశం ప్రజలిచ్చినట్టయ్యింది. మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర ప్రపంచాన్నే కదలించింది గానీ, పాలకులు స్పందించలేదు. తాగునీరు కటకట, కరవుతో మహారాష్ట్ర అల్లాడిపోతున్నా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేకపోయారు బీజేపీ పాలకులు. మరాఠా రిజర్వేషన్లు, పార్టీలతో పొత్తులు ఎత్తులు, జాతీయత, హిందూత్వ అనే అంశాలనే నమ్ముకుని, మహారాష్ట్రలో ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకోలేకపోయారు. ఆర్థిక రాజధానిలో ఆర్థికమాంద్యం సాక్షిగా కుప్పకూలుతున్న స్టాక్‌మార్కెట్లు, పతనమవుతున్న బ్యాంకులు, ఊడుతున్న ఉద్యోగాలను మరిపించేలా కాశ్మీర్, ఆర్టికల్ 370, పాకిస్తాన్, సావర్కర్ వంటి ఎమోషనల్ వెపన్స్‌ను, మోడీ, షాలతో సహా అగ్రనేతలు ప్రచారంలో సంధించారు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అందుకే ఆశించినంతగా రాణించలేకపోయింది బీజేపీ. ఎన్సీపీ వంటి చిన్న పార్టీ కూడా, ఊహించినదానికంటే ఎక్కువ స్థానాలు కొల్లగొట్టింది అంటే, బీజేపీ మీద ఎంతోకొంత వ్యతిరేకత ఉన్నట్టే లెక్క. అందుకే మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు రాబోయే ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిలకు బీజేపీకి వార్నింగ్ బెల్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire