రూ. 120 కోట్ల విలాసవంతమైన రైలు ప్రయాణానికి సిద్ధమా? లోపల చూస్తే మతి పోవాల్సిందే

రూ. 120 కోట్ల విలాసవంతమైన రైలు ప్రయాణానికి సిద్ధమా? లోపల చూస్తే మతి పోవాల్సిందే
x
Highlights

Vande Bharat Sleeper Train Features: వందే భారత్ చైర్ కార్ తర్వాత, ఇప్పుడు వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి...

Vande Bharat Sleeper Train Features: వందే భారత్ చైర్ కార్ తర్వాత, ఇప్పుడు వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి ఈ రైలు నమూనాను సిద్ధం చేశారు. త్వరలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తాజాగా రైల్వే అధికారులు ఈ రైలు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ రైలులో రాజధాని, శతాబ్ది వంటి రైళ్ల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో ఈ రైలు సౌకర్యాలలో విమానంతో పోటీపడుతుందని అంతా భావిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతం 78 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలపై పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంది. 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా అన్ని రైళ్ల కంటే మెరుగైన సౌకర్యాలు, హంగులతో రూపుదిద్దుకున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. వీటిని 24కి పెంచాలని యోచిస్తున్నారు. టచ్ సెన్సార్ డోర్లు, టచ్-ఫ్రీ బయో-వాక్యూమ్ టాయిలెట్లు, టాక్-బ్యాక్ యూనిట్లు వంటి ఫీచర్స్ ఈ రైలును ది బెస్ట్ ట్రైన్స్‌లో ఒకటి చేస్తాయి.

సెన్సార్ వంటి యాక్టివ్ ఇంటర్‌కనెక్టింగ్ డోర్లు ఇన్‌స్టాల్ చేశారు. కోచ్‌లో కేవలం సింగిల్ టచ్‌తో తెరుచుకునే డోర్స్ అమర్చారు. ఇక టాయిలెట్‌లో ఎక్కడ బటన్స్ అనేవే కనిపించవు. ఎందుకంటే ఏ బటన్ నొక్కకుండానే ఆటోమేటిగ్గా ఆపరేట్ అవుతుంది. అందుకే ఇలాంటి సౌకర్యాలు ఈ రైళ్లను విమానాలతో పోల్చుకునేలా చేస్తున్నాయి.

ఈ రైలు పూర్తిగా ఏసీ ఫీచర్‌తో ఉంటుంది. 820 మంది ప్రయాణికులు ఏకకాలంలో ప్రయాణించవచ్చు. రైలు వేగం గంటకు 160 కి.మీ.లు. అంటే స్పీడ్ పరంగా ఈ రైలు రాజధానిని తలపిస్తోంది.

భద్రతా ప్రమాణాల విషయానికొస్తే.. ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్ అందించారు. దీని నియంత్రణ చాలా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది. రైలు ఢీకొనకుండా రక్షించడానికి పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదాలను నివారించడానికి యాంటీ కొలిషన్ సిస్టమ్ 'కవచ్', యాంటీ-క్లైంబింగ్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. ఫ్లైట్-స్టైల్ అటెండెంట్ బటన్స్ ఉన్నాయి.


ఈ రైలు తయారీకి రూ.120 కోట్లు ఖర్చవుతుంది. ఈ రైలు డిజైన్‌ను ఐసీఎఫ్ ఇంజనీర్లు సిద్ధం చేశారు. రైలు కోచ్‌ను బీఈఎంఎల్‌లో తయారు చేశారు. రైలుకు రెండు చివర్లలో డ్రైవర్ క్యాబిన్స్ ఉంటాయి. ఈ రైలుకు లోకోమోటివ్ ఉండదు. సెల్ఫ్-ప్రొపెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది.


రైలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులు ఎలాంటి కుదుపులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజధాని కంటే ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు మెరుగైన అనుభవం ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories