UP Road Accident: రాఖీ పండగకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 27 మందికి గాయాలు

UP Road Accident: రాఖీ పండగకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 27 మందికి గాయాలు
x
Highlights

UP Road Accident: రాఖీ పండగకు వెళ్తుండగా విషాదం10 మందిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదానికి కారణం ఏంటంటే..

UP Road Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్‌షహర్ జిల్లా సాలెంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బదౌన్ - మీరట్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, మరో మ్యాక్స్ ట్రక్కు వాహనం ఎదురెదురుగా వేగంగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతానికి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది దుర్మరణం పాలుకాగా మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులలో కొంతమందిని అక్కడికి సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని మీరట్ ఆస్పత్రికి తరలించారు.

మ్యాక్స్ వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఘాజియాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోన్న ఉద్యోగులుగా తెలుస్తోంది. వీరంతా రాఖీ పండగ కోసం అలీఘడ్ సమీపంలోని తమ సొంత ఊర్లకు వెళ్లేందుకని బయల్దేరి వస్తున్న క్రమంలోనే ఊహించని విధంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారితే రక్షా బంధన్ వేడుకలతో కళకళలాడాల్సిన వారి ఇళ్లలో ఈ అనుకోని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ సోదరులు పండగ కోసం ఇంటికి వస్తున్నారని ఆశగా ఎదురుచూస్తోన్న ఆ అక్కాచెల్లెళ్ల ఆశలను చిదిమేస్తూ వారి కడచూపు కోసం వేచిచూసేలా చేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బులంద్ శహర్ జిల్లా కలెక్టర్ ప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు హూటాహూటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారని.. ఘటనా స్థలంలో పరిస్థితిని స్వయంగా సమీక్షించాల్సిందిగా సూచిస్తూ ఆయన జారీచేసిన ఆదేశాల మేరకు తాను అక్కడికి వచ్చినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో మ్యాక్స్ వాహనంలో 20 నుండి 22 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories