రైతులతో మరోసారి భేటీ కానున్న కేంద్ర మంత్రులు

రైతులతో మరోసారి భేటీ కానున్న కేంద్ర మంత్రులు
x
Highlights

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. దీంతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి భేటీ కానుంది.

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. దీంతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి భేటీ కానుంది. అయితే రైతుల ప్రతిపాదనలకు ఒప్పుకుంటూ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీస మద్దతు ధరపై రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రైవేటు మండీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ అంశాన్ని కూడా పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు చట్టాలపై రైతులకున్న సందేహాలు ఇవాల్టితో తీరుతాయని, సమావేశం అనంతరం వారు కచ్చితంగా ఆందోళన విరమిస్తారని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌదరి తెలిపారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో.. ఇప్పటికే రెండు సార్లు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ అన్నదాతలతో సంప్రదింపులు జరపగా.. చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. మోడీ కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమైన మోదీ.. రైతు సంఘాలు లేవనెత్తిన అంశాలు, చట్టాల రద్దు డిమాండ్లపై వ్యవహరించాల్సిన వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు.

నూతన చట్టాలతో పాటు విద్యుత్‌ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 8న భారత్‌ బంద్‌ చేపట్టాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు నేడు పార్లమెంట్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అన్నదాతల నిరసనకు మద్దతు పెరుగుతోంది. విపక్షాలతో పాటు విదేశాల నేతలు కూడా రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే రైతుల ఆందోళనలో విదేశీయుల జోక్యంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కెనడా హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories