Budget 2024: నేడే కేంద్ర బడ్జెట్‌ 2024-25

Union Budget 2024 Presented by Finance Minister
x

Budget 2024: నేడే కేంద్ర బడ్జెట్‌ 2024-25

Highlights

Budget 2024: మధ్యంతర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ

Budget 2024: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది.

సార్వత్రిక ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ.. బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు దాన్ని ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోడీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా? లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా..అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇది పూర్తిస్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు పూర్తిస్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఉవ్విళ్లూరుతున్న మోడీ సర్కారు.. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నవేళ పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్‌లో తీపికబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్రభారం పడుతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించొచ్చని తెలుస్తుంది. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్‌పై 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది.

అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్‌లో సామాన్యులకు లబ్ది చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి నిర్మలాసీతారామన్ లెక్కలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి.

మధ్యంతర పద్దుతో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కారు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న 6 వేల నుంచి 9 వేలకు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రస్తుతం కల్పిస్తున్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని 10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడొచ్చనీ వార్తలొస్తున్నాయి. సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటుచేయాలని కేంద్రం లక్షిస్తోంది. అందుకోసం రాయితీలను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలను ఆశించొచ్చు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు- సర్కారు తమపై కరుణ చూపి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories