Top 6 News @ 6PM: భారత్‌లో ముస్లింల గురించి ఖమేనీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Top 6 News @ 6PM: భారత్‌లో ముస్లింల గురించి ఖమేనీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
x
Highlights

1) ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1.39...

1) ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా సాగింది. 70 అడుగుల భారీ మహా గణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

2) నేను ఫామ్‌హౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే సీఎంను..

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి గన్​పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. తాను ఫామ్‌హౌస్ సీఎం కాదని, పని చేసే సీఎం అని చెప్పారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని మండిపడ్డారు. గత పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగింది. కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతామని పేర్కొన్నారు. లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారని గులాబీ సర్కార్ పై ఆగ్రహించారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలని కోరారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదన్నారు. కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారు.. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా ప్రజలు సహకరించాలని చెప్పారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.

3) వైసీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ నిరసనకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. తమ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ దర్శి పోలీస్ స్టేషన్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను బయటకు రానీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డితో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ వెంకయ్యమ్మకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

4) ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి.. ఇంతకీ ఎవరీ అతిషి మార్లెనా సింగ్?

ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్...తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆప్ శాసనసభా పక్ష నేతగా అతిశిని ఎంపిక చేయడంతో.. అతిశి ఎంపికను లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలిపారు కేజ్రీవాల్. దీంతో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశి బాధ్యతలు చేపట్టనున్నారు. వారం రోజుల్లో ఆమె సీఎంగా ఛార్జ్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

అతిషి మార్లేనా సింగ్.. దిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. మనీషి కుమార్ సిసోడియా కూడా ఆమెకు మద్దతు తెలిపారు. దిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం తరువాత తాను లెఫ్టినెంట్ జనరల్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇంతకీ దిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న ఈ మహిళ ఎవరు? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారన్న ఖమేనీ... తీవ్రంగా స్పందించిన భారత్

ప్రపంచంలో ముస్లిం మతస్థులు బాధలు అనుభవిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను కూడా చేర్చారు ఇరాన సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుసేనీ ఖమేనీ. ఆయన వ్యాఖ్యలను ‘తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యలపై భారత్ వెంటనే స్పందించింది. సరైన సమాచారం లేకుండా ఖమేనీ ఆ వ్యాఖ్యలు చేశారని, అవి తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ ప్రకటించింది. ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఖమేనీ, “ఇస్లామిక్ సహోదరులుగా మన సామూహిక గుర్తింపును దెబ్బతీసేందుకు ఇస్లాం శత్రువులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మియాన్మర్, గాజా, భారత్ లేదా మరేదైనా చోట ముస్లింలు బాధలు పడుతుంటే పట్టించుకోకుండా ఉంటే మనం ముస్లింలే కాదు” అని అన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) జానీ మాస్టర్‌ వ్యవహారంపై స్పందించిన చిన్మయి.. షాకింగ్ కామెంట్స్‌..

ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ డ్యాన్సర్‌ జానీపై ఓ యువతి ఆరోపణలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌) జానీ మాస్టర్‌ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్‌ పోలీస్టేషన్‌లో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా ప్రముఖ గాయని చిన్మయి సైతం స్పందించారు. ఒక మీడియా కథనాన్ని ట్యాగ్‌ చేసిన చిన్మయి.. 'నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్‌ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను.' అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మరి జానీ మాస్టర్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories