Top 6 News Of The Day: విరాళాల ప్రకటనలో పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్
వరద బాధితుల కోసం BRS సాయం వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతాన్ని...
వరద బాధితుల కోసం BRS సాయం
వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హరీశ్ రావు వెల్లడించారు. సంబంధిత చెక్కును ప్రభుత్వ అధికారులకు హరీశ్ రావు అందజేశారు. నిన్న ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ బృందం... బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసింది.
వైసీపీ నేతలకు మరో ఎదురుదెబ్బ
వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ నేతలు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై సాయంత్రం హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైసీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు.
విజయవాడకు ఎక్కువ నష్టం ఎందుకంటే..
బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం కలిగిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదన్నారు. ఆక్రమణల కారణంగా వాగు కనిపించకుండా పోయిందని... వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బుడమేరును డైవర్షన్ చేశారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని, రేపటి నుంచి నిత్యవసరాల పంపిణీ మొదలుపెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
'ఎమర్జెన్సీ'కి లీగల్ ట్రబుల్స్ ?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ నటించి.. స్వీయ దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆదేశించలేమని బాంబే హైకోర్టు వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ చిత్ర సహా నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది బాంబే కోర్టు.
కేసీఆర్ కనబడుటలేదు..
కేసీఆర్ కనబడుట లేదు అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లు అంటించిన వారు కేసీఆర్ పై తమ నిరసన వెళ్లగక్కారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం వరదల్లో అతలాకుతలం అయింది. వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. కేవలం కట్టుబట్టలతో నడురోడ్డుపైకి వచ్చేశారు. మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వరదల ప్రభావం అధికంగానే కనిపించింది. ఇక రాష్ట్రం నలుమూలలా పంటచేలు నీట మునిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ బయటికి రాకపోవడం ఏంటనే ఉద్దేశంలో నిరసనకారులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పోస్టర్లు ఏర్పాటు చేసింది ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా ఎవ్వరి నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
విరాళాల ప్రకటనలో పవన్ కల్యాణ్ పెద్ద మనసు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరద బాధితుల సహాయార్ధం మొత్తం రూ. 6 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు కాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. మిగతా రూ. 4 కోట్లలో ఏపీలోని 400 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష చొప్పున విరాళం అందజేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ప్రకటించిన విరాళాలలో ఇదే అతి పెద్ద మొత్తం కావడం గమనార్హం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire