TOP 6 NEWS @ 6PM: లగచర్ల దాడి కేసులో కొత్త కోణం.. మరో ఐదు ముఖ్యాంశాలు

Top 6 News of the day November 18th 2024
x

TOP 6 NEWS @ 6PM: లగచర్ల దాడి కేసులో కొత్త కోణం.. మరో ఐదు ముఖ్యాంశాలు

Highlights

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 18న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

1. లగచర్ల దాడి కేసులో కొత్త కోణం

లగచర్ల దాడి కేసులో పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.సంగయ్యపల్లి విలేజ్ సెక్రటరీగా ఉన్న రాఘవేందర్ గ్రామస్తులను రెచ్చగొట్టారని గుర్తించారని తెలుస్తోంది. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్నారు. రాఘవేందర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.

2. టీటీడీ పాలకవర్గం సంచలన నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకవర్గం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైంది. ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. 80 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టీటీడీ నిధులను ప్రభుత్వ బ్యాంకుల్లో మార్చాలని నిర్ణయించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించినట్టు ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు చెప్పారు.

3. బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాశ్ గహ్లోత్

దిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గహ్లోత్ సోమవారం బీజేపీలో చేరారు. ఆదివారమే ఆయన ఆప్ నకు రాజీనామా చేశారు. దిల్లీ రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. పార్టీకి రాజీనామా చేసే సమయంలో ఆయన ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటుందని ఆయన విమర్శించారు.అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పేరు కూడా రేసులో వినిపించింది. చివరికి అతిశీకి ఈ పదవి దక్కింది.ఇది కూడా ఆయన అసంతృప్తికి కారణమనే విశ్లేషణలున్నాయి.

4. పోలీసుల అదుపులో బీర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఇంచార్జీ కొణతం దిలీప్

బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఇంచార్జీ కొణతం దిలీప్ ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దిలీప్ రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేశారు.

5. పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు

పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసత్య ప్రచారం చేశారని తెలుగు యువత నాయకులు బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ నెల 12న నిర్వహించిన మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై టీడీపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మరో వైపు దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ప్రకాశం జిల్లాలో నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ బెయిల్ కోరవచ్చని పిటిషనర్ కు కోర్టు సూచించింది.

6. బ్రిటన్ రాజభవనంలో దొంగతనం

బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ఓ భవనంలో దొంగలు పడ్డారు. ప్రిన్స్ చార్లెస్ దంపతులు సేద తీరే విండ్సర్ క్యాజిల్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 13న ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు ఏస్టేట్ లోకి ప్రవేశించారని బ్రిటన్ మీడియా రిపోర్ట్ చేసింది. అక్కడ ఉన్న ట్రక్, బైక్ ను దొంగిలించారు. 2021 లో ఓ సాయుధుడు భద్రతా వలయాన్ని దాటి లోపలికి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories