Top 6 News Of The Day: మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ రాసిన లేఖలో ఏముంది.. మరో టాప్ 5 ముఖ్యాంశాలు
1) సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
1) సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటిపారుదల శాఖ సమీక్షలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందని.. ఏదో ఒకరోజు సీఎం అయ్యే అవకాశం మీకు ఉందంటూ ఉత్తమ్‌ను చూపిస్తూ మాట్లాడారు. తన నాలుక మీద పుట్టుమచ్చ ఉందని.. తాను చెప్పింది నిజం అవుతుందని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
2) గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు సీరియస్
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి గల్స్ బాత్‌రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో.. నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. విద్యార్థులు ఎవరూ అధైర్య పడొద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
3) బీజేపి, బీఆర్ఎస్ విలీనంపై బండి సంజయ్ క్లారిటీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఒక పార్టీ .. ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందనడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును దిక్కరించే విధంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదని.. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కలలో కూడా బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదన్నారు. కుటుంబపాలన, అవివీనీతి పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు. భవిష్యత్తులో ఒకదానిలో ఒకటి విలీనం అయ్యే పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలన్నారు బండి సంజయ్.
4) ఆ చెట్లు పెట్టొద్దు ప్లీజ్
ఆంధ్రప్రదేశ్‌లో 'వన మహోత్సవం' పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ఈ నేపపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. మొక్కలు నాటే విషయంలో ఓ తప్పు చేయొద్దంటూ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు. అయితే అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి మేలు చేస్తాయని ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు. కోనో కార్సస్ మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో నాటకూడదని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.
5) ఐయామ్ సారీ.. : ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ని అభిమానించే వారికి క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలో గతేడాది డిసెంబర్ 4న నౌకాదళం దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా విగ్రహావిష్కరణ చేసిన శివాజీ విగ్రహం ఇటీవల కురిసిన వర్షాలకు నేలకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్రలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. శివాజీ మహరాజ్ విగ్రహం కూలడం తమ మనోభావాలని దెబ్బతీసిందని మండిపడ్డాయి. దీంతో ఇవాళ పాల్ఘర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. అక్కడి నేలపై దిగడంతోనే శివాజీకి క్షమాపణ చెప్పానని.. అలాగే ఈ ఘటన వల్ల నొచ్చుకున్న వారికి కూడా క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
6) మల్లికార్జున గార్కి కేటీఆర్ రాయునది ఏమనగా..
కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి సర్కారు నియమించిన హైడ్రా కమిషనర్ చేపడుతున్న కూల్చివేతలను కేటీఆర్ ఆ లేఖలో ప్రస్తావించారు. పేదల ఇళ్లు కూలగొడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మరో బుల్‌డోజర్ రాజ్యంగా మార్చకుండా తెలంగాణలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని కేటీఆర్ తన లేఖ ద్వారా మల్లికార్జున ఖర్గెకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో కేటీఆర్ ఇలా ఖర్గేకు లేఖ రాయడం ఇది రెండోసారి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire