Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో పిటిషన్: మరో 5 ముఖ్యాంశాలు
పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
1. పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో పిటిషన్
పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు ఏపీ హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పవన్ కళ్యాణ్ పై కేసును ఉపసంహరించుకున్నారు.
అసలు కేసు ఏంటి?
2023 జులై 9న ఏలూరులో వారాహి సభలో పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వాలంటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ జులై 20న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ కేసును ఉపసంహరించుకోవడంపై వాలంటీర్ల తరపున శ్రవణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు.
2. సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు
సంధ్య థియేటర్ కు మంగళవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4 రాత్రి పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు.ఆమె కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసలు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు.
కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన హైదరాబాద్ సీపీ
డిసెంబర్ 4న తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు.ఆక్సిజన్ అందని కారణంగా బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని సీపీ తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని ఆయన అన్నారు.
3. పోర్న్ స్టార్ కు హష్ మనీ కేసు: ట్రంప్ నకు కోర్టులో చుక్కెదురు
డోనల్డ్ ట్రంప్ నకు న్యూయార్క్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫోర్న్ స్టార్ కు హష్ మనీ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు కోర్టు తిరస్కరించింది.అధికారిక అంశాలకు సంబంధించిన కేసుల్లో అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్ హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ చెప్పారు.దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.
హష్ మనీ కేసులో ట్రంప్ ను దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసులో ఆయనకు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ, ఆయన ఇంకా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేదు. 2025 జనవరి 20న ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ విషయంలో క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆయన కోర్టును ఆశ్రయించారు. శిక్ష విధించకుండా వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు ట్రంప్ నకు రక్షణ కల్పించే అవకాశాలు లేవని తెలిపింది. ఇదే ఇప్పుడు ట్రంప్ ను ఇబ్బంది పెడుతోంది.
ఎంటీ హష్ మనీ కేసు
పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో ఏకాంతంగా గడిపారని ట్రంప్ పై ఆరోపణలున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.36 లక్షల డాలర్ల హష్ మనీని ఇచ్చారని ఆరోపణ. ఇందుకు సంబంధించిన ఆధారాలను తారుమారు చేశారని కూడా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపారని స్టార్మీ కూడా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో పాటు 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. అందరి వాదనలు విన్న తర్వాత ఆయనపై నమోదైన అభియోగాలు వాస్తవమేనని కోర్టు తీర్పును వెల్లడించింది.
4. జమిలి బల్లు ప్రవేశ పెట్టిన కేంద్రం
ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 17న లోక్ సభ ముందుకు తెచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లుతో పాటు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పట్టారు. ఈ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. బిల్లును ప్రవేశ పెట్టేందుకు, జేపీసీకి పంపేందుకు ఓటింగ్ కు పట్టుబట్టాయి. దీనిపై ఓటింగ్ జరిపారు. లోక్ సభలో బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు చేశారు.
5. మోహన్ బాబు గన్ సీజ్ చేసిన పోలీసులు
మోహన్ బాబు గన్ ను హైదరాబాద్ ఫిలింనగర్ పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే ఓ గన్ ను మోహన్ బాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మంచు కుటుంబంలో తలెత్తిన వివాదంలో మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. తన వద్ద ఉన్న రెండు గన్స్ ను సరెండర్ చేయాలని పోలీసులునోటీసులు జారీ చేశారు. మరో వైపు డిసెంబర్ 14న మంచు విష్ణుపై మనోజ్ ఆరోపణలు చేశారు. తమ ఇంట్లో మనుషులను విష్ణు బెదిరించారని చెప్పారు. దీనిపై మనోజ్ తల్లి పహడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. మనోజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. విష్ణు వచ్చి తనతో మాట్లాడి వెళ్లిపోయారని తెలిపారు.
6. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టు
లగచర్లపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఇదే విషయమై నల్లచొక్కాలు, చేతులకు బేడీలు వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ప్రశ్నోత్తరాల తర్వాత లగచర్లపై చర్చకు బీఆర్ఎస్ కోరింది. ఈ విషయమై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతివ్వాలని గులాబీ పార్టీ కోరింది. బీజేపీ కూడా తమ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతివ్వాలని కోరింది. ఈ రెండు పార్టీల సభ్యుల నిరసనల మధ్యే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్శిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire