Top 6 News Of The Day: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Top 6 News Of The Day: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
x
Highlights

1) సీఎం రేవంత్‌కు విరాళం అందజేసిన చిరంజీవి వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే...

1) సీఎం రేవంత్‌కు విరాళం అందజేసిన చిరంజీవి

వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 50 లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్‌చరణ్ తరపున మరో 50 లక్షల చెక్‌ను కూడా సీఎంకు అందించారు. ఇక అమర్‌రాజా గ్రూప్ తరపున సీఎం రిలీఫ్ ఫండ్‌కు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోటి రూపాయల విరాళం అందించారు. టాలీవుడ్ నుంచి నటులు విశ్వక్‌సేన్, సాయిధరమ్‌తేజ్ 10 లక్షల చొప్పున, నటుడు అలీ 3 లక్షల రూపాయల చెక్కులను సీఎంకు అందజేశారు.

2) తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో ప్రజలు కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయక చాలా రోజులు అవుతోన్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను త్వరలోనే మంజూరు చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఈ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్‌ మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

3) పవన్ కల్యాణ్ శాఖకు వరల్డ్ రికార్డ్

పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు పేరు తీసుకొచ్చేలా అరుదైన గౌరవం లభించింది ఒకేరోజు 13,326 గ్రామ సభలు నిర్వహించినందుకుగాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్‌ సొంతం చేసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్‌ని అభినందిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఈ అవార్డ్ ప్రకటించింది.

4) జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన జనసేన

జానీ మాస్టర్ ను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. లైంగికంగా వేధింపులకు గురి చేశారని జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ హైద్రాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో జనసేన ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన ప్రకటించింది. జానీ మాస్టర్ జనసేనలో చేరారు. ఈ ఏడాది మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు.

5) రాహుల్ గాంధీ నాలుకకు ఖరీదు కట్టిన ఎమ్మెల్యే

మహారాష్ట్రకి చెందిన శివ సేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రాహుల్ గాంధీ నాలుక కోస్తే, వారికి తాను రూ. 11 లక్షలు ఇస్తానంటూ నగదు బహుమతి ప్రకటించారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ సంజయ్ గైక్వాడ్ ఈ ప్రకటన చేశారు. తాజాగా రాహుల్ గాంధీ గురించి సంజయ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "ఒకవైపు దేశంలో రిజర్వేషన్ల పెంపుపై ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసలు రిజర్వేషన్లనే ఎత్తేయాలని అంటున్నారు. రాహుల్ గాంధీ మాటలతోనే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఏంటో అర్థమవుతోంది. అందుకే రిజర్వేషన్ గురించి అలా మాట్లాడిన రాహుల్ గాంధీ నాలుక కోసిన వాళ్లకు తానే రూ. 11 లక్షలు అందిస్తాను" అని ప్రకటించారు.

6) డొనాల్డ్ ట్రంప్‎పై దాడికి యత్నం..నేను క్షేమం..నన్నెవరూ ఆపలేరు

మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఓటింగ్ జరగనుంది. అయితే ఇదిలా ఉంటే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి కాల్పులు జరిగే ప్రయత్నం జరిగింది. అమెరికా ఇంటెలిజెన్స్ సర్వీస్ దీనిపై విచారణ జరుపుతోందని తెలిపింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో అనుమానాస్పదంగా సంచరించాడు. అయితే మాజీ అధ్యక్షుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం, నిఘా విభాగం తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా లేదా అన్నది ప్రస్తుతానికి తేలలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories