Top 6 News @ 6 PM: చైతూ, సమంత మధ్య కేటీఆర్: కొండా సురేఖ.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Top 6 News @ 6 PM: చైతూ, సమంత మధ్య కేటీఆర్: కొండా సురేఖ.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
x
Highlights

1) 'సమంత, నాగ చైతన్యల విడాకులకు కేటీఆరే కారణం... కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

1) 'సమంత, నాగ చైతన్యల విడాకులకు కేటీఆరే కారణం... కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు

సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఆమె ఆరోపించారు. హీరోయిన్లకు మత్తు పదార్ధాలు అలవాటు చేసింది ఆయనేనని చెప్పారు. బుధవారం ఆమె హైద్రాబాద్ గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు.చాలా మంది జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. కొందరు సినీ పరిశ్రమకు దూరం కావడానికి కూడా ఆయనే కారణమన్నారు. మహిళలంటే కేటీఆర్ కు చిన్నచూపు అని ఆయన చెప్పారు. మొన్న సీతక్క, ఇవాళ తనను ట్రోల్ చేస్తున్నారన్నారు. మహిళా మంత్రిని అవహేళనగా ట్రోల్ చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్ కు లేదా అని ఆమె ప్రశ్నించారు. దుబాయ్ నుంచి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తోందన్నారు. నా మీద ట్రోలింగ్ కు సంబంధించి మనసున్న మనిషిగా హరీష్ రావు స్పందించారని ..కానీ, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. దొంగ ఏడుపులు ఏడ్వాల్సిన అవసరం తనకు లేదని ఆమె తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరా కానుకగా అదిరిపోయే గిఫ్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషిస్తున్నారు. దసరా పండగ కానుకగా పాయిమాయిల్ రైతులకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. పామాయిల్ గెలల ధరను రూ. 17,043గా నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై స్పందించారు. పామాయిల్ రైతులకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు భారీగా మేలు జరుగుతుందన్నారు.

పామాయిల్ సాగును లాభసాటిగా మార్చి..కొత్త రైతులను ప్రోత్సహించాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. దీంతోపాటుగా ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచాలని కేంద్రానికి మంత్రి విజ్నప్తి చేసినట్లు తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఖరీఫ్ సీజన్ నుంచే ఈ బోనస్ అమలు చేయనున్నారు. దీంతోపాటుగా రైతు భరోసా నిధులను దసరా లోపు రైతుల అకౌంట్లో జమ చేయాలన్న కార్యాచరణ చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

3) ప్రాయశ్చిత దీక్షను విరమించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను బుధవారం విరమించారు. ఇవాళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకన్నను దర్శించుకోవడానికి ముందే తన చిన్న కూతురు తరపున డిక్లరేషన్ పత్రాలపై ఆయన సంతకం చేశారు. తిరుపతి లడ్డూ వివాదం వెలుగు చూసిన తర్వాత 11 రొజుల ప్రాయశ్చిత దీక్షను ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నడక మార్గంలో పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం ఆయన బాలాజీని దర్శించుకున్నారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు పవన్ కళ్యాణ్ కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. మూడు రోజుల పాటు తిరుపతిలో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ రాత్రికి కూడా ఆయన తిరుమలలోనే ఉంటారు. గురువారం నాడు ఇదే జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తిరిగి అమరావతికి వెళ్తారు.

4) కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా బిహార్‌లోని పట్నాలో అఫీషియల్‌గా తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అయితే పార్టీకి తాను నాయకత్వం వహించబోనని తెలిపారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ అధ్యక్షుడు అవుతారని చెప్పారు. 2025 జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

5) ఈ నెల 6న ఎన్సీపీలో బిఆర్ఎస్ విలీనం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేసేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ మహారాష్ష్ర పై పెద్దెత్తున ఫోకస్ పెట్టారు. అంతేకాదు మహారాష్ట్రలో పార్టీని సైతం ఏర్పాటు చేశారు. ఎన్నోసార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను కూడా నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి నోరుమెదపలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి పక్క పార్టీలవైపు వెళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ నాయకులు వెళ్లి శరద్ పవార్ ఆధ్వర్యంలో ఎన్సీపీలో చేరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తాజాగా శరద్ పవార్‌తో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 6వ తేదీన పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పార్టీని ఎన్‌సీ‌పీలో విలీనం చేయనున్నారు.

6) ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ళ వర్షం... మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?

ఇరాన్ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ మిసైళ్ళతో దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ దాడుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఇప్పటికే బంకర్లలో తలదాచుకున్నారని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇరాన్ మిసైల్ దాడులతో ఇజ్రాయెల్‌ ముప్పేట దాడిలో చిక్కకున్నట్లైంది. ఇప్పటికే, ఏడాది కాలంగా గాజాలో హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్, ఇటీవల లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు ముమ్మరం చేసింది. గతవారం హిజ్బుల్లా చీఫ్ హసన నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. పూర్తి విశ్లేషణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories