Borewell: బోరుబావిలోనే చిన్నారి.. 68 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

three Years Aged Girl fell into Borewell in the Kotputli-Behror District of Rajasthan
x

Borewell: బోరుబావిలోనే చిన్నారి.. 68 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

Highlights

Borewell: రాజస్థాన్‌లో బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Borewell: రాజస్థాన్‌లో బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దాదాపు 68 గంటల నుంచి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ర్యాట్ హోల్ మైనర్స్ వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కిరాత్‌పురలోని ధని బడియాలి గ్రామంలో చేతన అనే చిన్నారి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

చిన్నారి చేతన 150 అడుగుల లోతు వద్ద చిక్కుకున్నట్టు గుర్తించిన అధికారులు.. పైపుతో బోర్‌లోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్టు తెలిపారు. క్లిప్‌ల సాయంతో 30 అడుగుల పైకి లాగినట్టు చెప్పారు. మరోవైపు ఇప్పటికే 160 అడుగుల గొయ్యి తవ్వామని.. చిన్నారి ఉన్న బోరుబావికి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉందన్నారు. అది పైలింగ్ మిషన్‌తో కుదరదు కాబట్టి మనుషులే తవ్వాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా ఇవాళ ఆ చిన్నారిని బయటకు తీస్తామని ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి యోగేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రస్తుతం ర్యాట్ హోల్ మైనర్స్ సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

ఇటీవల 175 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మరవకముందే.. ఇప్పుడు చిన్నారి చేతన ఈ ప్రమాదంలో చిక్కుకుంది. మరోవైపు బోరుబావుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాజస్థాన్ పోలీసులు ఎక్స్‌ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎండిపోయిన బావులు, బోరుబావులు ప్రజలకు ప్రమాదకరమని తెలిపారు. ఎక్కడైన ఓపెన్ బోర్‌వెల్ లేదా ఎండిపోయిన బావిని చూస్తే ఎస్‌డీఆర్‌ఎఫ్ హెల్ప్ లైన్ 0141-2759903 లేదా 8764873114కు తెలియజేయాలని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories