Jammu and Kashmir Assembly Elections: జమ్మూకశ్మీర్ లో నేడు చివరి దశ ఓటింగ్.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి

The results of the final phase of voting in Jammu and Kashmir today will be announced on October 8
x

Jammu and Kashmir Assembly Elections: జమ్మూకశ్మీర్ లో నేడు చివరి దశ ఓటింగ్.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి

Highlights

Jammu and Kashmir Assembly Elections: నేడు జమ్మూకశ్మీర్ లో చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చివరి దశ 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దాదాపు 39లక్షల మంది ఓట్లు వేయనున్నారు. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.

Jammu and Kashmir Assembly Elections: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడో, చివరి దశ 40 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉధంపూర్, సాంబా, కతువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాల నుండి 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా 415 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. ఈ దశ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మాత్రమే అసెంబ్లీ, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా కమ్యూనిటీ ఈ దశలో ఓటు వినియోగించుకోనున్నారు. 2019, 2020లో బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలలో ఓటు వేశారు. ఓటింగ్‌కు ఒకరోజు ముందు సోమవారం ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించారు.

'ఉగ్రవాద రహిత, శాంతియుత' ఓటింగ్‌ జరిగేలా పోలింగ్‌ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్మూ రీజియన్‌ అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ) ఆనంద్‌ జైన్‌ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, వేలాది మంది ఎన్నికల కార్యకర్తలు ఈ ఉదయం తమ తమ జిల్లా ప్రధాన కార్యాలయాల నుండి ఎన్నికల సామగ్రితో ఓటింగ్ బూతులకు చేరుకున్నారు.

మొదటి దశలో ఓటింగ్ శాతం భారీగా నమోదైంది. సెప్టెంబర్ 18న మొదటి దశలో 61.38 శాతం ఓటింగ్ జరగగా, సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం ఓటింగ్ జరిగింది. 2019 ఆగస్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ, కాశ్మీర్‌లో ఇది మొదటి అసెంబ్లీ ఎన్నికలు. దీని ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటించనున్నారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) పాండురంగ్ కె. పోల్ ప్రకారం, 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 24 సీట్లు జమ్మూ ప్రాంతంలో, 16 సీట్లు కాశ్మీర్ లోయలో ఉన్నాయి.

పోల్ పోలింగ్ జిల్లాల్లో మొత్తం 5,060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 పోలింగ్‌ కేంద్రాలను మహిళలే నిర్వహిస్తారని. వీటిని 'పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌'గా పిలుస్తారని తెలిపారు. దీంతో పాటు 43 పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ వికలాంగుల చేతుల్లో ఉండగా, 40 పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ యువత చేతుల్లో ఉంటుందని సీఈవో తెలిపారు. పర్యావరణ సమస్యలపై సందేశం అందించేందుకు 45 గ్రీన్‌ పోలింగ్‌ స్టేషన్లు, 33 యూనిక్‌ పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయన్నారు. సరిహద్దు ప్రాంతాల వాసుల కోసం నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories