నేటితో ముగియనున్న రాజ్యసభ సభ్యుల నామినేషన్‌ గడువు

The deadline for nomination of Rajya Sabha members will end today
x

నేటితో ముగియనున్న రాజ్యసభ సభ్యుల నామినేషన్‌ గడువు

Highlights

Rajya Sabha Nomination: కాంగ్రెస్ నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న.. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్

Rajya Sabha Nomination: నేటితో రాజ్యసభ సభ్యుల నామినేషన్‌కు గడువు పూర్తవనుంది. దీంతో తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థులుగా మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు, అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేరును కాంగ్రెస్ హైకమాండ్‌ ఖరారు చేసింది. వీరిద్దరూ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనుండగా.. సీఎం రేవంత్‌, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇక.. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని కూడా గులాబీ బాస్ ప్రకటించారు. తమ పార్టీ నుంచి అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. నేటితో రాజ్యసభ నామినేషన్ దాఖలకు చివరిరోజు కావడంతో.. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు వద్దిరాజు రవిచంద్ర.

మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి టీడీపీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ‌ఆఫ్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1986లో రాజ్యసభకు ఎంపికై.. దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేశారు. కాంగ్రెస్‌లో చేరి 1999,2004 ఎన్నికల్లో లోక్‌సభ ఎంపీగా గెలిచిన రేణుకా.. 2009లో ఓడిపోయారు. 2012లో మరోసారి రాజ్యసభకు ఎంపికై 2018 వరకు కొనసాగారు. ప్రస్తుతం ఆమె ఖమ్మం లోక్‌సభ నుంచి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా అధిష్టానం రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.

ఇక యూత్‌ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్‌.. పార్టీ తరపున వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పార్టీకి కోల్పోయిన ఉనికి తీసుకొచ్చారు. 2018లో ముషీరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అతనికి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.

బీఆర్ఎస్‌ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారు చేసింది గులాబీ పార్టీ. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ బలం ప్రకారం ఒక రాజ్యసభ స్థానం దక్కనుంది. ఈ స్థానానికి వద్దిరాజు పేరును ఖరారు చేశారు అధినేత కేసీఆర్. మున్నూరు కాపు వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర 2019లో బీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించగా వద్దిరాజు రవిచంద్రకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ఆయన పదవీకాలం ముగియనుండగా.. మరోసారి బీఆర్ఎస్‌ అతనికే మరోసారి అవకాశం కల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories