ఇద్దరూ మళ్లీ కాషాయ రాగం పాడేశారు.. తలైవా, పవర్‌స్టార్‌ల మాటల ఆంతర్యమేంటి?

ఇద్దరూ మళ్లీ కాషాయ రాగం పాడేశారు.. తలైవా, పవర్‌స్టార్‌ల మాటల ఆంతర్యమేంటి?
x
ఇద్దరూ మళ్లీ కాషాయ రాగం పాడేశారు.. తలైవా, పవర్‌స్టార్‌ల మాటల ఆంతర్యమేంటి?
Highlights

వాళ్లిద్దరూ సూపర్‌స్టార్లు. వారు ఒక్కసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే. తుపాకీ తూటాలా, వారి మాట దూసుకెళుతుంది. అయితే, దేశంలో అలజడి రేపుతున్న ఒక...

వాళ్లిద్దరూ సూపర్‌స్టార్లు. వారు ఒక్కసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే. తుపాకీ తూటాలా, వారి మాట దూసుకెళుతుంది. అయితే, దేశంలో అలజడి రేపుతున్న ఒక చట్టంపై, ఆ ఇద్దరు సినిమా స్టార్లు, తమదైన మద్దతు పలికారు. ఆ చట్టంపై అనుమాన మేఘాలు తొలగకపోయినా, వాటికి వకాల్తా పుచ్చుకుని, నరేంద్ర మోడీ సర్కారుకు బాకా ఊదుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఎవరా స్టార్‌ స్టార్‌ సూపర్‌ స్టార్లు? అదేపనిగా బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం ఎందుకు కురిపిస్తున్నారు? ఈ పొగడ్తలు, సమర్థతల వెనక, వారికి పక్కా వ్యూహముందా?

దక్షిణాదిలో కోట్లాదిమంది గుండెల్లో అభిమానం సంపాదించుకున్న హీరోలు తలైవా రజినీకాంత్, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఈ ఇద్దరూ రాజకీయ రంగంలోనూ హీరో అవుదామనుకుంటున్నార. జనసేన పేరుతో ఇప్పటికే పవన్ కల్యాణ్‌ పార్టీ స్థాపించారు. అటు తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు తలైవా రజినీకాంత్. తమిళనాడులో రాజకీయ శూన్యత వుందని రజినీకాంత్ భావిస్తుంటే, ఏపీలో ఐదేళ్లలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడుతుందని పవన్‌ ఆలోచిస్తున్నారు. ఆ రాజకీయ శూన్యతను తామే భర్తీ చెయ్యాలని భావిస్తున్న ఇద్దరు స్టార్లు, ఆ దారిలో ఒక కొత్త స్నేహానికి షేక్‌ హ్యాండ్ ఇవ్వాలని తపిస్తున్నారు.

వాళ్లు చెయ్యాలనుకుంటున్న స్నేహం, కమలంతో. వాళ్లు నడవాలనుకుంటున్న బాట కాషాయ బాట. వరుసగా ఇద్దరూ బీజేపీ భాషలోనే మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వ విధానాలు ఆహాఓహో అంటున్నారు పవన్. మొన్న పెరియార్ రామస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీజేపీ మన్ననలు పొందే ప్రయత్నం చేశారు రజినీ. ఇప్పుడు ఇద్దరూ ఒక వివాదాస్పదమైన, దేశాన్ని అట్టుడికిస్తున్న, ఒక వర్గం ప్రజలకు భయాందోళన కలిగిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏకు మద్దతిచ్చి, సొంత రాష్ట్రాల్లో, సరికొత్త చర్చకు తెరలేపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై మైనార్టీల్లో ఆందోళనలు నెలకున్న వేళ రజనీకాంత్ దీనికి తన మద్దతు ప్రకటించారు. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని తలైవా హామీ ఇచ్చారు. దేశ విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజనీ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలకు విద్యార్థులు ఆ అవకాశం ఇవ్వరాదని రజినీ సూచించారు.

దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ నేరుగా స్పందించడం ఇదే తొలిసారి. రజినీ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీకి బాకా ఊదడటమే, రజినీ పనయ్యిందన్నాయి. సీఏఏతో ముస్లింలు అభద్రతాభావానికి గురవుతున్నారు. షహీన్‌బాగ్‌లో ఆందోళనలూ జరుగుతున్నాయి. అయినా రజినీకి ఇవేం కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నాయి. అటు పవన్‌ కల్యాణ్‌, ఎప్పుడైతే బీజేపీతో జట్టుకట్టాలని డిసైడయ్యారో అప్పటి నుంచి కాషాయ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించడం ఆపలేదు. సీఏఏపై అపోహలు అవసరమే లేదన్నారు.

రజినీకాంత్, పవన్‌లు అదేపనిగా బీజేపీ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించడం, హిందూత్వ భావజాలంలో మాట్లాడ్డం వెనక వారికంటూ ఒక వ్యూహముందన్న చర్చ జరుగుతోంది. తమ రాజకీయ ఎదుగుదలకు, పోరాటానికి బీజేపీ బలం అవసరమని భావిస్తున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆరెస్సెస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ వంటి బీజేపీ దళాలు తోడ్పడుతాయని, రజనీ, పవన్‌లు ఆశిస్తున్నారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీ మన్ననలు పొందేందుకు ట్రై చేస్తున్నారన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అందుకే సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, వీరు మాత్రం, ప్రశంసలు కురిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories