ఢిల్లీ రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత

Tension in Delhi farmers tractor rally
x

Delhi farmers tractor rally

Highlights

* బారికేడ్లను దాటుకొని వస్తున్న రైతులు * సింఘు, టిక్రీ, ఘాజీపూర్ నుంచి ట్రాక్టర్ ర్యాలీతో వెళ్తున్న రైతులు * టిక్రీ దగ్గర అడ్డుకున్న పోలీసులు

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టిక్రీ సరిహద్దుల్లో నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను సైతం దాటుకుని రైతులు ర్యాలీగా బయలుదేరడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో జలఫిరంగులను సైతం పోలీసులు సిద్ధం చేశారు. ఢిల్లీలోని టిక్రీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రిపబ్లిక్ డే పరేడ్ కన్నా ముందే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నించారు. రైతుల ట్రాక్టర్ సమ్మాన్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో జాతీయ పతాకాలతో రైతులు నిరసనలు తెలిపారు. బారికేడ్లను దోసుకుంటూ రైతులు ముందుకెళ్లడంతో.. ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు రెండు నెలలుపైగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకుంది. రైతులంతా కిసాన్ గణతంత్ర పరేడ్‌కు బయలుదేరారు. టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించాయి. ఈ ర్యాలీలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దేశ రాజధానిలో పరేడ్‌ చేపట్టారు. ఢిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతమైన టిక్రీ దగ్గర రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. ఐదువేల ట్రాక్టర్లు, ఐదు వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భారీ కవాతు నిర్వహించేందుకు పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ నంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలివచ్చారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే.. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపుర్‌లోని దీక్షా శిబిరాల వద్ద నుంచి శకటాలు, ట్రాక్టర్లు ప్రదర్శనగా బయలుదేరాలి. అయితే, రిపబ్లిక్ వేడుకలు ముగియకుండానే, రైతులు ర్యాలినీ ప్రారంభించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దులు అట్టుడుకుతున్నాయి. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన కెంటైనర్ లను రైతులు ట్రాక్టర్లతో నెట్టేశారు. ఢిల్లీ పోలీసులు మాత్రం, పరిస్థితి అదుపులోనే ఉందంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories