Tauktae Cyclone: ఐదు రాష్ట్రాలపై తౌక్టే తుపాను ఎఫెక్ట్

Tauktae Cyclone Effect on Five States in India
x
ఐదు రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం (ఫైల్ ఇమేజ్)
Highlights

Tauktae Cyclone: ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోన్న తౌక్టే సైక్లోన్ * మరికొన్ని గంటల్లో గుజరాత్‌ వద్ద తీరం దాటే ఛాన్స్

Tauktae Cyclone: ఓ పక్క కరోనా సెకండ్‌వేవ్‌ ఆ ఐదు రాష్ట్రాలను కోలుకోని దెబ్బతీశాయి. ఇప్పుడు అదే ఐదు రాష్ట్రాలను తౌక్టే తుపాను వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను తీవ్రరూపం దాల్చింది. ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోన్న ఈ తుపాను, మరికొన్ని గంటల్లో గుజరాత్‌ వద్ద తీరం దాటనున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు తెల్లవారుజామున పోరుబందర్‌- మహువాల మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తోంది.

తౌక్టే ప్రభావంతో కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు కర్నాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు మృతి చెందారు. ఇటు.. కేరళను కూడా తౌక్టే తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా కురుస్తోన్న భారీ వర్షాలకు వందల సంఖ్యలో ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.

కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న కర్నాటకకు తౌక్టే రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంగంలోకి దిగిన 20 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు.. మహారాష్ట్రపైనా తౌక్టే ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పుణెలోని పలు గ్రామాల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

తౌక్టే తుపాను దెబ్బతో గోవా అల్లకల్లోలంగా మారింది. తీరంలో సముద్రపు అలలు 2 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. ఇక.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాకు తుపాను ప్రభావంతో తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు. భారీ గాలుల కారణంగా ఈ జిల్లాలోని మట్టి ఇళ్లు పూర్తిగా కూలిపోవచ్చని, కచ్చా, పక్కా ఇళ్లకు కూడా నష్టం జరగవచ్చని చెబుతున్నారు. చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన గుజరాత్‌ ప్రభుత్వం.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో కూడా తౌక్టే తుపాను ఎఫెక్ట్ కాస్త పడింది. తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.‎ అయితే.. తెలుగు రాష్ట్రాలపై తౌక్టే ప్రభావం స్వల్పంగానే ఉంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories