ఆరు నెలలు.. రెండు ఆత్మహత్యలు..ఐఐటీ విద్యార్థులకు ఏమవుతోంది?
చదువులు చదువులు చదువులు. అవును. ఈ చదువు చంపేస్తోంది. ఈ మార్కుల మహా యజ్ఞం జీవితాన్ని బలి చేస్తోంది. పుస్తకమే సమస్తమై మస్తిష్కంలో జీవితాశను...
చదువులు చదువులు చదువులు. అవును. ఈ చదువు చంపేస్తోంది. ఈ మార్కుల మహా యజ్ఞం జీవితాన్ని బలి చేస్తోంది. పుస్తకమే సమస్తమై మస్తిష్కంలో జీవితాశను కడతేరుస్తోంది. అప్పుడప్పుడే ఎదుగుతున్న మెదళ్లు, పరీక్షలకు నలిగిపోతున్నాయి. భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సరస్వతీ నిలయాలు శవాగారాలుగా మారుతున్నాయ్. మార్కుల యంత్రాలుగా మారుతున్న విద్యార్థులకు ఆటాపాట, సాంస్క్కతిక కార్యక్రమాలు, పిక్నిక్ వంటి రీక్రియేషన్ ప్రోగ్సామ్స్ ఉండవు. అందుకే ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్స్ చావుకేకలు వేస్తున్నారు. ఆరు నెలల్లో ఐఐటీ విద్యార్థుల సూసైడ్ వెనుక కూడా జరిగింది ఇదే!!
ఆరు నెలలు.. రెండు ఆత్మహత్యలు. ఐఐటీ విద్యార్థులకు ఏమవుతోంది? జాతీయ స్థాయి పోటీ ప్రాణాంతకమవుతోందా? ఐఐటీ విద్యా... అంత ఒత్తిడితో కూడుకున్నదా?
ఐఐటీలో సీటు సాధించాలనేది దాదాపు ప్రతీ విద్యార్థి కల. తమ పిల్లాడు ఐఐటీలో చదవాలనేది ప్రతీ తల్లిదండ్రుల కల. అందుకే చిన్ననాటి నుంచే ఐఐటీ ఫౌండేషన్లు, ప్రత్యేక అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తారు. ఇదే లక్ష్యంతో పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. ఆ కఠోర సాధన ఫలితంగా ఐఐటీలో సీటు సాధిస్తున్నారు. ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయిలో పోటీ ఉండటంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి సహజం. ఇంత ఒత్తిడి మధ్య ప్రవేశాలు పొందిన విద్యార్థులు తీరా ఐఐటీలో ప్రవేశించి చదువు మధ్యలో ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్. ఇందులో మాస్టర్ ఇన్ డిజైన్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న మార్క్ ఆండ్రు చార్లెస్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారణాసికి చెందిన ఆండ్రుస్ బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో చేరాడు. ఈ నెల 5న ప్రజెంటేషన్ ఇస్తే ఆండ్రూస్ కోర్స్ పూర్తయ్యేది. కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆండ్రూస్ ఆత్మహత్యకు తీవ్రమైన మానసిక ఒత్తిడే కారణమన్న విషయం అతను రాసిన సూసైడ్ లెటర్ ద్వారా తెలుస్తోంది.
ఆరునెల క్రితం ఇదే ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అనిరుధ్య అనే బిటెక్ విద్యార్థి ఇదే క్యాంపస్‌లోని ఏడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన అనిరుధ్య చదువులో చురుకైన విద్యార్థి. ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్న అనిరుధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా సంపాదించాడు. మరికొన్నాళ్లలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరుతాడన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడం అతని తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
అనిరుధ్య, మార్క్ ఆండ్రు చార్లెస్ ఆత్మహత్యలు దాదాపు ఒకలాగే ఉన్నాయి. మానసిక ఒత్తిడి కారణంగానే వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు వారిద్దరు రాసిన సూసైడ్ లెటర్స్ స్పష్టం చేస్తున్నాయి. వారి రాతల్లో వేదన, సంఘర్షణ కనపడుతోంది. భవిష్యత్తు కొత్తగా ఏమీ కనబడటం లేదని, ఇంకా మార్పు ఏమి ఉండదని అనిరుధ్య తన లేఖలో రాసాడు. తాన ఇష్టపూర్వకంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, చనిపోతున్నందుకు తనకేమాత్రం బాధ లేదని తెలిపాడు. మార్క్ కూడా తాను చనిపోతున్నందుకు బాధలేదని, తాను ఒక పరాజితునాన్ని లేఖలో తెలిపాడు. తాను ఏమి సాధించలేక పోయానని ఆ లెటర్‌లో బాధపడ్డాడు.
ఏది ఏమైనా ఆరు నెలల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం, సమస్యలను అధిగమించాలన్న పట్టుదల కనబడకపోవటం ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తుంది. విద్యార్థుల్లో ఈ మానసికస్థితిని తొలిగించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అధ్యాపకులు, సైకాలజిస్టులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కారణమేదైనా సమస్యలకు ఆత్మహత్య అంతిమ పరిష్కారం కానే కాదు. ఎదురు నిలిస్తేనే గెలవగలం. గెలిచి నిలబడగలమన్న విషయాన్ని విద్యార్థులు కూడా గుర్తించాలి.
బాగా చదువుకుంటే బాగా బతకొచ్చు.. ఓ మాదిరిగా చదువుకున్నా బతకొచ్చు.. కోరుకున్నట్లు చదువుకోకపోయినా బతికేయొచ్చు.. అసలు చదువే అబ్బకపోయినా జీవనయానం కష్టమేమీ కాదు.. కానీ చదువుల సరస్వతులు, సరస్వతీ పుత్రులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు. వారిని చంపుతున్నది చదువా? జీవితంలో ఎందుకు ఓడిపోతున్నారు?
ప్రపంచంలో 14 నుంచి 29 ఏళ్లలోపు కుర్రకారులో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య భారత్‌లో అత్యధికం. నవయువతరంతో దూసుకుపోతున్న భారత్‌లో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించిన గణాంకాల ప్రకారం చదువరుల సంఖ్య దాదాపు 40వేలు. ఏటా విద్యార్థినీవిద్యార్థుల ఆత్మహత్యల రేటు పెరుగుతూనే ఉంది. సమాజంలోని పిల్లలకు చక్కటి భవిష్యత్‌కు బాటలు వేద్దామన్న తల్లిదండ్రులు వాస్తవాలను మరచి కష్టసాధ్యమైన, అయిష్టమైన లక్ష్యాలను వారిపై రుద్దడం మొదటి కారణం.
పిల్లలకు మంచి చదువు చెప్పించాలనుకోవడం తప్పుకాదు. అవసరం. కానీ ఆ పిల్లల ఇష్టాయిష్టాలను, వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ కోర్కెలను, ఇష్టాలను వారిపై రుద్దడం తొలి తప్పు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వారిని చక్కదిద్దడానికి తీసుకోవలసిన వ్యవస్థ విద్యాసంస్థలలో లేనేలేదు. మరణించడానికి ముందు వారు రాస్తున్న లేఖల్లోని చిన్నచిన్న అంశాల వెనుక వారు మానసికంగా ఎంత కుంగిపోయారో, ఎంత ఆవేదనకు గురయ్యారో తెలిపే బాధ కనిపిస్తోంది. భవిష్యత్‌లో తమవాళ్లు ఎంతో ఉన్నతస్థానానికి వెళతారన్న ఆశలతో విద్యాసంస్థల్లో చేర్పించిన తల్లిదండ్రులు గర్భశోకంతో కాలం గడపాల్సిన దుస్థితికి ఎవరిని నిందించాలి.
ప్రధానంగా మార్పు రావలసినది తల్లిదండ్రుల వైఖరిలో. వారి బాధ్యతల నిర్వహణలో. వారి ఆశలు, లక్ష్యాలలో. కన్నవారు కళ్లెదుట ఉండాలో, చేరలేని, ఛేదించలేని లక్ష్యాలను వారిముందుంచి దూరం చేసుకునే పరిస్థితులు కల్పిస్తారో వివేచనతో నిర్ణయించుకోవాలి. విద్యాసంస్థల్లో ఫలితాలు బాగున్నా తమ పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో పర్యవేక్షణ, ఆప్యాయతానురాగాలు కలగలపిన పలకరింత దూరమైపోయింది. పదహారు నుంచి పద్దెనిమిది గంటలపాటు చదువు వారిని అచేతనులను చేస్తోంది. అదే విద్యార్థులకు ఒంటరితనం, కుంగుబాటుకు దారితీస్తున్నాయి. మోయలేని బరువు, తీరికలేని చదువు, పలకరింపు కరవు ఇలా పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో తనువు చాలిస్తున్నారు.
అసలు దిగులు, ఒత్తిడి, కుంబాటు, యాంగ్జైటీ ఇవి ఎవరికైనా రావచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు కాస్త ఎక్కువ అవకాశం ఉంటుంది. వారి నడవడిక, వ్యవహార శైలిని గమనించి కాస్త ఊరడింపుగా వ్యవహరించి, చాలా తక్కువగా మందులు వాడితే సరిపోతుంది. కానీ వారితో ఆ మాత్రం గడిపే తీరుబడి ఎవరికి ఉంది. దాని ఫలితమే కడుపుకోత. అనుకున్న ఫలితం సాధించలేకపోవడం, వైఫల్యం విద్యార్థినీవిద్యార్థులు ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంటోంది. తల్లిదండ్రుల అత్యాశ ఫలితంగా విద్యాసంస్థలు డబ్బు గడిస్తుంటే కన్నవారు మాత్రం గర్భశోకం అనుభవిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire