నలభై ఏళ్లకోసారి..నలుసంతైనా చెదరకుండా.. అత్తివరదుని అవతరణం !

నలభై ఏళ్లకోసారి..నలుసంతైనా చెదరకుండా..  అత్తివరదుని అవతరణం !
x
Highlights

తమిళనాడు అంటేనే ఆలయాలు. అందులో కాంచీపురం గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలయాల నగరంగా ఆ పట్టణం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా...

తమిళనాడు అంటేనే ఆలయాలు. అందులో కాంచీపురం గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలయాల నగరంగా ఆ పట్టణం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా ఆలయాలు కనిపిస్తాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత దక్షిణాది మోక్షపురిగా చెప్పుకునే కంచిలోనే ఉంది వరద రాజస్వామి వారి ఆలయం లక్షల్లో జనం పోటెత్తేది ఈ ఆలయానికే. ఈ స్వామి దర్శనం ఏటేటా ఉండదు అందుకే భక్తజనం దర్శనానికి తహతహలాడుతుంటారు. దాదాపు 40ఏళ్లకొకసారి కనపడే స్వామి వారి దర్శనం వెనక కథేంటి? ఇప్పుడు చూద్దాం.

దక్షిణాదిలో ఏకైక మోక్షపురి కంచి. ఇక్కడే కొలువై ఉన్నదే వరదరాజస్వామి ఆలయం. 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా దీన్ని చెబుతారు. ఇక్కడే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో వరదరాజ స్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి.

వందల ఏళ్ల నుంచి స్వామి పూజలందుకుంటున్నారు. 16వ శతాబ్దంలో మహ్మదీయులు దేశం మీద దండయాత్రలు చేస్తున్న సమయంలో శ్రీవరదరాజస్వామి ఆలయం కూడా దోపిడీకి గురైంది. దీంతో స్వామి విగ్రహానికి హాని కలుగుతుందేమోనన్న భయం అందరిలో నెలకొంది. వెంటనే పక్కనే ఉన్న ఆనంద పుష్కరిణి నీటిలో భద్రపరిచారు. కానీ కాలక్రమంలో గర్భగుడిలో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కుచెదరని ఆ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి, తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. అలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి, 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీఅత్తి వరదరాజ స్వామిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత 2019 జులై 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మీకో అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. 9 అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం మొదటి 38 రోజులు పడుకున్నట్టుగానూ చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగానూ కనిపిస్తుంది. ఇక ఈ 48 రోజుల్లో భక్తుల విశ్వాసాలు మాములుగా ఉండవు భక్తజనం కంచికి పోటెత్తుతుంది ఎంతలా అంటే అందరికీ దర్శనం కల్పించాలంటూ స్వామి వారి ఆలయం తెరిచి ఉంచాలంటూ కోర్టు కెక్కెంతలా ఎక్కడెక్కడ నుంచి భక్తులు స్వామి దర్శనానికి తరలి వెళ్లారు. అత్తి వరదరాజస్వామిని కోనేటిలో భద్రపరుస్తా రన్న సమాచారంతో దేశం నలుమూలల నుంచి కూడా భక్తకోటి భారీగా తరలివచ్చింది. అంతెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సతీసమేతంగా కంచికి వెళ్లారు. అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా, రజనీకాంత్‌ సహా ఇతర ప్రముఖులు ఎందరో స్వామివారిని దర్శించుకొని తరించారు.

చారిత్రక ఇతిహాసాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులోనూ ఆధ్యాత్మికత, దైవ చింతన కలిగిన ఇతిహాసాలకు మరీ ఆదరణ ఎక్కువ 40 ఏళ్ల తర్వాత అత్తి వరదుడి నిజరూప దర్శనంపై ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆసక్తి ఉందో ఆ ఆలయానికి పోటెత్తిన జనాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఎన్నేళ్లయినా నీటిలో ఉన్న విగ్రహం ఇసుమంతైనా చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం అయితే దానివెనకాల ఓ కారణముందంటారు పురాణ పండితులు అదేంటో ఇప్పుడు చూద్దాం.

అత్తి వరద రాజస్వామి దర్శనం చాలా పవిత్రంగా భావిస్తారు ఎన్నెన్నో పూర్వజన్మల సుకృతం ఉంటేనే అది సాథ్యపడుతుందని నమ్ముతారు. కోనేట్లో నీటి మడుగులో ఉండే స్వామి వారి నిజరూప దర్శనం నిజంగా ఒక అద్భుతమని భక్తులు నమ్ముతారు. అందుకే వృద్ధులు, అనారోగ్య పీడితులు, అంగ వికలురు సైతం స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అత్తిచెట్టు కాండంతో తయారైన స్వామి వారి విగ్రహం నీటి అడుగున ఉన్నా పాడవకపోడానికి కారణాలేమిటి? అంటే ఆ చెట్టుకు ఉన్న విశిష్టతేనని పురాణాలు చెబుతున్నాయి. అత్తి చెట్టు కాండం అంటే మరో పురాణేతిహాసం గుర్తుకొస్తుంది ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజా హరిశ్చంద్ర తలపై ఉండే కిరీటాన్ని ఔదంబర వృక‌్ష కాండంతో తయారైందని చెబుతారు. అలాగే హరిశ్చంద్రుని సింహసనం కూడా అదే చెట్టు కాండంతో తయారైందని అది బంగారంకన్నా విలువైనదని పురాణాల్లో ఉంది అందుకే ఆలయాల్లో ఔదంబర వృక్షాన్ని భక్తితో కొలుస్తాం. ఔదంబర వృక్షమంటే దేవతలు కొలువై ఉన్న వృక్షంగా చెబుతుంటారు. అలాగే అత్తి చెట్టుకు కూడా పురాణ పరంగా ప్రాశస్త్యం ఉంది. వరద రాజస్వామి విగ్రహం కూడా అత్తి చెట్టుకాండంతో తయారైనదే కాబట్టి 48 రోజుల దర్శనం తర్వాత ఆ విగ్రహాన్ని వెండి పెట్టెలో పెట్టి ఆలయం కోనేటిలో ఉంచేస్తారు ఆలయం నీటి అడుగున ఉంచిన ఆ పెట్టెను 40 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుస్తారు. 1939లో,1979లో ఇలాగే ఈ ఆలయాన్నితెరిచారు. 40 ఏళ్లయినా నీటి అడుగున ఉండే ఆవిగ్రహం ఎందుకు పాడవదు అనే సందేహాలకు కూడా ఆలయాధికారులు, పూజారులు వేరే కారణాలు చెబుతారు. ఏ ఆలయంలోనైనా మండప నిర్మాణంపైనే దాని మనుగడ ఆధారపడి ఉంటుందంటారు. ఆలయంలో మండప నిర్మాణం కొన్ని ధార్మిక శక్తులు,ఆగమశాస్త్ర నియమాలు, యంత్రాల ఆధారంగా ఉంటుందని అలాగే కోనేటిలో నీటి అడుగున శయనింపచేసిన అత్తి వరదుడి విగ్రహంపై కూడా ఒక మండపం ఉందని ఆ మండపానికున్న ధార్మిక శక్తులే విగ్రహాన్ని ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉంచుతున్నాయని చెబుతారు. ఏదేమైనా మనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని,అలౌకిక అనుభూతిని కలిగించే అంశాలగురించి ఎంత తెలుసుకున్నా అది మనసుకు హాయినిస్తుంది మొత్తానికి అత్తి వరదుడి దర్శనానికి తెర పడింది.

హిందూ పురాణాలు, ఆలయాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. హిందూ విశ్వాసం అంతబలీయమైనది కాబట్టే వివాదాలను, విమర్శలను, నాస్తికతను కూడా తట్టుకుని అంతే బలంగా నిలబడుతోంది. అదే మన హైందవ సంస్కృతిలో ఉన్న బలం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories