మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

Sharad Pawar Meets Uddhav Thackeray
x

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

Highlights

Maharashtra Political Crisis: సీఎం పదవికి రాజీనామా చేయాలని ఉద్ధవ్ థాక్రేకు సూచించిన పవార్

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. శివసేన రెబల్స్ బలం మరింత పెరుగుతోంది. నిన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే దిలీప్‌ లాండే.. తిరుబాటు ఎమ్మెల్యేల క్యాంపుకు చేరుకోవడంతో షిండే బలం 40 దాటింది. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సుమారు 40 మంది ఉండగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే 10 మంది వరకు షిండే టీమ్ లో ఉన్నారు. తిరుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం.. శివసేనను ఆందోళనకు గురిచేస్తోంది.

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీఎం పదవికి రాజీనామా చేయాల్సందిగా ఉద్ధవ్ ఠాక్రేకు శరద్ పవార్ సూచించారు. రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 2/3వ వంతు ఉన్నందున కొంత మందిపై అనర్హత వేటు వేయడం సాధ్యంకాదని పవార్ తెలిపారు. తమ పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్ అనర్హత నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉందని ఉద్ధవ్ థాక్రేకు సూచించారు.

16 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌ నరహరిని ఉద్ధవ్‌ కోరారు. షిండేతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా దీనిపై మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్, ఉద్ధవ్‌కు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ని తప్పించాలని షిండే డిమాండ్‌ చేశారు. డిప్యూటీ స్పీకర్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో రెబల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన పార్టీ ఇచ్చిన నోటీసుపై డిప్యూటీ స్పీకర్.. న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపధ్యంలో ఇవాళ శివసేన జాతీయకార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు బీజేపీ నేతలతో మాజీ సీఎం ఫడ్నవీస్ ఇవాళ భేటీకానున్నారు.

శివసేనలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడంలేదు. తిరుగుబాటు వర్గం నేత ఏక్‌నాథ్‌ షిండే తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటుండగా.. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాజీ యత్నాల్లో భాగంగా శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ చేసిన ప్రతిపాదనకు షిండే వర్గం స్పందించక పోగా.. వేచి చూసే ధోరణినే కొనసాగిస్తోంది. తన మద్దతుదారుల్లోని 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రయత్నాలపై షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన శివసేన తమదేనని, పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికమంది తన వెంటే ఉన్నారని, అనర్హత పేరుతో భయపెట్టలేరని మండిపడ్డారు. తామే ప్రత్యర్థి వర్గంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బలమైన జాతీయ పార్టీ మద్దతిస్తోందని నిన్నటి వరకు చెప్పుకొచ్చిన ఏక్ నాథ్ షిండే తాజాగా మాట మార్చారు. ఏ జాతీయ పార్టీ తమను సంప్రదించలేదని చెప్పారు. ఒక పెద్ద శక్తి తమ వెనుకుంది అంటే.. అది బాలా సాహెబ్‌ థాక్రే, ఆనంద్‌ డిఘేనేనని షిండే తెలిపారు.

అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబయిలో పోలీసులు భారీగా మోహరించారు. గౌహతిలో రెబల్స్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని అసమ్మతి వర్గ నేత షిండే అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories