Rewind 2024 India: నెహ్రు తర్వాత మోదీకే సాధ్యమైన ఆ రికార్డ్ ఏంటి? 2024లో ఇండియాలో ఏం జరిగింది?
Rewind 2024 India - Major incidents in india in 2024: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెహ్రు రికార్డును సమం చేయడం, మళయాళ చిత్ర...
Rewind 2024 India - Major incidents in india in 2024: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెహ్రు రికార్డును సమం చేయడం, మళయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై హేమ కమిటీ కీలక అంశాలను బయట పెట్టడం, కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అనుమానాస్పద మృతి కేసు ఘటనలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. అలాగే రతన టాటా అనారోగ్యంతో కన్నుమూత, బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు, మణిపూర్‌లో అల్లర్లు వంటి ఘటనలు కూడా ఈ ఏడాది దేశాన్ని కుదిపేశాయి.
1.వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు.ఈ ఏడాది జూన్ 9న ప్రధానిగా ఆయన ప్రమాణం చేశారు. తనతో పాటు 30 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.2014 , 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్ డీ ఏ కూటమికి 293 సీట్లు దక్కాయి. ఇండియా కూటమి 233 సీట్లలో గెలిచింది. ఇతరులు 17 సీట్లలో నెగ్గారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రు ఉన్నారు.1952, 1957, 1962 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది. వరుసగా మూడుసార్లు ఆయన ప్రధానిగా కొనసాగారు. నెహ్రు రికార్డును మోదీ సమం చేశారు.
ఈసారి 400 సీట్లు టార్గెట్ గా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. కానీ, ఆ పార్టీ 240 స్థానాలకే పరిమితమైంది.ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆ పార్టీ ఆధారపడాల్సి వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు స్వంతంగా బలం ఉండింది. 2014లో 282 , 2019లో 303 సీట్లను కమలం పార్టీ స్వంతంగా గెలుచుకుంది.
2) జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్
మలయాళ సినీ పరిశ్రమలో కొంతమంది నటులు, దర్శకులు, నిర్మాతల చీకటి బాగోతాలను బయటపెట్టింది జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్. రెండేళ్ళ క్రితమే వెలుగు చూడాల్సిన ఈ నివేదిక కోర్టు కేసులతో వాయిదా పడుతూ వచ్చింది. హై కోర్టు అనుమతితో కేరళ ప్రభుత్వం ఈ నివేదిక బయట పెట్టక తప్పలేదు.
ప్రముఖ నటులు సిద్ధిఖి, ఎం ముకేష్, జయసూర్య, మణియన్‌పిల్ల రాజు, ఇడవెల బాబు వంటి కొంతమంది సినీ పెద్దలపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. చివరకు పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందంటే... మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
3 కోల్‌కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు
ఇక దేశాన్ని కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మృతి కేసు కుదిపేసింది. ఈ ఏడాది ఆగస్టు 9న జరిగిన జూనియర్ డాక్టర్ మృతి కేసు వెలుగు చూసింది. ఈ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో డాక్టర్లు నిరసనకు దిగారు. బెంగాల్ లో రోజుల తరబడి వైద్యులు ఆందోళనలు నిర్వహించారు.ఈ ఘటనను నిరసిస్తూ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా నిరసన చేశారు.
జూనియర్ డాక్టర్ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని ప్రచారం సాగింది. అయితే, జూనియర్ డాక్టర్ మృతదేహం లభించిన సెమినార్ హాలులో లైంగిక దాడి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఫొరెన్సిక్ నివేదిక వెల్లడించింది.
సీఎఫ్ఎస్ఎల్ నివేదిక సీబీఐకి అందింది. ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఇదే ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. డాక్టర్ల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాల్సిందిగా సూచిస్తూ 10 మంది నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.
4 రతన్ టాటా మరణం
భారతదేశం చెప్పుకోదగిన పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా పేరొందిన పద్మ విభూషణ్ రతన్ టాటా ఈ ఏడాది అక్టోబర్ 9న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో సొంత మనిషిని కొల్పోయినంతగా యావత్ దేశం తల్లడిల్లింది. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా అంతకు మించిన మానవతావాదిగా ఆయనకు పేరుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయనను చూస్తే తెలిసిపోతుంది. అందుకే భారతీయుల మదిలో ఎవ్వరికీ దక్కని ఒక ప్రత్యేకమైన గౌరవం ఆయనకు మాత్రమే దక్కింది.
5 బాబా సిద్ధిఖీ మర్డర్ కేసు - తెగించిన లారెన్స్ బష్ణోయ్ గ్యాంగ్
ముంబైలో మాజీ మంత్రి బాబా సిద్దిఖీని హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 12న సిద్దిఖీ హత్య జరిగింది. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సిద్దిఖీని హత్య చేయడం ద్వారా పరోక్షంగా కండలవీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు పంపింది. గుజరాత్ జైల్లో నుంచే బిష్ణోయ్ తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. అన్మోల్ బిష్ణోయ్ విదేశాల్లో ఉంటూ బాబా సిద్ధిఖి మర్డర్‌కు ప్లాన్ చేశారు. పోలీసుల విచారణలో బాబా సిద్ధిఖి హత్య కేసు నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.
6. సీతారాం ఏచూరి కన్నుమూత
వరుసగా మూడుసార్లు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి అనారోగ్యంతో ఈ ఏడాది సెప్టెంబర్ 12న మరణించారు. 1975లో ఆయన సీపీఎంలో చేరారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ఏచూరి జైలుకు వెళ్లారు. 1992 నుంచి ఆయన సీపీఎంలో అత్యున్నత నిర్ణయాలకు కేంద్రంగా ఉండే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2015 నుంచి ఆయన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరణించే సమయానికి కూడా ఆయన ఈ పదవిలో ఉన్నారు. పార్టీ మహాసభలు జరిగే వరకు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో కు సమన్వయం చేసే బాధ్యతను ప్రకాష్ కారత్ తీసుకున్నారు.
ఏచూరి 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 1977లో జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఏచూరి బాధ్యతలు చేపట్టారు. ఎస్ఎఫ్ఐ నిర్మాణంలో ఆయన కీలకంగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో సీపీఎంలో చేరారు.2004, 2023 ఇండియా కూటమి ఏర్పాటులో ఆయనది కీలకపాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏచూరి...సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన సుందరయ్యకు శిష్యుడు.
7. మణిపూర్‌లో ఆగని అల్లర్లు
మణిపూర్ లో అల్లర్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఇక్కడ అశాంతి కొనసాగుతోంది. రెండు తెగల మధ్య ప్రారంభమైన అల్లర్లు మిలిటెంట్లు, ప్రత్యేక బలగాలకు మధ్య పోరాటంగా మారాయి. 2023 మేలో రెండు తెగల మధ్య ప్రారంభమైన అల్లర్లు ఈ ఏడాదిలో తిరిగి ప్రారంభమయ్యాయి.
తెగల మధ్య పోరాటం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ ఏడాది నవంబర్ 16న సీఎం బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం జరిగింది. ఆరుగురు మ్మెల్యేలు, బీజేపీ నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు దిగారు. సీఎం ఇంటిపై దాడికి ప్రయత్నించినవారిపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించినా నిరసనకారులు వెనక్కు తగ్గలేదు.
నవంబర్ 14న మైతీ తెగకు చెందిన ఇద్దరు పిల్లలు, ఓ మహిళ సహా ఆరుగురు జిరి నదిలో శవాలు కన్పించడంతో మళ్లీ అల్లర్లు ప్రారంభమయ్యాయి. జిరిబామ్ లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు కొందరు మహిళలు, పిల్లలు కిడ్నాప్ చేసి ఆరుగురిని హత్య చేశారని అనుమానాలున్నాయి. చేజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తిరిగి విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో భద్రతా దళాలకు, మిలిటెంట్లు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
8. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఈ ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంది. పెమాఖండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిక్కింలో క్రాంతి కారి మోర్చా పార్టీ మరోసారి అధికారం దక్కించుకుంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు మే లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో ఎన్ డీ ఏ కూటమి అధికారందక్కించుకుంది. చంద్రబాబు సీఎం అయ్యారు. ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకుంది. 25 ఏళ్ల బీజేడీ నేత నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్ము కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కు ప్రజలు పట్టం కట్టారు. ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యారు. హర్యానాలో బీజేపీ అధికారం దక్కించుకుంది. నయాబ్ సింగ్ సైనీ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో ఎన్ డీ ఏ కూటమి అధికారం కైవసం చేసుకుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. ఏక్ నాథ్ షిండే అసంతృప్తితో సీఎం ప్రకటన ఆలస్యమైంది.జార్ఖండ్‌లో జేఎంఎం అధికారాన్ని నిలుపుకుంది. హేమంత్ సోరేన్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
9. మన్మోహన్ సింగ్ కన్నుమూత
దేశం ఆర్దిక కష్టాల్లో ఉన్న సమయంలో ఆర్ధిక మంత్రిగా గట్టెక్కించడమే కాదు పదేళ్లు దేశాన్ని ప్రధానిగా ముందుకు నడిపిన మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న మరణించారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. డిసెంబర్ 28న అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. మన్మోహన్ స్మారక ఏర్పాటుకు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire