2019 ఇక కాలగర్భంలోకి వెళ్తోంది...2020 రాబోతుంది. 2019లో దేశంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్, పార్లమెంట్, ఉగ్రవాదం, ఎన్నికలు,...
2019 ఇక కాలగర్భంలోకి వెళ్తోంది...2020 రాబోతుంది. 2019లో దేశంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్, పార్లమెంట్, ఉగ్రవాదం, ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పులు కీలక అంశాలుగా నిలిచాయి. ఒక్కో ముఖ్యమైన ఘటన దేశంపై తనదైన రీతిలో ప్రభావాన్ని కనబర్చింది.
దేశ చరిత్రలో 2019 కొన్ని ముఖ్యమైన ఆర్థికపరమైన సంఘటనలకు వేదికైంది. దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే రీతిలో పలు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలు చోటు చేసుకున్నాయి.
దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రధాన నిర్ణయాలు 2019లో తీసుకున్నారు. జనవరిలో మొదలైన బ్యాంకుల విలీన ప్రక్రియ ఏడాది చివరి వరకూ కొనసాగింది. ఒకప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తరహా చరిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2017లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా విలీనాల తరువాత వాటి సంఖ్య 12కు తగ్గిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైపోయాయి. దీంతో దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా పీఎన్ బీ రూపుదిద్దుకుంది. ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానుంది. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ కలసిపోయింది. దీంతో నాలుగో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా కెనరా బ్యాంక్ మారింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. దీంతో దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ నిలిచింది.
ఈ సంవత్సరం పార్లమెంట్ పలు కీలక చట్టాలను ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం మొదలుకొని పౌరసత్వ సవరణ చట్టం దాకా ఎన్నో చట్టాలు వీటిలో ఉన్నాయి.
విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు జనవరి 9న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పది శాతం కోటాని ఫిబ్రవరి నుంచే అమలు చేయడం ప్రారంభించారు. పలు విద్యాసంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గా విభజించారు. కంపెనీల చట్టం 2013ని సవరిస్తూ కంపెనీస్ బిల్ 2019ని పార్లమెంట్ ఆమోదించింది. దివాళా, అపరిష్కృత కోడ్ - ఐబీసీ రెండవ సవరణ బిల్లు-2019ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జులైలో మొదటి సవరణ జరిగింది. వేతనాల కోడ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.
సమాచార హక్కు సవరణ బిల్లును జులై 19న లోక్ సభలో ప్రవేశపెట్టారు. చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. మోటార్ వాహనాల సవరణ బిల్లు కింద జరిమానాలను భారీగా పెంచారు. మానవ హక్కుల రక్షణ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. మధ్యవర్తిత్వం, సెంట్రల్ యూనివర్సిటీలు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, లాంటి మరెన్నో బిల్లులను కూడా పార్లమెంట్ ఆమోదించింది. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. 2019లో పార్లమెంట్ లో 59 బిల్లులను ప్రవేశపెట్టారు. మొత్తం మీద 47 బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది.
ఈ ఏడాది కశ్మీర్ లో పడగ విప్పిన ఉగ్రవాదం భారత్, పాక్ ల మధ్య యుద్ధం జరుగుతుందా అనే వరకూ వెళ్ళింది. భారత వైమానిక దళం నియంత్రణ రేఖ దాటింది. అణుబాంబుల ప్రస్తావన కూడా వచ్చింది.
కశ్మీర్ లో ఉగ్రవాదం మరోసారి పడగ విప్పింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు మరణించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడి సందర్భంగా నియంత్రణ రేఖను భారత వైమానికదళం దాటడం ఓ ముఖ్యసంఘటన. భారత్ వైమానిక దళం పాకిస్థాన్ లోని బాలాకోట్ పరిసరాల్లో బాంబులు వేసి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ భారత్ యుద్ధ విమానాన్ని నేలకూల్చింది.
పైలట్ అభినందన్ వర్ధమాన్ ను బందీగా పట్టుకుంది. ఆయనను మార్చి 1న విడుదల చేసింది. నాటి నుంచి కూడా పలు సందర్భాల్లో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అణుబాంబు ప్రయోగం ప్రస్తావన కూడా వచ్చింది. ఆ విషయంలో భారత్ ఒక్కసారిగా తన విధానం కూడా మార్చుకుంది. అవసరమైతే మొదటిగా అణుబాంబు ప్రయోగించేందుకు సిద్ధమేనన్న సందేశాన్ని ఇచ్చింది. ఇక పాకిస్థాన్ సుమారు 140 రోజులు తన గగనతలం గుండా భారత్ విమానాల రాకపోకలను నిషేధించింది. భారత్ ప్రధాని మోడీ విదేశీ పర్యటనల సందర్భంగా ఆయన విమానం పాక్ గగనతలం గుండా వెళ్ళేందుకు కూడా అనుమతి నిరాకరించింది. రెండు దేశాల మధ్య సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలను కూడా పాకిస్తాన్ ఫిబ్రవరి 28న నిలిపివేసింది. మార్చి 4 నుంచి రైలు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు పాకిస్థాన్ తమ దేశంలోని కొంతమంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది.
ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఓ కీలకఘట్టం. బీజేపీ మరోసారి విజయం సాధించింది. ప్రధానిగా మోడీ మరోసారి అధికారపగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం చవిచూసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న దేశంలో ఓటింగ్ మొదలైంది. ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొదటి నుంచి చెప్పుకున్నట్లుగా 300 ప్లస్ సీట్లను సాధించింది. మే 30న మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో గెలుపొందింది. గతంలో కంటే 21 స్థానాలను అదనంగా గెలిచింది. కాంగ్రెస్ మరోసారి ఘోరపరాజయం చవిచూసింది. ఆ పార్టీ మొత్తం మీద 52 స్థానాల్లో విజయం సాధించింది.
సాధించిన ఓట్ల పరంగా చూస్తే బీజేపీ మొత్తం ఓట్లలో 37.36 శాతం సాధించింది. కాంగ్రెస్ 19.01 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. మొత్తం మీద బీజేపీ కూటమి 353 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ కూటమి 91 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు 98 సీట్లలో నెగ్గారు. ఇదే సందర్భంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికల సందర్భంలో ఐటీ దాడులు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఫేక్ న్యూస్, నమో టీవీ, మోడీ బయోపిక్ వంటి వివాదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. గాంధీ- నెహ్రూ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని కూడా రాహుల్ కోరుకున్నారు. పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకు సోనియాగాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు.
2019లో సుప్రీం కోర్టు పలు కీలక తీర్పులు ఇచ్చింది. దేశంలో మత, రాజకీయ, సామాజిక వ్యవస్థలను ఇవి ప్రభావితం చేశాయి. శబరిమల, అయోధ్య, ఎస్సార్ స్టీల్ ఇంకా మరెన్నో అంశాలకు సంబంధించిన తీర్పులు వీటిలో ఉన్నాయి. వీటిలో అత్యధికం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ ఉన్నప్పుడు వెలువడ్డాయి.
ఈ ఏడాది కాలంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుల్లో ముఖ్యమైంది అయోధ్య అంశం. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి వీలు కల్పించేలా నవంబర్ 9న తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ లో కేంద్రప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యల సందర్భంలో రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీకి సూచిస్తూ ప్రొసీడింగ్స్ ను ముగించింది సుప్రీం కోర్టు. ఇక శబరిమల తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన కేసులో, ఆ కేసును ఏడుగురు జడ్జీల బెంచ్ కు రెఫర్ చేసింది. కొన్ని మసీదుల్లోకి, పార్సీ ఆలయాల్లోకి మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రో లాంటి అంశాలు అన్నీ కూడా శబరిమల రివ్యూ కేసు లోని అంశాల తరహాలోనివే అంటూ వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందన్న సుప్రీంకోర్టు కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ కింద న్యాయమూర్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఫ్లోర్ టెస్ట్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదివారం నాడు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపట్టడం ఓ అరుదైన సందర్భం. ఎస్సార్ స్టీల్ ను ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి మార్గం సుగమం చేసింది సుప్రీం కోర్టు. ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కర్నాటక రెబెల్ ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా 2019 ఒక మైలురాయిగా నిలిచింది. చంద్రయాన్ 2 మొదలుకొని క్షిపణి సంబంధిత పరీక్షల దాకా ఎన్నో ముఖ్య సంఘటనలు ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్నాయి. చంద్రయాన్ 3 సన్నాహాలు కూడా మొదలుకావడం మరో విశేషం.
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పాక్షికంగా విజయం సాధించింది. రోవర్ చంద్రునిపై సరిగా ల్యాండ్ కాలేకపోయింది. ఇక తాజాగా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ పనులను కూడా ఇస్రో ప్రారంభించింది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కు వీరు ముత్తవేల్ సారథ్యం వహించనున్నారు. ఉపరితలం నుండి అంతరిక్షానికి సత్వరమే ప్రయోగించగల (క్యుఆర్‌ఎస్‌ఎఎమ్) రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. తాజాగా బ్రహ్మోస్ ను కూడా విజయవంతంగా పరీక్షించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire