RBI: రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచిన RBI

RBI Raises Repo Rate by 40 Basis Points to 4.40% as Inflation Bites
x

RBI: రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచిన RBI

Highlights

RBI: రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచిన RBI

RBI: రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను 40 బేసిస్‌ల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే వడ్డీ రేట్లు 0.4శాతం మేరకు పెరిగింది. ఈ వడ్డీరేట్ల పెంపు ద్వారా దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందనేది అంచనా. ఈ వడ్డీరేట్ల పెంపు వలన - బ్యాంకుల నుంచి రుణ మంజూరు తగ్గి, తద్వారా ఆర్థిక వ్యవస్థలో, డబ్బు చలామణి తగ్గుతుందనేది అంచనా. ఇప్పటికే రుణ గ్రహీతలు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం వలన కూడా మరింత డబ్బు బ్యాంకులలోకి తిరిగి చేరుతుంది. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న డబ్బు మొత్తం తగ్గుతుంది.

ఈ విధంగా డబ్బు చలామణి తగ్గడంతో - ప్రజల చేతిలో ఉన్న డబ్బు తగ్గి, తద్వారా సరుకులు సేవలకు డిమాండ్ తగ్గుతుందనేది లెక్క. ఈ డిమాండ్‌ తగ్గుదల ఫలితంగా - సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయి. ఆర్బీఐ చెప్పినట్లుగా - ఈ వడ్డీరేట్ల పెంపు వలన, ఆహార పదార్థాల ధరలు ఏ మాత్రం తగ్గవు. పైగా అవి మరింత పెరుగనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం గురించి తన ప్రస్తావనలో గవర్నర్ వంటనూనెల ప్రస్తావన కూడా తెచ్చారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అనేది ఆయన మాటల సారాంశం.

ప్రస్తుతం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణం - కేవలం దేశంలో ద్రవ్య చలామణి అధికంగా ఉండటం మాత్రమే కాదు. దీనికి అసలు ప్రధాన కారణం - అంతర్జాతీయంగా కమోడిటీ ల ధరల పెరుగుదల, దానితో పాటుగా మన దేశంలో ప్రభుత్వ విధానాలు.

ప్రస్తుతం ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అనేక సంవత్సరాలుగా - ప్రపంచంలోని అనేక దేశాలు, తమ ఆర్థిక వ్యవస్థలలో చురుకుదనాన్ని పెంచేందుకు భారీ ఎత్తున ఉద్దీపన పథకాల రూపంలో - ద్రవ్య చలామణి పెంచుతూ పోవటం వంటివి అంతర్జాతీయంగా ఈ ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణానికి కారణం. ఈ ఒత్తిడి మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన పడుతోంది. మనం అనేక రకాల నిత్యావసరాలను దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నాం.

సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం ఉక్రెయిన్, రష్యా లపై అధికంగా ఆధార్ పడుతున్నాం. ప్రస్తుతం ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కొండెక్కి కూర్చుంది. ఇక పామాయిల్ అవసరాల కోసం ఇండోనేషియా దేశంపై ఆధార పడుతున్నాం. కాగా ప్రస్తుతం ఇండోనేషియా ప్రభుత్వం ఈ పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకోవటంతో ధర పెరిగింది. మొత్తంగా రానున్న కాలంలో వంటనూనెల ధరలు 200 శాతం మేరకు పెరుగనున్నట్లు సమాచారం.

దేశంలోని మన ప్రభుత్వ విధానాలు కూడా ద్రవ్యోల్బణానికి కారణం అవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ల పై భారీ ఎత్తున ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేయటం ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణం. సుదీర్ఘకాలంగా - వంట నూనెల విషయంలో స్వయం సమృద్ధిని సాధించటంలో ప్రభుత్వాలు అన్నింటి వైఫల్యం కూడా ఉంది. నిన్న మొన్నటి వరకు వంటనూనెల దిగుమతులపై భారీ ఎత్తున టారిఫ్ లను విధించిన ప్రభుత్వ విధానాలు కూడా దీనికి కారణమే.

ప్రస్తుత ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ కమిటీల ధరల పెరుగుదల ఉందన్నది వాస్తవం. ఇక ఇదంతా చాలదన్నట్లు పాలకులు బియ్యం, గోధుమలు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వలన ధాన్యానికి వివిధ దేశాలలో కొరతలు ఏర్పడ్డాయి. దీనితో మన దేశం నుంచి దిగుమతులకు పలు దేశాల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే దేశీయంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే తాపత్రయంతో మన దేశ గిడ్డంగులలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం భారీ స్థాయిలో ఎగుమతి చేస్తోంది. ఇక ఇప్పటికే మన వ్యవసాయ ఉత్పత్తులు సుమారుగా 50. 21 మిలియన్ల డాలర్లను దాటిపోయాయి ఇదో రికార్డు. ప్రస్తుతం దేశీయ గోధుమలు ఎగుమతులు భారీగా పెరిగిపోయాయి. అంతిమంగా దేశంలో గోధుమల నిల్వలు తగ్గి, వాటికి బదులుగా ఆహారభద్రత చట్టం కింద, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇచ్చే ధాన్యాలలో వరిధాన్యం మోతాదు పెంచాలనే ప్రతిపాదన ముందుకు వస్తోంది.

కేవలం రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడంతోనే దేశంలో ధరలు తగ్గవు. దీనిని మించి ప్రస్తుతం కావాల్సింది మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. మొదటగా పెట్రోల్ డీజిల్ ల పైన విధించిన భారీ ఎక్సైజ్ సుంకాలను ప్రభుత్వం తగ్గించాలి. దానితో పాటుగా దేశీయంగా వంటనూనెలు వంటి వాటి ఉత్పత్తిని, సాగుబడిని పెంచి చర్యలు మరింతగా తీసుకోవాలి. దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఆహారధాన్యాలను బయటి దేశాలకు ఎగుమతి చేసే నిబద్ధత ఉండాలి. అలాగే దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను గతంలో లాగా మరింత బలోపేతం చేయాలి. దాని వలన, ప్రజలు బహిరంగ మార్కెట్లోనే కాక, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి చౌకైన సరుకులను అందించే వ్యవస్థపై ఆధార పడటం, బహిరంగ మార్కెట్లో కూడా వివిధ సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయి.

అంతిమంగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ స్వయంగా అంగీకరించినట్లుగా - ఈ వడ్డీరేట్ల పెంపు - దేశీయ ఫైనాన్స్ మార్కెట్లలో అంటే షేర్ మార్కెట్ లలో తీవ్ర ఒడిదుడుకులను అరికట్టేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. ప్రస్తుతం అమెరికా వంటి ధనిక దేశాలలో కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ ఉండటం వలన - అది మన దేశీయ షేర్ మార్కెట్ల లో పెట్టుబడుల ఉపసంహరణకు కారణం అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories