నన్ను క్షమించండి.. రాజకీయాల్లోకి రాలేకపోతున్నా

నన్ను క్షమించండి.. రాజకీయాల్లోకి రాలేకపోతున్నా
x
Highlights

దేవుడు ఆదేశించాడు. అరుణాచలం ఆగిపోయాడు. తలైవా రజనీకాంత్‌ అభిమానులకు షాకిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆరోగ్యం సహకరించడంలేదని ప్రకటించారు. ఎంతో బాధతో...

దేవుడు ఆదేశించాడు. అరుణాచలం ఆగిపోయాడు. తలైవా రజనీకాంత్‌ అభిమానులకు షాకిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆరోగ్యం సహకరించడంలేదని ప్రకటించారు. ఎంతో బాధతో ఈ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. తనను క్షమించాలని మక్కల్‌ మండ్రం నాయకులు, కార్యకర్తలను కోరారు. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారు తమిళ సూపర్‌స్టార్‌. రజనీ రాజకీయాలపై ఫోకస్‌....

నన్ను క్షమించండి...అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రాలేకపోతున్నాను.. ఎంతో విచారంతో ఈ ప్రకటన చేస్తున్నాను.. రాజకీయాల్లోకి రాకపోయినా.. ప్రజాసేవలో కొనసాగుతాను.. అరవ అభిమానుల తెరవేల్పు..అభిమానుల నుంచి రకరకాల బిరుదులు పొందిన రజనీకాంత్‌ ట్విటర్‌లో పెట్టిన మూడు పేజీల లేఖలోని సారాంశం ఇది..రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని..పాతికేళ్ళుగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఎప్పటికప్పుడు..రాజకీయ అరంగేట్రం వాయిదా పడుతూ వస్తోంది.

ఈ నెల 12వ తేదీనే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీ.. హైదరాబాద్‌లో జరిగిన అన్నాత్తే సినిమా షూటింగ్‌లో అనారోగ్యం బారిన పడ్డారు. హై బ్లడ్‌ ప్రెషర్‌కు రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం.. డిశ్చార్జ్‌ చేశాక రజనీ చెన్నై వెళ్ళిపోయారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు రోజులకు.. రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు..డిసెంబర్‌ 31న పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించనున్నట్లు తెలిపారు రజనీకాంత్‌. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ రాజకీయాల్లోకి రావడం కుదరదన్న రజనీకాంత్‌ అన్నంత పనీ చేశారు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించడంలేదని..కుటుంబ సభ్యులు, వైద్యుల సలహా, సూచనల మేరకే రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు తెలిపారు. మూడేళ్ళుగా పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్న మక్కల్‌ మండ్రం కార్యకర్తలు తనను క్షమించాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయినందున..రాజకీయాల్లోకి వెళ్ళవద్దని..బయట తిరిగితే ఎండ, దుమ్ము వల్ల ఆరోగ్యం క్షీణించిపోతుందని డాక్టర్లు గట్టిగా సూచించినట్లు అక్టోబర్‌లోనే రజనీ తెలిపారు.

రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజా సేవ కొనసాగిస్తానని తన ప్రకటనలో తెలిపారు రజనీకాంత్‌. అన్నాత్తే సినిమా షూటింగ్‌ త్వరగా పూర్తి చేసుకుని 31వ తేదీన రాజకీయ పార్టీ ప్రకటన చేయడానికి రజనీ నిర్ణయించుకున్నారు. అందుకే రోజులో చాలా ఎక్కువ సమయాన్ని షూటింగ్‌లో గడిపారు. ఇంతలో చిత్రబృందంలో నలుగురికి కరోనా రావడంతో...రజనీ సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్ళిపోయారు. అప్పటికే షూటింగ్‌లో అలసిపోయిన రజనీకి..ఇటు సినిమా..అటు రాజకీయాల ఒత్తిడితో హైపర్‌ టెన్షన్‌ పెరిగింది. తన అనారోగ్యం కారణంగానే అన్నాత్తై సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. అందువల్ల చాలామంది తమ ఉపాధి కోల్పోయారని రజినీకాంత్ తన ప్రకటనలో చెప్పారు. తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజినీకాంత్.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్మకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు... మానసిక ప్రశాంతత కోల్పోతారని తెలిపారు.

2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానంటూ...2017 డిసెంబర్‌లో నిర్వహించిన అభిమానుల సమావేశంలో ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ ప్రకటన ఎప్పుడొస్తుందా అని మక్కల్‌ మండ్రం నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమీపిస్తుండటంతో రజనీ ఇక రాజకీయాల్లోకి వచ్చేస్తారని భావించారు. తనకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అభిమానుల కోసం..తన ప్రాణాలను లెక్కచేయబోనని...తమిళనాడు రాజకీయాలను సమూలంగా మార్చేందుకు వస్తున్నానని నెల రోజుల క్రితం ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో దిగ్గజాలుగా పేరు పొందిన ఇద్దరు అగ్రనేతలు కరుణానిధి, జయలలిత రెండేళ్ళ తేడాతో కన్నుమూశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాలను శూన్యం ఆవరించింది. ఎన్ని పార్టీలున్నా...కొత్తగా ఎన్ని వస్తున్నా..రజనీ మేనియా అనేది మామూలు విషయం కాదు. అందుకే తలైవా రాజకీయాల్లో వస్తున్నాడంటే ఎంత మంది సంతోషించారో...అంత మంది భయపడ్డారు కూడా. ప్రస్తుతం రజనీ చేసిన ప్రకటన సంతోషించేవారికి విచారాన్ని..భయపడ్డవారికి సంతోషాన్ని కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories