Worker Trapped in Coaches: రైలు బోగీల మధ్య నలిగిపోయాడు

Worker Trapped in Coaches: రైలు బోగీల మధ్య నలిగిపోయాడు
x
Highlights

Railway worker Trapped in between two coaches: బీహార్‌లోని బెగుసరాయి జిల్లా బరౌని జంక్షన్ వద్ద ఒక ఊహించని రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో...

Railway worker Trapped in between two coaches: బీహార్‌లోని బెగుసరాయి జిల్లా బరౌని జంక్షన్ వద్ద ఒక ఊహించని రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో రెండు బోగీల మధ్య షంటింగ్ ఆపరేషన్ చేస్తోన్న రైల్వే పోర్టర్ అమర్ కుమార్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. బరౌని జంక్షన్ 5వ ప్లాట్ ఫామ్‌పై పోర్టర్ అమర్ కుమార్ రావు విధులు నిర్వహిస్తుండగా శనివారం ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పుడే లక్నో జంక్షన్ నుండి లక్నో - బరౌని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వచ్చి ఆగింది. అమర్ కుమార్ ఆ రైలు వద్దకు వెళ్లి బోగీలను వేరు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రైలు లోకోపైలట్ ఊహించని విధంగా రైలును వెనక్కిపోనిచ్చారు. దీంతో అమర్ కుమార్ రెండు బోగీల మధ్య ఇరుక్కుపోయారు. ఆయన తప్పించుకునేందుకు వీలు కూడా లేకపోయిందని ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

అమర్ కుమార్ బోగీల మధ్య చిక్కుకుని విలవిలలాడుతుండటం అక్కడే ప్లాట్ ఫామ్‌పై నిలబడిన ప్రయాణికులు గమనించి గట్టిగా కేకలు వేశారు. ఆ కేకలు విని అప్రమత్తమైన లోకోపైలట్ రైలును ముందుకు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదని తెలుస్తోంది. మరోవైపు అప్పటికే అమర్ కుమార్ రావు పరిస్థితి విషమించడంతో రెండు బోగీల మధ్యే చిక్కుకుని తుది శ్వాస విడిచారు. దాంతో అమర్ పరిస్థితి చేయిదాటిపోయిందని గుర్తించిన లోకోపైలట్ అక్కడి నుండి పరారయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధాకరమైన విషయం ఏంటంటే.. చూస్తుంటేనే గుండె తరుక్కుపోయే ఈ విషాదానికి సంబంధించిన దృశ్యాన్ని అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు తమ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీస్తూ నిలబడ్డారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories