Train Hits LPG Cylinder: రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్.. ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసినప్పటికీ..

Train Hits LPG Cylinder: రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్.. ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసినప్పటికీ..
x
Highlights

Train Hits LPG Cylinder On Railway Tracks: రైల్వే పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి గుర్తుతెలియని దుండగులు ఘోర రైలు ప్రమాదానికి కుట్ర చేశారు. కానీ...

Train Hits LPG Cylinder On Railway Tracks: రైల్వే పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి గుర్తుతెలియని దుండగులు ఘోర రైలు ప్రమాదానికి కుట్ర చేశారు. కానీ అదృష్టవశాత్తుగా వారు ప్లాన్ చేసినట్లుగా జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి హర్యానాలోని భివానికి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై ఎవరో గుర్తుతెలియని దుండగులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ని పెట్టి భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ప్రయాగ్‌రాజ్ - భివాని కాళింది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఢీకొంది. కానీ అదృష్టవశాత్తుగా ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే క్రాసింగ్‌కి సమీపంలోని ముదేరి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్ పెట్టి ఉండటం దూరం నుండే గమనించిన లోకో పైలట్.. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశారు. అయినప్పటికీ అప్పటికే రైలు వేగంతో ఉండటంతో కీసుమని శబ్ధం చేసుకుంటూ వెళ్లి సిలిండర్‌ని ఢీకొట్టింది. ఆ తరువాత కొద్దిదూరంలోనే రైలు నిలిచిపోయింది. రైలు ఢీకొన్న వేగానికి సిలిండర్ వెళ్లి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించకపోయి ఉంటే రైలు పట్టాలు తప్పడమో లేదా మరో ప్రమాదమో సంభవించి ఉండేదని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి.

కాళింది ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని అక్కడే నిలిపిన లోకోపైలట్ జరిగిన విషయాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే 20 నిమిషాల పాటు నిలిపేశారు. అనంతరం బిలౌర్ స్టేషన్‌లో రైలుని ఆపేసి ప్రాథమిక విచారణ జరిపారు.

భారీ కుట్రకు ప్లాన్ చేసిన దుండగులు.. ఘటనాస్థలం వద్ద అనుమానాస్పదంగా వస్తువులు

రైలు ఎల్పీజీ సిలిండర్‌ని ఢీకొన్న ఘటనాస్థలం వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ పోలీసులకు లభించిన కొన్ని వస్తువులు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. పెట్రోల్ నింపి ఉన్న బాటిల్, అగ్గిపెట్టెలతో పాటు ఇంకొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్న ఒక బ్యాగ్‌ని పోలీసులు గుర్తించారు. ఆ వస్తువులను పరీక్షించి చూస్తే.. దుండగులు పెట్రోల్ బాంబుని అమర్చి భారీ కుట్రకు ప్లాన్ చేశారా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు.

రైల్వే ట్రాక్‌పై ఎల్పీజీ సిలిండర్ ఘటనపై కాన్పూర్ పోలీసు కమిషనర్ హరీష్ చంద్ర స్పందిస్తూ.. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే రైల్వే శాఖ, దర్యాప్తు సంస్థలు ప్రధానమైన రైలు మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయన్నారు. ఘటనాస్థలంలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు యూపీ పోలీసు డాగ్ స్క్వాడ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు అక్కడి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అన్వర్‌గంజ్, కస్గంజ్ రైలు మార్గంలో అదనపు బలగాలను మొహరించినట్లు కాన్పూర్ పోలీసు కమిషనర్ హరీష్ చంద్ర వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories