Prajwal Revanna Sex Tapes: ‘ఆయన మా అమ్మను రేప్ చేశాడు. వీడియో కాల్‌లో నన్ను బట్టలు విప్పమని బెదిరించేవారు’

Prajwal Revanna Sex Tapes He Raped my mother He Threatened To Undress In A video Call
x

Prajwal Revanna Sex Tapes: ‘ఆయన మా అమ్మను రేప్ చేశాడు. వీడియో కాల్‌లో నన్ను బట్టలు విప్పమని బెదిరించేవారు’

Highlights

Prajwal Revanna Sex Tapes: ‘‘ప్రజ్వల్ రేవణ్న మా అమ్మ మొబైల్‌కు వీడియో కాల్స్ చేసేవారు. ఫోన్ ముందే ఆయన చూస్తుండగా బట్టలు విప్పాలని ఆయన నన్ను బలవంత పెట్టేవారు. ఒకవేళ నేనలా చేయకపోతే మా అమ్మను, నన్ను ఏదైనా చేసేస్తానని బెదిరించేవారు.

Prajwal Revanna Sex Tapes: ‘‘ప్రజ్వల్ రేవణ్న మా అమ్మ మొబైల్‌కు వీడియో కాల్స్ చేసేవారు. ఫోన్ ముందే ఆయన చూస్తుండగా బట్టలు విప్పాలని ఆయన నన్ను బలవంత పెట్టేవారు. ఒకవేళ నేనలా చేయకపోతే మా అమ్మను, నన్ను ఏదైనా చేసేస్తానని బెదిరించేవారు. మా అమ్మను ఆయన రేప్ చేశారు. ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్న కూడా మా అమ్మను లైంగిక వేధింపులకు గురిచేశారు’’ అని ప్రత్యేక దర్యాప్త బృందం (సిట్) ఎదుట తాజాగా ఒక బాధితురాలు వెల్లడించారు.

ప్రజ్వల్ రేవణ్నకు వ్యతిరేకంగా పోలీసుల ముందు వాంగ్మూలాలు ఇచ్చిన మహిళల్లో ఆమె కూడా ఒకరు.

అసలు ఎవరీ ప్రజ్వల్ రేవణ్న, ఆయనపై లైంగిక వేధింపుల కేసులు వరుసపెట్టి ఒక్కొక్కటిగా ఎలా బయటకు వస్తున్నాయి, దీనిపై ఆయన ఏం చెబుతున్నారు?

ప్రజ్వల్ రేవణ్న ఎవరు?

33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్న జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) చీఫ్, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవె గౌడకు మనుమడు. రేవణ్న జేడీఎస్ ఎంపీ కూడా.

ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ఆయన పోటీచేశారు.

రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఇక్కడ ఓటింగ్ జరిగింది. అదే సమయంలో సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా లైంగిక వేధింపుల వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ వీడియోల్లో మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లుగా కనిపిస్తోంది ప్రజ్వల్ రేవణ్నేనని పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.

వీటిని రికార్డు చేసింది కూడా ప్రజ్వల్ రేవణ్నలానే వీడియోల్లో కనిపిస్తోంది. హసన్ నియోజకవర్గంలో ఇవి దావానలంలా వ్యాపించాయి.

మొత్తంగా 2,967 లైంగిక వేధింపుల వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కొందరు తనకు అందించారని బీజేపీ నాయకుడు దేవరాజే గౌడ మీడియా ఎదుట వెల్లడించారు. అయితే, ఈ వీడియోలను మీడియాకు లీక్ చేశారని ఆరోపిస్తూ దేవెరాజ గౌడను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఫిర్యాదుల వెల్లువ

వీడియోలు వైరల్ అవుతుండగా ప్రజ్వల్ రేవణ్న తనను లైంగికంగా వేధించారని ఒక మహిళ (కథనం మొదట్లో పేర్కొన్న మహిళ తల్లి) పోలీసులను ఆశ్రయించారు. 2019 నుంచి 2022 మధ్య తనపై చాలాసార్లు లైంగిక దాడి చేశారని 60 ఏళ్ల వయసున్న ఆమె ఆరోపించారు.

ప్రజ్వల్ రేవణ్న తండ్రి, హోలెనరిసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్న కూడా తన భార్య ఇంట్లో లేనప్పుడు తనను రేప్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను తుపాకీ గురిపెట్టి బెదిరించి రేప్ చేశారని ఆ తర్వాత మరొక మహిళ కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇంకొక మహిళ కూడా ఫిర్యాదు చేశారు.

మొత్తానికి మే 15 నాటికి ప్రజ్వల్ రేవణ్నపై పోలీసులు మూడు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్‌)లు నమోదు చేశారు.

ఈ లైంగిక వేధింపుల కేసులపై విచారణకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది.

ప్రజ్వల్ రేవణ్న ఏం చెబుతున్నారు?

లైంగిక వేధింపుల ఆరోపణల నడుమ ప్రజ్వల్ రేవణ్న దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, ప్రజ్వల్‌ ఆచూకీ కోసం ఇప్పటికే ఇంటర్‌పోల్ ‘బ్లూ- కార్నర్’ నోటీసు కూడా జారీ చేసింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలన్నీ ఫేక్ అని, తనపై కక్ష్యతో ఎవరో వాటిని సృష్టించారని ప్రజ్వల్ రేవణ్న చెబుతున్నారు.

మరోవైపు ప్రజ్వల్ రేవణ్న తండ్రి హెచ్‌డీ రేవణ్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల్లో ఒకరైన 60 ఏళ్ల మహిళను తన కాలెనహళ్లి ఫామ్‌హౌస్‌లో అక్రమంగా హెచ్‌డీ రేవణ్న నిర్బంధించారని, ఆమెను సిట్ అధికారులు విడిపించారని పోలీసు వర్గాలు చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే, ప్రస్తుతం హెచ్‌డీ రేవణ్న బెయిలుపై విడుదల అయ్యారు.

వీడియోల లీక్ వెనుక పెద్ద తిమింగలం?

ప్రస్తుత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పోటీ చేస్తోంది. ఈ రెండు పార్టీలు సంయుక్తంగానే ప్రజ్వల్ రేవణ్నను హసన్ నుంచి పోటీ చేయించాయి. అయితే, తాజా వివాదం అనంతరం రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి.

‘‘జేడీఎస్‌తో పొత్తులో కొనసాగాలా వద్దా అనే అంశంపై లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని కర్ణాటక బీజేపీ నాయకుడు ఆర్ ఆశోక చెప్పారు.

మరోవైపు వివాదం నడుమ ప్రజ్వల్ రేవణ్న, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్నలను జేడీఎస్ సస్పెండ్ చేసింది.

అయితే, కావాలనే ఎన్నికల సమయంలో ఈ వీడియోలను లీక్ చేశారని జేడీఎస్ అంటోంది. దీనిపై జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. ప్రజ్వల్ రేవణ్నకు కుమారస్వామి చిన్నాన్న అవుతారు.

‘‘ఈ వీడియోల లీక్ వెనుక ఒక పెద్ద తిమింగలం ఉంది. ఆ పెద్ద తిమింగలాన్ని ఎలా పట్టుకోగలం? ఎందుకంటే అది ప్రభుత్వంలో ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన వ్యాఖ్యలు చేశారు.

అయితే, దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘‘ఆ పెద్ద తిమింగలాన్ని పట్టుకోనివ్వండి మరి. ఆ వీడియోలకు నేనేమీ డైరెక్టర్‌నూ కాదు, ప్రొడ్యూసర్‌నూ కాదు. నేనొక ఎగ్జిబిటర్‌ను, అంటే థియేటర్ ఎగ్జిబిటర్‌ను మాత్రమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

జేడీఎస్ మిత్ర పక్షమైన బీజేపీ ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం సిట్ దీనిపై సవ్యంగానే విచారణ జరుపుతోందని, దీన్ని సీబీఐకు అప్పగించే ఆలోచనలేదని కర్ణాటక ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories