Chandrayaan 3: జాబిలిపై పరిశోధనల్లో ముందడుగు.. ఆక్సిజన్ ఆనవాళ్లు గుర్తించిన ప్రజ్ఞాన్‌ రోవర్‌

Pragyan Rover Discovers Minerals Mine on the Moon
x

Chandrayaan 3: జాబిలిపై పరిశోధనల్లో ముందడుగు.. ఆక్సిజన్ ఆనవాళ్లు గుర్తించిన ప్రజ్ఞాన్‌ రోవర్‌

Highlights

Chandrayaan 3: అల్యూమినియం, కాల్షియం, ఫెర్రమ్, క్రోమియం,.. టైటానియం, సిలికాన్, మాంగనీస్ కూడా గుర్తింపు

Chandrayaan 3: జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలకు ముందడుగు పడింది. చంద్రయాన్ ప్రయోగంతో జాబిలిపై ల్యాండ్ అయిన ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడిపై ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. తాజాగా రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాలను గుర్తించిందని ఇస్రో ప్రకటన చేసింది. రోవర్‌లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉనికిని గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. అల్యూమినియం, కాల్షియం, ఫెర్రమ్, క్రోమియం, టైటానియం, సిలికాన్, మాంగనీస్, ఆక్సిజన్‌ను గుర్తించింది. హైడ్రోజన్ కోసం పరిశోధన జరుగుతున్నట్లు ఇస్రో తెలిపింది. లిబ్స్ పరికరం బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, రసాయన, ఖనిజాలను గుర్తించేందుకు లిబ్స్ పరికరాన్ని పంపించారు. ఇక అంతకుముందే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు కూడా పంపింది ప్రజ్ఞాన్ రోవర్.

ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్‌ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నాయి. విక్రమ్‌ ల్యాండర్‌లో నాలుగు పేలోడ్‌లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్‌లు సహకారం అందిస్తాయి. చంద్రయాన్‌ -3 లక్ష్యాల్లో.. ఇప్పటికే రెండు పూర్తి చేసింది. మిగిలిన 7రోజుల్లో చంద్రుడిపై పరిశోధనలు విజయవంతంగా పూర్తి అయితే చంద్రయాన్‌ -3 లక్ష్యాలు నెరవేరుతాయని ఇస్రో తెలిపింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌ జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్ట్‌ 23న సాయంత్రం 6గంటల 4 నిమిషాలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశించిన ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్ట మొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది.

విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ఆరు చక్రాలతో ప్రజ్ఞాన్‌ రోవర్‌ విజయవంతంగా బయటకు వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్‌ రోవర్‌ పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్‌–3 మిషన్‌ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను ప్రజ్ఞాన్‌ రోవర్‌ భూమిపైకి చేరవేసింది .ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్‌ చాకచక్యంగా తప్పించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories