INDIA Meeting: రేపటి ఇండియా కూటమి సమావేశం వాయిదా

Postponement Of Tomorrow India Alliance Meeting
x

INDIA Meeting: రేపటి ఇండియా కూటమి సమావేశం వాయిదా

Highlights

INDIA Meeting: భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తుందన్నచర్చ

INDIA Meeting: ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. రేపు ఈ సమావేశం జరగాల్సి ఉండగా, కీలక నేతలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించాలని భావించారు. అయితే సమాజ్‌‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు ముందస్తు షెడ్యూల్‌ కారణంగా హాజరుకావడం లేదు. దీంతో ఇండియా బ్లాక్ సమావేశాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా ఎలయెన్స్ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం జరపాలని నిర్ణయించారు. దీని తర్వాత డిసెంబర్‌లోనే అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో విపక్ష పార్టీల అధ్యక్షులు, ఇండియన్ అలయెన్స్ అధినేతల సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇండియా కూటమి సమావేశానికి తమ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన ఏదీ లేదని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి ప్రకటించారు.

ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కానీ, మరో నేత కానీ వెళ్లే అవకాశం ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అడిగినప్పుడు, ఇండియా కూటమి సమావేశం గురించి తమకు ముందస్తు సమాచారం లేదని ఆయన సమాధానమిచ్చారు. మరోవైపు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తనకు రేపు కోల్‌కతాలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున కూటమి సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు చెప్పారు. తమకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే కోల్‌కతా సమవేశాన్ని మార్చుకునే ఉండేవాళ్లమని తెలిపారు.

విపక్ష పార్టీల నేతలను స్వయంగా కలుసుకుని ఇండియా బ్లాక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం డిసెంబర్ సమావేశానికి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఇండియా బ్లాక్‌కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బిజీగా ఉందని నితీష్ ఇటీవల విమర్శించారు.

అయితే కూటమి పార్టీల నేతలు రేపటి సమావేశంపై ఆసక్తి చూపించకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్న ప్రచారం జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పేలవమైన ప్రదర్శన చూపించింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోలేకపోగా.. ఇటు మధ్యప్రదేశ్‌లోనూ అవకాశాన్ని కోల్పోయింది. కేవలం తెలంగాణలోనే సానుకూల ఫలితం సాధించింది. దీంతో కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌ తీరును తప్పుపడుతున్నాయి. విపక్షాల మద్దతు తీసుకోకుండా ఒంటెద్దు పోకడతో వెళ్లడంతోనే పలు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని.. భాగస్వామ్య పక్షాలతో కలిసి నడవాలని సూచిస్తున్నాయి.

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందడం ఇండియా కూటమిపై ప్రభావం చూపదని ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, జేడీయు నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. భాగస్వామ్య పక్షాలను దూరంగా పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడంతోనే కాంగ్రెస్‌ ప్రతికూల ఫలితాలు చూసిందని కేసీ త్యాగి విమర్శించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే సమయంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఎంతో అవసరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గెలిచామని, తమను ఎవ్వరూ ఓడించలేరనే ధీమాతో వెళ్లడమే కాంగ్రెస్‌ పతనానికి దారితీసిందన్నారు.

భాగస్వామ్య పక్షాలను ఇప్పుడు కాంగ్రెస్ ఎలా బుజ్జగిస్తుందన్న చర్చ జరుగుతోంది. స్వయంగా కాంగ్రెస్ దూతలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపిన తర్వాత... మరో సారి తేదీని ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories