Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు వెనుకున్న అర్థం ఏంటంటే

Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు వెనుకున్న అర్థం ఏంటంటే
x
Highlights

Port Blair Name Changed: అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కి పేరు మార్చుతూ కేంద్రం ప్రకటన చేసింది. ఇకపై పోర్ట్ బ్లెయిర్ ని శ్రీ...

Port Blair Name Changed: అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కి పేరు మార్చుతూ కేంద్రం ప్రకటన చేసింది. ఇకపై పోర్ట్ బ్లెయిర్ ని శ్రీ విజయ పురం అని పిలవనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అండమాన్ నికోబార్ దీవులకు ప్రత్యేక స్థానం ఉందని.. అలాంటి ప్రదేశానికి ఇప్పటికీ బ్రిటీష్ రాజ్యాన్ని గుర్తుచేస్తూ పోర్ట్ బ్లెయిర్ పేరును కొనసాగించకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా ప్రకటించారు.

బ్రిటీష్ రాచరికపు గుర్తులను రూపుమాపి అన్నివిధాల స్వతంత్ర భారతావనిని చూడాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం. అందులో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

శ్రీ విజయ పురం అంటే దేశ స్వాతంత్య్ర పోరాటంలో మన విజయానికి ప్రతీక. ఆ పోరాటంలో అండమాన్ నికోబార్ దీవుల పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

పోర్ట్ బ్లెయిర్‌కి ఆ పేరెలా వచ్చిందంటే..

అండమాన్ నికోబార్ దీవుల్లోకి అడుగుపెట్టాలంటే ముందుగా కాలుపెట్టాల్సింది ఈ పోర్ట్ బ్లెయిర్ గడ్డమీదే. ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే ముంబై మెరైన్ నావల్ సర్వేయర్ మొట్టమొదటిసారిగా అండమాన్ నికోబార్ దీవులను పూర్తిస్థాయిలో సర్వేచేశారు. ఈయన పేరు మీదే ఈ సిటీకి పోర్ట్ బ్లెయిర్‌ అనే పేరు వచ్చింది. తొలిసారిగా 1978 డిసెంబర్‌లో అప్పటి కలకత్తా నుండి ఎలిజబెత్, వైపర్ అనే రెండు నౌకలను తీసుకుని ఈ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అండమాన్ సర్వే కోసం బయల్దేరారు. సర్వే లక్ష్యంతో వెళ్లిన వాళ్ల ప్రయాణం 1979 ఏప్రిల్ వరకు కొనసాగింది. ముందుగా పశ్చిమ తీరానికి వెళ్లిన ఆర్చిబాల్డ్ బ్లెయిర్, ఆ తరువాత ఈశాన్య తీరానికి వెళ్లారు. అక్కడ బ్లెయిర్‌కి సహజసిద్ధంగా ఏర్పడిన నౌకాశ్రయం కనిపించింది. ఆ కనిపించిన సముద్రతీరానికి అతడు "పోర్ట్ కాన్‌వాలిస్" అనే పేరు పెట్టారు.

పోర్ట్ కాన్‌వాలిస్ అనే వ్యక్తి అప్పటి బ్రిటీష్ ఇండియా ఆర్మీకి కమాండర్-ఇన్-చీఫ్. అందుకే ఆయన గౌరవార్ధం ఆర్చిబాల్డ్ బ్లెయిర్ ఆ పేరును ఎంచుకున్నారు. అండమాన్ నికోబార్ దీవులపై తాను చేసిన సర్వేపై బ్లెయిర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సమగ్రమైన నివేదిక అందించారు. అయితే, ఆర్చిబాల్డ్ బ్లెయిర్ సేవలను మెచ్చిన అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ.. అతడు నామకరణం చేసిన పోర్ట్ కాన్‌వాలిస్ అనే పేరును మార్చి అతడి పేరునే చేరుస్తూ రెండోసారి "పోర్ట్ బ్లెయిర్" అని పేరు పెట్టింది. అలా పోర్ట్ బ్లెయిర్ సిటీకి ఆ పేరు వచ్చింది. ఆ తరువాతి కాలంలో అదే పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు రాజధానిగా మారింది. తాజాగా మోదీ సర్కారు అదే నగరానికి ముచ్చటగా మూడోసారి పేరు మార్చి "శ్రీ విజయ పురం" అని నామకరణం చేశారు. ఇది పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు వెనుకున్న చరిత్ర.

Show Full Article
Print Article
Next Story
More Stories