రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే.. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేస్తున్న ప్రధాని మోడీ...

PM Narendra Modi Virtual Meeting with America President Joe Biden | Live News
x

రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే.. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేస్తున్న ప్రధాని మోడీ...

Highlights

Narendra Modi: రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా గుర్రు!

Narendra Modi: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరుల్ని అనుసరిస్తున్న భారత్‌, అమెరికాలు ఒకే వేదికపైకి వచ్చాయి. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య వర్చువల్‌గా కీలక సమావేశం జరిగింది. అయితే అటు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇటు అమెరికాతో బంధాన్ని బలోపేతం దిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. యుద్ధంతో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిద్దాం అనే దానిపై మల్లగుల్లాలు పడ్డాయి.

ఈ అంశంపై తమ తటస్థ వైఖరిని భారత్‌ వెల్లడించింది. ఇందులో ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పోరు వ్యవహారంలో భారత్‌ స్పందించిన తీరుపైన, రష్యా నుంచి రాయితీపై చమురు దిగుమతి చేసుకోవడంపైన అమెరికా అసంతృప్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రష్యా విషయంలో తమలాగే.. అన్ని ప్రపంచదేశాలు ఆంక్షలను అమలు చేయలేవని తమకు తెలుసని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవాలా ? వద్దా ? అనే విషయంలో ఇప్పటివరకు భారత్‌కు తాము ఎలాంటి సూచనలూ చేయలేదని తెలిపింది.

ఇదిలా ఉంటే ఐరాస మండలిలో ఓటింగ్‌లో కూడా భారత్ పాల్గొనకపోవడంతో అమెరికా గుర్రుగా ఉంది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం భారత్‌కు ప్రయోజనకరం కాదని మోడీకి బైడెన్‌ సూచించినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. మరిన్ని మార్గాల నుంచి ఇంధన దిగుమతులు సాగించేలా చేయూతనందిస్తామని పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని వెల్లడించింది. ఉక్రెయిన్‌ ప్రజలకు భారత్‌ అందజేస్తున్న మానవీయ సహాయాన్ని బైడెన్‌ ప్రశంసించారు.

యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను అస్థిరపరచకుండా జాగ్రత్త పడటంతో పాటు వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అందుకు తమ తాజా చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రపంచ శాంతికీ ఇవి తోడ్పడతాయన్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పటిష్ట రక్షణ బంధాన్ని బైడెన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ''భారత్, అమెరికా ప్రగతిశీల ప్రజాస్వామ్యాలు.

కరోనా, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పుల వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఇరు దేశాలదీ ఒకటే వైఖరి. ఇరు దేశాల ప్రజల మధ్య ఓ కుటుంబంలో, మిత్రుల మధ్య ఉండే తరహా విలువలతో కూడిన లోతైన సంబంధాలున్నాయి'' అన్నారు. మే 24న జపాన్‌లో జరగనున్న క్వాడ్‌ శిఖరాగ్రంలో మోదీతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుగుతాయని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ని భారత్‌ ఖండించకపోవడంపై, ఆ దేశంనుంచి చవకగా చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories