మోడీ విత్ బైడెన్.. హైలైట్‎గా నిలిచిన అమెరికా-భారత్ చర్చలు...

PM Narendra Modi Met Joe Biden Personally in Quad Summit 2022 Highlights | Live News Today
x

మోడీ విత్ బైడెన్.. హైలైట్‎గా నిలిచిన అమెరికా-భారత్ చర్చలు...

Highlights

Quad Summit 2022: *'అమెరికా-ఇండియా' సంబంధాలపై మోడీ *మన సామర్థ్యానికి తగినట్టుగా లేదని మోడీ కుండబద్దలు

Quad Summit 2022: టోక్యోలో జరిగిన క్వాడ్ సమావేశాలు నాలుగు దేశాల మధ్య బంధం బలోపేతమయ్యే దిశగా సాగాయి. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు.. ఆసియా-పసిఫిక్ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసుకునే దిశగా ఈ సమావేశం ఎంతో ఉపకరించిందంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా చైనా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేందుకు ఈ నాలుగు దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా... ఈ నాలుగు ప్రధాన దేశాలూ.. వ్యూహాత్మకంగా ఒక్కటవుతున్నాయి. ఆసియా-పసిఫిక్ తీరంపై కన్నేసిన చైనాను కలిసికట్టుగా ఎదుర్కొనే దిశగా కొంతకాలంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన తాజా క్వాడ్ సమావేశం ఆ దిశగా పురోగతి సాధించిందనే చెప్పాలి. వ్యూహాత్మకమైన రక్షణ ఒప్పందాలకు పెద్దపీట వేసుకొని టెక్నాలజీని షేర్ చేసుకునే ఉద్దేశంతో 2017లో ఈ దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి.

ఆసియా-పసిఫిక్ దేశాల మీద చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ నాలుగు దేశాలు గత రెండేళ్లుగా గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చర్చల్లో ఇండియా కీలక పాత్ర వహించిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్రమోడీ.. విడివిడిగా అన్ని దేశాల ప్రధానులతోనూ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ తో జరిగిన భేటీలో మోడీ స్నేహ హస్తం అందిస్తూనే ఇండియా-భారత్ మధ్య సంబంధాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.

పటిష్టమైన సంబంధాలు నెరపడంలో మన రెండు దేశాలకు ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకోలేదని కుండబద్దలు కొట్టారు. ఇరు దేశాల మధ్య సహకారం, పెట్టుబడులు, రక్షణ ఒప్పందాలు, ప్రజల మధ్య సత్సంబంధాలు ఇంకా గట్టిపరుచుకోవాలన్నారు. ప్రపంచ మేలు కోసం పనిచేయడంలో క్వాడ్ ఎంతో ముందుకెళ్లిందని.... వ్యాక్సిన్ డెలివరీ, కాలుష్య నివారణ, ఆర్థికపరమైన సహకారం, ప్రకృతి విపత్తుల నివారణలో ఇచ్చిపుచ్చుకుంటున్నాయని ప్రశంసించారు.

ఇక జో-బైడెన్ ఇండో పసిఫిక్ దేశాల మధ్య సంబంధాలు ఇంకా పటిష్టం కావాలని, అందుకోసం ఈ నాలుగు దేశాలు ఇంకా దగ్గరవ్వాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ మీద రష్యా దాడిని మరోసారి ఖండించారు. ఇది ప్రపంచ దేశాల సార్వభౌమాధికారానికి ప్రమాదకరంగా అభివర్ణించారు బైడెన్. క్వాడ్ దేశాల కూటమిలో చేరేందుకు మరిన్ని దేశాలు కూడా ఉత్సాహం చూపుతున్నాయి. దక్షిణ కొరియాను కలుపుకొని ఈపాటికే క్వాడ్ ప్లస్ పేరుతో చర్చలు జరపడం విశేషం. న్యూజీలాండ్, వియత్నాం వంటి దేశాలు కూడా తమకు క్వాడ్ సభ్యత్వం ఇవ్వాలని అడుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories