India Independence Day 2024: ప్రధాని మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలు

India Independence Day 2024: ప్రధాని మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలు
x
Highlights

ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ అల్లర్లు, కోల్‌కతాలో మహిళా డాక్టర్ హత్యాచారం వంటి ఘటనలపై ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెబుతారు, ఎలా స్పందిస్తారా అని సర్వత్రా ఆసక్తి సైతం నెలకొని ఉండింది.

PM Modi About Bangladesh, Kolkata Doctor Rape Murder Case: నేడు మన దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా తమ హయాంలో ప్రభుత్వం సాధించిన ఘనతను, తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యాల గురించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని హోదాలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ.. ప్రపంచ పటంలో భారత్‌ని అగ్రభాగాన నిలబెట్టేందుకు గత పదేళ్ల కాలంలో ఎన్డీయే సర్కారు ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు.

ఎన్నో ఆసక్తికరమైన పరిణామాల మధ్య ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కావడంతో పాటు ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ అల్లర్లు, కోల్‌కతాలో మహిళా డాక్టర్ హత్యాచారం వంటి ఘటనలపై ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెబుతారు, ఎలా స్పందిస్తారా అని సర్వత్రా ఆసక్తి సైతం నెలకొని ఉండింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగంలోని పలు ముఖ్యాంశాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.

1) "గత 75 ఏళ్లుగా మనం జీవిస్తున్న సివిల్ కోడ్ వాస్తవానికి ఒక మతపరమైన సివిల్ కోడ్" అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. మతపరమైన వివక్ష నుండి భారత సమాజాన్ని విముక్తి చేయడానికి దేశంలో లౌకిక పరమైన పౌర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. సెక్యులర్ సివిల్ కోడ్ వల్లే అది సాధ్యం అవుతుందన్నారు.

2) ఇటీవల కాలంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలు, అరాచకాలు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ మన తల్లులు, అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలపై జరిగే దాడులు, నేరాలను మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ఘటనల్లో వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి, నిందితులపై అంతే వీలైనంత త్వరగా శిక్షపడేలా చూడాలని ప్రభుత్వాలకు గుర్తుచేశారు.

3) మహిళలకు ప్రసూతి సమయంలో ఇచ్చే మెటర్నిటీ లీవ్స్ సంఖ్యను 12 వారాల నుండి 26 వారాలకు పొడిగించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ప్రత్యేక సామర్థ్యం కలిగిన సోదర సోదరీమణులకు ఎదురవుతున్న అడ్డంకులను సుగమ్య భారత్ అభియాన్ ద్వారా తొలగించి వారు కూడా సమాజంలో అందరితో సమానంగా గౌరవమర్యాదలు అందుకునేలా చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా అంతే గౌరవప్రదమైన జీవితాన్ని ఆస్వాదించడం కోసం తమ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

4) దేశాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పెద్ద సంస్కరణలను తీసుకొచ్చామన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ లో ఘనమైన అభివృద్ధిని సాధించినట్టు తెలిపారు. ఆయా సంస్కరణల పట్ల తమ నిబద్ధత కేవలం చిన్నచిన్న ప్రశంసల కోసం మాత్రమే పరిమితం కాలేదని, దేశాన్ని బలోపేతం చేసే దిశగా సంస్కరణలు కొనసాగుతున్నాయని అన్నారు.

5) బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న అల్లర్లు, అహింస, అక్కడి హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, పొరుగు దేశాల హితం కోరుకునే భారత దేశ ప్రధానిగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న వరుస పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేశారు. బంగ్లదేశ్‌లో హిందువులు, మైనారిటీల భద్రతపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తమ ఇరుగుపొరుగు దేశాలు శాంతి మార్గంలో నడవాలి అనేదే భారత్ అభిమతం అని అన్నారు.

6) 40 కోట్ల మంది ప్రజలు పోరాడి బానిసత్వపు సంకెళ్లను తెంచి భారత దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టినట్టయితే.. ఏకంగా 140 కోట్ల మంది ప్రజలు ఏకమై సంకల్పం పూనుకుంటే ఇంకా ఏమేం సాధించవచ్చో, ఎంత గొప్ప స్థాయికి చేరుకోవచ్చో ఒక్కసారి మీరే ఊహించుకోండి అంటూ మన దేశ జనాభాకు ఉన్న బలాన్ని, సామర్ధ్యాన్ని గుర్తుచేశారు.

7) గత రెండు, మూడేళ్లుగా 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ ప్రయత్నాన్ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కలిసి రావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

8) భారత్‌లో రాబోయే మరో ఐదేళ్లలో వైద్య కళాశాలల్లో 75,000 కొత్త సీట్లు పెంచనున్నట్టు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని సాధించేనాటికి మన దేశం ఆరోగ్యం పరంగా 'స్వస్త్ భారత్' అయి ఉండాలి అని ఆకాంక్షించారు.

9) కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెడుతూ అప్పట్లో ప్రజలు 'మై-బాప్' సంస్కృతిని ( ఇక్కడ తామే సర్వం అనే ధోరణి) ఎదుర్కోవలసి వచ్చేదని, ప్రతీ చిన్న అవసరానికి ప్రభుత్వంతో వాదనకు దిగాల్సి వచ్చే దుస్థితి నుండి పాలన రూపురేఖలను సమూలంగా మార్చేసి ఇప్పుడు పౌరులకు ఏది కావాలన్నా నేరుగా తమ ఇంటికే వచ్చే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

10) ప్రపంచంలోనే పేరున్న పెద్దపెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులు ఇప్పుడు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, భారత్ వైపు చూస్తోన్న పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రాష్ట్రాల మధ్య గట్టి పోటీ వాతావరణం ఉండాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలు ప్రపంచ స్థాయి కంపెనీలు, పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నప్పుడే అది సాధ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories