ఆ క్రెడిట్‌ మొత్తం మీరే తీసుకోండి.. కానీ: ప్రధాని మోడీ

ఆ క్రెడిట్‌ మొత్తం మీరే తీసుకోండి.. కానీ: ప్రధాని మోడీ
x
Highlights

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. పంటల మద్ధతు ధర కోసమే కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ...

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. పంటల మద్ధతు ధర కోసమే కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తుంది అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ చట్టాలపై ఎవరికైనా అనుమానాలు, ఆందోళనలు ఉంటే వారితో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వారి భయాలు పోగొడతాం. అన్నదాతల ముందు తలలు వంచి, చేతులు జోడిస్తున్నాం. కనీస మద్దతు ధర ఎత్తివేస్తారనేది అతి పెద్ద అబద్ధం అని పేర్కొన్నారు. కొత్త చట్టాలతో పంటల మద్దతు ధర ముందు తెలుస్తుండడంతో రైతులు లాభం పొందుతారని చెప్పారు.

నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, గత 20,30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించాయని అన్నారు. దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, కాస్త ప్రోగ్రేసివ్ భావాలతో ఆలోచించే రైతులు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే, నూతన చట్టాల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నూతన చట్టాలపై ఇప్పుడు లబోదిబోమంటూ కన్నీరు కారుస్తున్న వారు, ఎనిమిదేళ్లుగా స్వామినాథన్ రిపోర్టులను ఎందుకు తొక్కి పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. ఈ విషయం తనకంటే బాగా మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ రైతులకు తెలుసు అన్నారు. రైతులను మోసం చేసేవారిని చూస్తే తనకు ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఎంత కాలం ప్రతిపక్షాలు రైతులను మోసం చేస్తాయని మోడీ ప్రశ్నించారు.

కొత్త వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు ఆదరిస్తున్నారని, తప్పుడు భ్రమలు కలిగించేవారిని ద్వేషిస్తున్నారని మోడీ చెప్పారు. ఈ చట్టాలపై కొద్దిపాటి అనుమానం ఉన్న రైతులు ఒక్కసారిగా ఆలోచించాలని కోరారు. ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్లో నిజంలేదని, రైతులకు మోసం చేయడం వీరిపని అని మోడీ ఆరోపించారు. రైతులను భ్రమల్లో ఉంచుకోవడం ప్రతిపక్షాలను మానుకోవాలని, ఈ నూతన చట్టాలను అమలులోకి తెచ్చి ఆరు నెలలు గడిచాయని, ఈ ఆరు నెలలు మౌనంగా ఉన్న విపక్షాలు హఠాత్తుగా ఉద్యమాన్ని లేవదీశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతుల భుజాలపై తుపాకులను పెట్టి కాలుస్తున్నారని మోదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. నాకేమీ క్రెడిట్ అవసరం లేదు. ఇవ్వకండి కూడా. మీమీ పాత మేనిఫెస్టోలకు ఆ క్రెడిట్ ఇచ్చుకోండి. నేను రైతుల మేలునే కోరుకుంటాను. రైతులను భ్రమల్లో ఉంచకండి. అని మోదీ తీవ్రంగా మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories