పెట్రో ధరల బాదుడు.. ఐదు రోజుల్లో వరుసగా నాలుగోసారి..

Petrol and Diesel Prices Hike Today 26 03 2022 | Fuel Price Hike in India
x

పెట్రో ధరల బాదుడు.. ఐదు రోజుల్లో వరుసగా నాలుగోసారి..

Highlights

Petrol and Diesel Price Today: *అంతర్జాతీయంగా మళ్లీ పెరిగిన క్రూడాయిల్‌ ధరలు *బ్రైంట్‌ రకం బ్యారెల్‌ ధర 120 డాలర్లు

Petrol and Diesel Price Today: అంతర్జాతీయ చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. ఓ వైపు ఉక్రెయిన్‌ యుద్ధం, మరోవైపు సౌదీ అరేబియాలోని చమురు డిపోలపై హౌథీ రెబల్స్ దాడులతో క్రూడాయిల్‌ ధరలు అదుపుతప్పాయి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 120 డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో బ్యారెల్‌ ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలు మంటలు మళ్లీ తప్పేలా లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఐదు రోజుల నుంచి భారత్‌లోనూ వరుసగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ లీటరు పెట్రోలు 150 రూపాయలకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల్లో పెరుగుతున్న పెట్రోలు ధరలను మోదీ ప్రభుత్వం నియంత్రించలేకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు 4వ తేదీ నుంచి మార్చి 21 వరకు ధరలను పట్టించుకోని పెట్రో కంపెనీలు మళ్లీ ఎడాపెడా బాదేస్తున్నాయి. వరుసగా ఐదు రోజుల్లో నాలుగు సార్లు ధరలు పెరిగాయి. తాజాగా లీటరుపై మరో 80 పైసలు పెరిగింది. ఈ ఐదు రోజుల్లో పెట్రో ధరలు లీటరుకు 3 రూపాయల 20 పైలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలుపై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి. ఫలితంగా హైదరాబాద్‌లో ఇప్పుడు లీటరు పెట్రోలు ధర 111 రూపాయల 80 పైసలకు చేరుకుంది. డీజిల్‌ ధర లీటరుపై 98 రూపాయల 10 పైసలు పెరిగింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర 113 రూపాయల 60 పైసలు కాగా, డీజిల్‌ ధర సెంచరీకి చేరుకువంది. లీటరు డీజిల్‌ ధర 99 రూపాయల 50 పైసలుకు చేరింది.

అయితే ఈ ధరల పెరుగుదలకు ఉక్రెయిన్‌ యుద్ధం ఒక కారణమైతే.. సౌదీ అరేబియాలో హౌథీ తిరుబాటుదారులు చమురు డిపోలపై దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో చమురు సరఫరా భారీగా పడిపోయింది. అదే అదునుగా అంతర్జాతీయ చమురు సంస్థలు ధరల కొరడాను ఝులిపించాయి. మొన్నటివరకు 110 డాలర్లకు చేరిన బ్రైంట్ రకం క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర... మళ్లీ 120 డాలర్లకు చేరింది. సరఫరా నిలిచిపోవడంతో ఈ ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే భారత్‌లో ఏకంగా లీటరు పెట్రోలు ధర 150 రూపాయలకు చేరే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. చమురు ధరల పెరుగుదలతో సామాన్యుడిపై పెనుభారం పడే ప్రమాదముందని చెబుతున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలను మోదీ ప్రభుత్వం నియంత్రించలేకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లోనే 3 రూపాయల 20 పెరుగుదలను విశ్లేషకులు ఉదాహరణగా చెబుతున్నారు. పెట్రోలు ధరలు పెరుగుదలతో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే నిత్యావసర వస్తువులు నింగికి తాకే ప్రమాదముందని చెబుతున్నారు. అయితే పెట్రో ధరలను అదుపులో ఉంచేందుకు రష్యా నుంచి 300 మిలియన్‌ బార్యెళ్ల క్రూడాయిల్‌ కొనుగోలుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రూడాయిల్‌ భారత్‌కు మేలో చేరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories