ప్యాకెట్ అణుబాంబులతో పాక్..కోల్డ్ స్టార్ట్ వ్యూహంతో భారత్..మినీ యుద్ధం తప్పదా ?
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు క్రమంగాపెరుగుతున్నాయి. పాక్ ఇప్పటికే కశ్మీర్ లో పోస్టర్ వార్ ప్రారంభించింది. యుద్ధ సన్నాహాలు చేస్తోంది. బంకర్లు...
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు క్రమంగాపెరుగుతున్నాయి. పాక్ ఇప్పటికే కశ్మీర్ లో పోస్టర్ వార్ ప్రారంభించింది. యుద్ధ సన్నాహాలు చేస్తోంది. బంకర్లు నిర్మిస్తోంది. దీంతో మరి భారత్ కూడా యుద్ధానికి సిద్ధపడుతోందా ? భారత్ వ్యూహం డిఫెన్స్ నుంచి అఫెన్స్ కు మారుతోందా ? లాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
భారత్, పాక్ ల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కశ్మీర్ విషయంలో అణు యుద్ధానికైనా సిద్ధమనే తరహాలో పాకిస్థాన్ రంకెలు వేస్తోంది. మంత్రుల నుంచి మాజీ క్రికెటర్ల దాకా అంతా గాల్లో కత్తులు దూస్తున్నారు. మరో వైపున సరిహద్దుల్లో పాక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఇవన్నీ కూడా భారత్ కూడా యుద్ధ సన్నాహాలు చేయకతప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి.
కోల్డ్ స్టార్ట్ ఈ పేరు చెబితేనే ఇప్పుడు పాకిస్థాన్ వణికిపోతున్నది. ఇన్నేళ్ళుగా పాకిస్థాన్ దూకుడు ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. తాను యుద్ధం చేస్తూనే భారత్ భారీ స్థాయిలో విరుచుకుపడకుండా అంతర్జాతీయంగా ఒత్తిళ్ళు తీసుకురాగలిగింది. దీంతో భారత్ తాను అనుసరిస్తున్న వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ ఒత్తిళ్ళు వచ్చే లోపలే పాకిస్థాన్ లోకి దూసుకుపోయి స్వాధీనం చేసుకున్న భూభాగాలపై పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో భారత్ డిఫెన్స్ నుంచి అఫెన్స్ లోకి తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. కోల్డ్ స్టార్ట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తాజా కోల్డ్ స్టార్ట్ వ్యూహం సర్జికల్ స్ట్రైక్స్ కు పొడిగింపు లాంటిది. సర్జికల్ స్ట్రైక్స్ రెండు, మూడు గంటల్లో పూర్తయితే తాజా వ్యూహం రెండు, మూడు రోజుల్లో పూర్తయిపోతుంది. సర్జికల్ దాడుల్లో దాడులే ప్రధానం. తాజా వ్యూహం ప్రకారం దాడులు చేయడంతో అంతర్జాతీయ ఒత్తిళ్ళు తీవ్రమయ్యే లోగా భారత సైన్యం పొరుగుదేశంలో కొంత భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. కోల్డ్ స్టార్ట్ వ్యూహాన్ని భారత్ అమలు చేయగలదని ఊహించని పాక్ ఇప్పుడు వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బిత్తరపోతున్నది.
యుద్ధం అంటే మాటలు కాదు. రెండు దేశాలు పూర్తిస్థాయిలో యుద్ధం చేయాలంటే నెలల తరబడి కసరత్తు తప్పదు. సైనికబలగాలను తరలించేందుకే వారాల తరబడి సమయం పడుతుంది. భారత్-పాక్ ల మధ్య జరిగిన మూడు యుద్ధాలు, మరో మినీ యుద్ధం సమయంలో భారత్ కు ఈ సమస్య బాగా అనుభవం లోకి వచ్చింది. అందుకే భారత్ తన యుద్ధవ్యూహాన్ని మార్చుకుంది. సరిహద్దులకు చేరువలో భారీగా బలగాలను మోహరించే వ్యూహాన్ని రూపొందించుకుంది. దీన్నే కోల్డ్ స్టార్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యూహమే ఇప్పుడు పాకిస్థాన్ కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా భారత్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ తొలి బ్యాచ్ ను సరిహద్దుల్లోకి పంపిస్తోంది. సుమారు 13 బ్యాచ్ లను ఈ విధంగా తరలించేందుకు ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. గతంలో పలు సందర్భాల్లో పాక్ పై భారత్ యుద్ధం చేద్దామనుకున్నప్పుడల్లా సైన్యం తరలింపు వార్తలు ప్రముఖంగా రావడం అంతర్జాతీయ ఒత్తిళ్ళు పెరిగిపోవడంతో భారత్ వెనుకడుగు వేయాల్సి వచ్చింది. 2001లో భారత్ పార్లమెంట్ పై దాడి సందర్భంగా ఇలాంటిదే చోటు చేసుకుంది. తదనంతర కాలంలో కూడా భారత్ సన్నాహాలకు అంతర్జాతీయ ఒత్తిళ్ళు అవరోధాలుగా నిలిచాయి. అలా కాకుండా ఉండాలంటే అంతర్జాతీయ ఒత్తిళ్ళు రాకముందే పని పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ చేయదల్చింది కూడా అదే. 2011లోనే ఆపరేషన్ విజయీభవ పేరుతో ఈ వ్యూహాన్ని ఒకసారి పరీక్షించి చూశారు. అది విజయవంతమైంది. భారత్ ఈతరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా 2017లోనే ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ప్రకటించారు.
పాకిస్థాన్ క్రమంగా తన ఉగ్రవాద రూపాన్ని చాటుకుంటోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ తమ వద్ద 100 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువున్న వ్యూహాత్మక అణుబాంబులు కూడా ఉన్నాయని చెప్పడం సంచలనం కలిగిస్తోంది. అవి గనుక ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే స్వీయ వినాశనానికి అది బాటలు వేసుకున్నట్లే అవుతుంది. యావత్ ప్రపంచాన్ని ముప్పులోకి నెట్టివేసినట్లే అవుతుంది. ఆ ముప్పును తప్పించాలంటే పాకిస్థాన్ ను అఫెన్స్ పరంగా బలహీనం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసేందుకు ప్రధాన కారణం అణుబాంబుల ప్రయోగమే. అమెరికా 1945 ఆగస్టు 6న జపాన్ లోని హిరోషిమా పై అణుబాంబును ప్రయోగించింది. దాని పేరు లిటిల్ బాయ్. దాని బరువు 4,400 కిలోలు. ఇక జపాన్ లోనే 1945 ఆగస్టు 9న నాగసాకి నగరంపై వేసిన అణుబాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. దాని బరువు 4,670 కిలోలు. అణుబాంబులు అంత బరువు ఉంటాయి కాబట్టే వాటిని ప్రయోగించేందుకు ప్రత్యేక విమానాలు, మిసైల్స్, అధునాతన టెక్నాలజీ అవసరమవుతాయి. కాలక్రమంలో తక్కువ బరువు ఉండే సూట్ కేస్ అణుబాంబులు కూడా వచ్చాయి. నిజానికి ఇవి 1950, 1960 మధ్య కాలంలోనే రూపొందాయి. కాకపోతే ఇవి కలిగించే నష్టం తక్కువే కాబట్టి అంతగా ప్రాచుర్యంలోకి కూడా రాలేదు. వీటి బరువు 54 కిలోల దాకా ఉంటుంది. తదనంతర కాలంలో 23 కిలోల బరువు ఉండే సూట్ కేస్ అణుబాంబులు కూడా వచ్చాయి. తాజాగా పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రహీద్ తమ వద్ద 100 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువున్న వ్యూహాత్మక అణుబాంబులు కూడా ఉన్నాయని చెప్పడం భారత్ కు మాత్రమే గాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆందోళన కలిగించే అంశమే. అవి కలిగించే నష్టం సంగతి అటుంచితే అవి ఉగ్రవాదుల చేతికి చిక్కితే ఏమవుతుంది అనేది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశం అణ్వస్త్ర దేశం కావడమే ప్రమాదకరం. దానికి తోడు హైటెక్ టెక్నాలజీ ప్యాకెట్ అణుబాంబులను కూడా పాకిస్థాన్ రూపొందించుకోవడం మరింత ఆందోళనకరం. ప్యాకెట్ అణుబాంబులు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ పాకిస్థాన్ తెంపరితనాన్ని మాత్రం అవి చాటిచెబుతున్నాయి.
యుద్ధోన్మాదంతో ఉండే దేశాలను నియంత్రించాలంటే సైనికంగా వాటిని నిస్తేజం చేయాల్సి ఉంటుంది. రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా జరిగింది అదే. అప్పట్లో జపాన్ కు చట్టబద్ధంగా ఇక సైనిక బలగం అనేది లేకుండా చేశారు. జపాన్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 9 ఆ దేశం సైనిక సంపత్తిని కలిగి ఉండడాన్ని నిషేధిస్తుంది. కాలక్రమంలో జపాన్ ప్రభుత్వం ఆత్మరక్షణ దళం పేరిట తన సైనిక బలగాన్ని అభివృద్ధి చేసుకుంది. తాజాగా ఉగ్రవాదదేశంగా మారిన పాకిస్థాన్ ను కట్టడి చేయాలంటే పాకిస్థాన్ ను అణ్వస్త్రరహితం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ దేశంలో ఉగ్రవాద ముఠాలకు గల ప్రాబల్యం నేపథ్యంలో అణ్వాయుధాల భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. పుష్కర కాలం క్రితమే ఈ తరహా వార్తలు అనేకం వచ్చాయి. పాక్ అణ్వాయుధాలను అమెరికా తన నియంత్రణలోకి తీసుకుందన్న వార్తలూ వెలువడ్డాయి. అణ్వస్త్రాలు ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశం ఉందని కూడా అప్పట్లో బేనజీర్ భుట్టో ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి అలాంటి పరిస్థితులే ఇప్పుడు నెలకొంటున్నాయి. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశంగా మారడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. మరెన్నో దేశాలు అణ్వస్త్ర దేశాలు కాకుండా కూడా అమెరికా ఒత్తిళ్ళు తీసుకువచ్చింది. తాజాగా భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. భారత్ తో పోలిస్తే అణుబాంబులను ప్రయోగించడంలో పాక్ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రపంచం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ అణ్వస్త్ర వినియోగంపై అమెరికా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. అమెరికా గనుక ఆ పని చేయకుంటే ఆ పని చేయాల్సిన బాధ్యత భారత్ పై ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఏమైతేనేం రెండు అణ్వస్త్ర దేశాల మధ్య పోరు రెండు దేశాలకూ ప్రమాదమే. యుద్ధం రాకుండా ఉంటేనే మంచిది. యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం అందుకు సన్నద్ధంగా ఉండకతప్పదు. రెండు దేశాల మధ్య యుద్ధానికి కశ్మీర్ అంశమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. పీఓకే గనుక భారత్ స్వాధీనమైతే పాకిస్థాన్ అణ్వస్త్ర రహితమైతే ఇక రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధం జరగాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire