Kargil Vijay Diwas: పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ..!

Pakistan has not learnt any lessons from history: PM Narendra Modi on Kargil Vijay Diwas
x

Kargil Vijay Diwas: పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ..!

Highlights

Narendra Modi on Kargil Vijay Diwas: విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ద్రాస్ కార్గిల్ వార్ మెమోరియల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు.

Kargil Vijay Diwas: విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ద్రాస్ కార్గిల్ వార్ మెమోరియల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు. 1999 కార్గిల్ వార్ లో అమరులైన సైనికులకు ఆయన నివాళులర్పించారు. ఆర్మీ కుటుంబ సభ్యులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు.

కార్గిల్ యుద్ధంలో విజయాన్ని గుర్తు చేసుకున్న మోదీ.. పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. కార్గిల్ యుద్ధంలో నీతిమాలిన ప్రయత్నాల మూలంగానే పాకిస్తాన్ ఓటమి పాలైందన్నారు.

దుర్మార్గమైన ఉద్దేశాలు ఎప్పటికీ విజయవంతం కావని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి చెప్పాలనుకుంటున్నానని ఆయన పరోక్షంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ఇవాళ మాట్లాడుతున్న మాటలు వారికి వినిపిస్తాయని అనుకుంటున్నానన్నారు.

భారత సైనిక దళాలు ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు తగిన జవాబిస్తాయని మోదీ పాక్ కు వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సమర్ధించే వారు ఎప్పటికి విజయం సాధించలేరన్నారు.

లద్దాఖ్, జమ్మూకాశ్మీర్ అభివృద్ది కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్ అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనంతరం షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులను మోదీ ప్రారంభించారు. 4.1 కి.మీ పొడవున ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఇది పూర్తైతే ఆర్మీకి అవసరమైన యుద్ధసామాగ్రిని త్వరగా చేర్చేందుకు వీలౌతుంది.

కార్గిల్ యుద్ధం ఎలా మొదలైంది?

లద్దాఖ్ లోని కార్గిల్ జిల్లాలో 1999 మే నెలలో పాక్ చొరబాటుదారులు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించారు. ఆ విషయాన్ని గొర్రెల కాపరులు మే 3న గుర్తించి సైన్యానికి తెలిపారు.

ఆ సమాచారం అందుకున్న భారత సైన్యం చొరబాట్లు జరిగినట్లు ధ్రువీకరించుకుంది. పాకిస్తాన్ నుంచి చొరబాటును నియంత్రించేందుకు భారత్ పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దింపింది.

దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. 1999 మే నుంచి జూలై మధ్య భారత దళాలు పాకిస్తాన్ నుంచి కీలకమైన స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. 1999 జూన్ 26న కార్గిల్ నుంచి పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. ఆ యుద్ధంలో 527 మంది భారత సైనికులు మరణించారు.1,363 మంది గాయపడ్డారు.

కార్గిల్ విజయాన్ని స్మరించుకునేందుకు భారత ప్రభుత్వం జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్ గా ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories