TOP 6 News @ 6PM: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలువ్... పాడి సవాల్‌కు రిప్లై ఇచ్చిన సంజయ్

Padi Kaushik Reddy beats Jagtial MLA Sanjay Kumar
x

అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై చేయి చేసుకున్న పాడి

Highlights

1) Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డ్ మెంబర్, ఎమ్మెల్యే జ్యోతుల...

1) Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డ్ మెంబర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "దైవ సన్నిధిలో అసువులు బాసటం అనేది ఒక రకంగా అదృష్టమే అయినప్పటికీ ముక్తి కోసం వెళ్లి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి" అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చెక్కుల పంపిణి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేసేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అక్కడికొచ్చారు. ఈ చెక్కుల పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఈ వ్యాఖ్యలుచేశారు.

జ్యోతుల నెహ్రూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారం రేపుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్న దర్శనం కోసం వెళ్లగా జరిగిన తొక్కిసలాటలో జనం అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయారు అనే వాదన వినిపిస్తోంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో వైఫల్యం ఎవరిది అనే విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ ఘటన అటు టీటీడీ బోర్డుపై, ఇటు ఏపీ సర్కారుపై పలు విమర్శలకు తావిచ్చింది.

ఈ వివాదం ఇలా ఉండగానే ఇప్పుడు జ్యోతుల నెహ్రూ ఇలా వ్యాఖ్యానించడం అధికార తెలుగు దేశం పార్టీని ఇరకాటంలో పడేసింది. తిరుపతి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికార పార్టీనే ఇలా మృతుల కుటుంబాలు నొచ్చుకునేలా బాధ్యాతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

2) Revanth Reddy Foreign Tour: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్... ఎప్పుడు, ఎక్కడ?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 17 నుండి 23వ తేదీ వరకు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్తారు. అక్కడ షాపింగ్ మాల్స్, స్టేడియంలు పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. రేవంత్ రెడ్డి రెండురోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.

జనవరి 19న సింగపూర్ నుండి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్తారు. దావోస్‌లో ప్రతీ సంవత్సరం జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ కూడా పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఆ తరువాత జనవరి 23న ఇండియాకు తిరిగిరానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పెట్టుబడులు ఆకర్షించడం కోసం విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.

ఈ నెల 14న ఢిల్లీలో జరగనున్న ఏఐసిసి సమావేశం కోసం ఆరోజే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడే ఏఐసీసీ సమావేశాలు చూసుకున్న తరువాత అక్కడి నుండే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా వెళ్లే అవకాశం ఉంది.

3) Padi Kaushik Reddy: ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై చేయి చేసుకున్న పాడి... అసలేం జరిగిందంటే...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై చేయి చేసుకున్నారు. కరీంనగర్ జడ్పీ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఏ పార్టీలో ఉన్నావ్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

సంజయ్ కుమార్ పై దాడి అనంతరం పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు. బయటికి వెళ్లే క్రమంలోనూ ఆయన సంజయ్ కుమార్‌పై అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు చేసుకుంటూనే వెళ్లారు. అమ్ముడుపోయిన ... .... లకు కూడా మాట్లాడాల్సిందిగా మైక్ ఇస్తారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. దమ్ముంటే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ విసిరారు.

అయితే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సంజయ్ కుమార్... పార్టీ ఫిరాయింపుల మాట్లాడే హక్కు పాడికి లేదని అన్నారు. ఒక్క పాడి కౌశిక్ రెడ్డికి మాత్రమే కాదు.. బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడికి లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు బీఎస్పీ, కమ్యూనిస్ట్, టీడీపీ నేతలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాబోయే రోజుల్లో తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని సంజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

4) Anita Anand Exits Canada PM race- నాకు వద్దు ఈ రాజకీయాలు - అనితా ఆనంద్

ఇండో కెనెడియన్ అనితా ఆనంద్ కెనడా ప్రధాని రేసు నుండి పక్కకు తప్పుకున్నారు. కెనడా ప్రధానిగా రాజీనామా చేసిన జస్టిన్ ట్రూడోను చూసిన తరువాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అనిత ప్రకటించారు. మళ్లీ తాను తమ పూర్వ వృత్తి అయిన టీచింగ్ వైపే వెళ్లిపోతానని అనితా తెలిపారు. ఎక్స్ ద్వారా అనితా ఆనంద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

5) Amrit Bharat : అమృత్ భారత్ 2.0 ట్రైన్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను అలాగే తన కోచ్‌లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన కోచ్‌లను మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను, తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వందే భారత్ తరహాలోనే భారతీయ రైల్వేలు పేదలకు అమృత్ భారత్ రైళ్లను బహుమతిగా అందించాయి. ఈ రైళ్ల ద్వారా ప్రయాణీకులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలను అందిస్తున్నాయి.

అల్పాదాయ వర్గం ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ 2.0 వెర్షన్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో అమృత్ భారత్ 2.0 కోసం అధునాతన కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి అమృత్ భారత్ రైళ్లను పరిశీలించారు. రాబోయే రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్లు పట్టాలెక్కుతాయని ఆయన అన్నారు. ఈ కోచ్‌లు సెమీ-హై స్పీడ్ కలిగిన వందే భారత్ రైళ్ల ప్రీమియం అనుభవంతో పోటీ పడతాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు షాక్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు బుమ్రా దూరం

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న భారత జట్టు దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నమెంట్‌తో తన ఛాంపియన్స్ ట్రోఫీ జర్నీని మొదలుపెడుతుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ఇంకా 45రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ దీనికి ముందే టీం ఇండియాకు ఒక చేదు వార్త వచ్చింది. జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో జరిగిన సిడ్నీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు. దీని తరువాత, అతన్ని స్కాన్ చేశారు. దాని నివేదిక బయటకు వచ్చింది. అతని నడుములో వాపు ఉందని, అతను దాదాపు రెండు నెలల పాటు మైదానానికి దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌తో జరిగే T20 సిరీస్‌కు జనవరి 11, శనివారం నాడు జట్టును ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ సమావేశం కూడా నిర్వహించింది. బుమ్రా గాయం గురించి సమాచారాన్ని ఇందులో సెలెక్టర్లకు ఇచ్చారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి వైద్య బృందం బుమ్రా గాయంపై నిరంతరం నిఘా ఉంచింది. ముందుగా అతనికి ఫ్రాక్చర్ అయిందని ఊహించారు. కానీ నివేదిక వచ్చిన తర్వాత, అతని నడుములో వాపు ఉందని వెల్లడైంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories