Youth Suicide: ఉరివేసుకున్న యువకుడు.. కిందకు దింపేందుకు 4 గంటలు ప్రయత్నించిన శునకం.. చివరకు అది కూడా...

Youth Committed Suicide By Hanging Himself While His Pet Dog Also Died In Jhansi Of Up
x

UP Youth Suicide: ఉరివేసుకున్న యువకుడు..కిందకు దింపేందుకు 4 గంటలు ప్రయత్నించిన శునకం..చివరకు అది కూడా...

Highlights

UP Youth Suicide: ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తన యజమానిని కిందకు దించేందుకు ఆ శునకం దాదాపు 4 గంటలు శ్రమించింది.

Youth Suicide: ప్రపంచంలో ఉన్న జీవులు అన్నింటిలో విశ్వాసం పేరు చెప్పగానే ముందుగా గుర్తి కొచ్చేది శునకం మాత్రమే.. ప్రేమగా ఒక ముద్ద పెడితే చాలు.. మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఈ మూగజీవి వెనుకాడదు. మనుషులతో కలిసి జీవించడం ద్వారా శునకాలు ఎంతో బాధ్యతతో మెలుగుతుంటాయి. యజమానిని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఇందుకు సంబంధించి ఎన్నో సంఘటనలను మనం చూసే ఉంటాం. తాజాగా అలాంటి ఒక ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తన యజమానిని కిందకు దించేందుకు ఆ శునకం దాదాపు 4 గంటలు శ్రమించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పంచవటి కాలనీలో ఆనంద్ అగ్నిహోత్రి కుటుంబం నివసిస్తోంది. ఆనంద్ రైల్వే ఉద్యోగి కాగా అతనికి 25 ఏళ్ల కుమారుడు సంభవ్ అగ్నిహోత్రి ఉన్నాడు. గత కొన్నేళ్లుగా అతడు సివిల్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఆనంద్ భార్య గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమెకు చికిత్స చేయించేందుకు భోపాల్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇంటివద్ద సంభవ్ ఒక్కడే ఉంటున్నాడు. ఇతడికి తోడుగా వారి పెంపుడు కుక్క అలెక్స్ కూడా ఇంటివద్దే ఉంది. జర్మన్ షపర్డ్ జాతికి చెందిన అలెక్స్ ను సంభవ్ ఐదేళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే, ఆనంద్ తన కుమారుడికి ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బదులు పలకడం లేదు. దీంతో ఆనంద్ తన పొరుగింటివారికి ఫోన్ చేసి కుమారుడు గురించి ఆరా తీశాడు. వారు ఇంటికి వచ్చి తలుపు తట్టగా లోపల ఉన్న సంభవ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం.. కేవలం వారి పెంపుడు శునకం అరుపులు వినిపించడంతో అనుమానంతో విషయం ఆనంద్ కి చెప్పారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.

ఆనంద్ ఇంటి తలుపులు తెరిచి చూసే సరికి సంభవ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వీరిని అలెక్స్ అడ్డుకుంది. దీంతో మున్సిపల్ సిబ్బందిని పిలిపించి అలెక్స్ కు మత్తు ఇంజక్షన్ ఇప్పించి... పోలీసులు ఇంటిలోకి ప్రవేశించారు. ఉరికి వేలాడుతున్న సంభవ్ ను కిందకు దించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక మరో విషాదం ఏంటంటే అలెక్స్ కూడా కాసేపటికి చనిపోయింది. తన కళ్లెదుటే సంభవ్ ఉరి వేసుకోవడంతో తట్టుకోలేని అలెక్స్ అతడిని కిందకు దించేందుకు గంటల తరబడి ప్రయత్నించిందని అందుకే సంభవ్ కాలిపై అలెక్స్ పంటి గుర్తులు, కాలి గోళ్ల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సంభవ్ ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలుపుతున్నారు. అంతేకాదు, మోతాదుకి మించి మత్తు ఇవ్వడంతోనే అలెక్స్ చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తంగా మానవులతో విడదీయ రాని బంధం ఏర్పర్చుకున్న శునకాలు... కాలంతో పాటు తమ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories