ఆన్‌లైన్ చదువులతో ఆరోగ్యసమస్యలు..పరిష్కారం ఏదీ?

ఆన్‌లైన్ చదువులతో ఆరోగ్యసమస్యలు..పరిష్కారం ఏదీ?
x
Highlights

భవిష్యత్‌లో చదువులన్నీ ఆన్‌లైన్‌లోనే ఇంట్లోనుంచి కదలనీయకుండా పిల్లల్ని హింసిస్తున్న చదువులు కంప్యూటర్‌ చదువులతో పిల్లల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు...

భవిష్యత్‌లో చదువులన్నీ ఆన్‌లైన్‌లోనే ఇంట్లోనుంచి కదలనీయకుండా పిల్లల్ని హింసిస్తున్న చదువులు కంప్యూటర్‌ చదువులతో పిల్లల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తున్నాయా? చదువుల సమస్యలకు పరిష్కారమేంటి..?

కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్ని ఊహించనివిధంగా మార్చేసింది. చాలావరకు ఉద్యోగాలన్నీ ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి వ్యాపారాలు కూడా ఆన్‌లైన్‌లో విజృంభిస్తున్నాయి. ఇక చదువులు విషయానికి వస్తే భవిష్యత్‌ ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాయి. ప్రభుత్వం వద్దని చెప్పినా వినలేదు. పేరెంట్స్‌ కూడా తమ పిల్లలు వెనకబడకూడదని ఆన్‌లైన్‌ చదువుల్ని ఎంకరేజ్‌ చేశారు. ఇక స్కూళ్ళు తెరిచే సమయం వచ్చినా కరోనా అన్నిటినీ బంద్‌ చేయించింది. దీంతో ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌ బాట పట్టింది.

ఎన్నెన్నో సమస్యల మధ్య ఆన్‌లైన్‌ క్లాసులు సాగుతున్నాయి. అటు టీచర్లు ఇటు విద్యార్థులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కరెంట్‌ సమస్యలు కంప్యూటర్‌ సమస్యలు డేటా సమస్యలు సిగ్నల్‌ సమస్యలు చదువుల్ని వెంటాడుతున్నాయి. సమస్యలు ఎన్ని ఉన్నా పాఠశాలలు ఓపెన్‌ చేసినా భవిష్యత్‌ అంతా ఆన్‌లైన్‌ చదువులదే అంటున్నారు ఉపాద్యాయులు.

అందరి ఇళ్ళల్లోనూ కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఉండవు ఇక స్మార్ట్‌ఫోన్‌తోనే పిల్లలు కుస్తీ పడుతున్నారు. గంటల తరబడి ఫోన్‌ చూస్తూ వింటూ కదలకుండా కూర్చోవాల్సి వస్తుంది. క్లాస్‌రూమ్‌లో అయితే ఒక క్లాస్‌ పూర్తి కాగానే మరో టీచర్‌ వచ్చేవరకు కొద్ది నిమిషాలైనే వారికి విరామం దొరుకుతుంది. ఇప్పుడలా కాదు ఒక క్లాస్‌ పూర్తయ్యేసరికే మరో టీచర్‌ ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటున్నారు. దీంతో పిల్లలకు గంటలకొద్దీ సమయం ఎటూ కదలకుండా కనీసం తల కూడా తిప్పలేని దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల పిల్లలకు కన్ను, చెవి సమస్యలు కూర్చునే విదానం కుదరక వెన్ను, మెడ నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

చాలా మంది పిల్లల్లో విటమిన్‌ లోపం ఉంటుంది. ప్రతి రోజూ గంటల కొద్దీ కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్ల ముందు కూర్చుంటే కళ్ళు తడారిపోతాయి కనీసం 20 నిమిషాలకు ఒకసారి చూపుతిప్పాలని డాక్టర్లు చెబుతారు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పిల్లలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సరైన సాధనాలు అమర్చాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే వారి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ విద్యుత్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. స్మార్ట్‌ ఫోన‌్‌ లేదా కంప్యూటర్‌ ఉన్నప్పటికీ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని టీచర్లు పిల్లలు కూడా చెట్టు ఎక్కి ఆన్‌లైన్‌ సాధన చేయాల్సి వస్తోంది. దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మారుస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ దేశంలో కేవలం 25 శాతం గ్రామాలే ఇంటర్‌నెట్‌తో అనుసంధానించబడ్డాయి. నెట్‌ ఉన్నప్పటికీ స్పీడ్‌ లేక వీడియో పాఠాలు వినడం, చూడటం పిల్లలకు ఒక అడ్వెంచర్‌గా మారుతోంది. అటు స్కూళ్ళ నుంచి చదువు చెప్పే మాస్టార్లకు పాఠాలు వినే పిల్లలకు సమస్యలు తప్పడంలేదు.

కరోనా ఎన్నో నేర్పింది. మనదేశం సాంకేతికంగా ఎంతో ముందుకు దూసుకుపోతోందని అనుకుంటున్నాం..కాని ఆన్‌లైన్‌ క్లాసులు మొదలైతే గాని...గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థమవుతోంది. కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌, స్మార్ట్‌ఫోన్లతో చదువుకునే పిల్లలకు మానసిక, ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. లేకపోతే భావి భారత పౌరులు ఎలా తయారవుతారో తలచుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories