Maharashtra Nursing Trainee Rape Case: కోల్‌కతా ఘటన అలా ఉండగానే తాజాగా మరో ఉదంతం

Maharashtra Nursing Trainee Rape Case: కోల్‌కతా ఘటన అలా ఉండగానే తాజాగా మరో ఉదంతం
x
Highlights

ఇంటికి వెళ్తున్న ఓ నర్సింగ్ ట్రైనిపై ఆటో డ్రైవర్ రేప్ కి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

Maharashtra Nursing Trainee Rape Case: కోల్‌కతాలో డాక్టర్ రేప్, మర్డర్ కేసు ఘటన ఇంకా మరువక ముందే తాజాగా మహారాష్ట్రలో మరో ఉదంతం చోటుచేసుకుంది. రత్నగిరి జిల్లాలో సోమవారం ఇంటికి వెళ్తున్న ఓ నర్సింగ్ ట్రైనిపై ఆటో డ్రైవర్ రేప్‌కి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన జనం.. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ గంటల తరబడి ధర్నా చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాల్సిందిగా ధర్నాలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది...

ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆటో డ్రైవర్ నర్సింగ్ ట్రైనీకి నీళ్లు తాగేందుకు వాటర్ బాటిల్ అందించాడు. అప్పటికే అందులో అతడు కెమికల్స్ కలపడంతో ఆ నీరు తాగిన బాధితురాలు మూర్భబోయింది. స్పృహ కోల్పోయిన బాధితురాలిని ఆటో డ్రైవర్ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు స్పృహలోకి వచ్చిన తరువాత తనకు జరిగిన దారుణంపై కుటుంబసభ్యులకు చెప్పుకుని బోరుమంది. అనంతరం కుటుంబసభ్యుల సహకారంతో పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రత్నగిరి జిల్లా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.

ఇప్పటికే ఇదే మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇటీవల ఓ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బద్లాపూర్ లో స్థానికులు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు పట్టాలపైకి చేరుకుని ధర్నాకు దిగడంతో కాసేపు ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే రైళ్లు సైతం నిలిచిపోయాయి.

అంతకు ముందే కోల్‌కతాలోని ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీలో జరిగిన డాక్టర్ రేప్, మర్డర్ ఘటనను ప్రస్తుతం సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. ఎప్పటికప్పుడు సీబీఐ సైతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని ప్రశ్నిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ విచారం వ్యక్తంచేశారు. డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్ భద్రత కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ పేరిట ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మహారాష్ట్రలో ఇలా మరో హెల్త్ కేర్ వర్కర్ అత్యాచారానికి గురవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories