Shimla Protest: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత

Shimla Protest: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత
x
Highlights

Shimla Protest: సంజౌలిలో నిర్మించిన మసీదు విషయంలో నిరసన

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత నెలకొంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదులో అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన చేపట్టారు. దేవభూమి సంఘటన్‌ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, స్థానికులు మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల కిందట చట్టవ్యతిరేకంగా నిర్మించిన నాలుగు అంతస్తుల మసీదును కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

హిమాచల్‌ నే తానా హై, దేవభూమి కో బచానా హై, భారత్‌ మాతా కీ జై వంటి నినాదాలు చేశారు. కాగా.. పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. వాటర్‌కేనన్లను వినియోగించారు. రాళ్లదాడి, ఘర్షణల్లో ఒక నిరసనకారుడు, ఒక సైనికుడు గాయపడ్డారు.

మసీదులో అదనపు అంతస్తుల నిర్మాణాలపై కొన్ని హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా నిరసనకారులు బారికేడ్లను దాటుకుంటూ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన ప్రదర్శనకు ముందు ధల్లి సొరంగం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేశారు. అయినప్పటీకి, ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాటర్ కెనాన్లతో ముందుకు రాకుండా పోలీసులను అడ్డుకున్నారు.

పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా నిరసనకారులు అక్రమ కట్టడాన్ని కూల్చేయాలంటూ నినాదాలు చేశారు. అనధికార మసీదు నిర్మాణంపై అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అది ప్రార్థనా మందిరమా కాదా అనేది ప్రశ్న కాదని, కట్టడం చట్టబద్ధతనే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు.

ఈ వివాదం 2010 నాటిది. తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైంది. పలు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీదును 6 వేల 750 చదరపు అడుగులు విస్తరించారు. ఇది హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమిగా చెబుతుండగా, మసీదు ఇమామ్ మాత్రం ఇది 1947 క్రితం నాటిదని, వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి అని చెబుతున్నారు. 2010 నుంచి 45 సార్లు ఇదే అంశంపై విచారణ జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఈ వ్యవధిలో మసీదు నిర్మాణం రెండు అంతస్తుల నుంచి ఐదు అంతస్తులకు పెరిగింది.

2023లో కార్పొరేషన్ మసీదులోని మరుగుదొడ్లను కూల్చివేసింది. తాజాగా ఆగస్టు 31న ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో వివాదం మొదలైంది. దీంతో మసీదు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. సెప్టెంబర్ 1న సంజౌలిలో, సెప్టెంబర్ 5న చౌరా మైదాన్‌లో ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories