యోగిని గట్టెక్కించే అస్త్రం అదేనా.. అందుకే మోడీ రంగంలోకి దిగారా?

Narendra Modi Support to Uttar Pradesh CM Yogi Adityanath
x

యోగిని గట్టెక్కించే అస్త్రం అదేనా.. అందుకే మోడీ రంగంలోకి దిగారా?

Highlights

Uttar Pradesh: మళ్లీ అదే అస్త్రం. మరోసారి అదే ఆయుధం. తిరుగులేని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పటికప్పుడు పదునుపెట్టే వ్యూహం.

Uttar Pradesh: మళ్లీ అదే అస్త్రం. మరోసారి అదే ఆయుధం. తిరుగులేని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పటికప్పుడు పదునుపెట్టే వ్యూహం. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ సమరంలో, ప్రధాని నరేంద్ర మోడీ వెపన్ అదేనా? యోగిని గట్టెక్కించేందుకు అదే శస్త్రమా? అటు రాహుల్‌ గాంధీ కూడా, ఎందుకు తిరుగులేని ఆ బాణం కోసం పదేపదే విఫలయత్నం? ఇంతకీ మోడీ, రాహుల్‌లు దేనికోసం పోటీపడుతున్నారు?

ఢిల్లీ పాలనా పగ్గాలకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాజకీయ పార్టీల వ్యూహాలు పదునుకెక్కుతున్నాయి. అస్త్రశస్త్రాలు రాటుదేలుతున్నాయ్. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగితే, అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం సై అంటున్నారు. అయితే, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ కూడా ఒకే ఒక్క ఆయుధాన్ని నమ్ముకున్నాయి. అదే హిందూత్వ.

గంగానదిని, కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను ప్రారంభించారు నరేంద్ర మోడీ. గంగానదిలో స్నానమాచరించారు. కాలభైరవున్ని దర్శించుకున్నారు. పడవలో విహారం చేశారు. గంగా హారతిని వీక్షించారు. కారిడార్‌ను నిర్మించిన కార్మికులపై పూలచల్లారు. వారితో కలిసి భోజనం చేశారు. వారణాసిని నాశనం లేని నగరమన్న మోడీ, దండయాత్రలను తట్టుకుని నిలబడిందన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, బ్రిటీష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ వంటి వారు కాశీపై కుట్రలు చేసినా, చెక్కుచెదరలేదన్నారు మోడీ.

అక్కడితో ఆగలేదు మోడీ. వార‌ణాసి వీధుల్లో న‌డుచుకుంటూ తిరిగారు. సీఎం యోగితో కలిసి అర్థరాత్రి పూట బనారస్ రోడ్లపై చక్కర్లు కొట్టారు. కారిడార్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. కాశీ లాంటి ప‌విత్ర న‌గరానికి దేశంలోనే మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందించేందుకు ప్రభుత్వం ప్రయ‌త్నం చేస్తోందన్న మోడీ, ఈ పుణ్యక్షేత్రానికి వ‌చ్చే భ‌క్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని రైల్వే క‌నెక్టివిటీ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయని త‌న ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మరుసటి రోజు బనారస్‌లో అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించారు. వారణాసి అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని, ఢిల్లీ నుంచే తాను పర్యవేక్షిస్తున్నానని అన్నారు మోడీ.

నరేంద్ర మోడీ కాశీవిశ్వనాథ ఆలయ సందర్శనైనా, కారిడార్‌ ప్రారంభమైనా, తర్వాతి రోజు బహిరంగ సభయినా, టార్గెట్ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు. వారణాసి తన సొంత నియోజకవర్గమైనప్పటికీ, ఇక్కడి నుంచే యూపీ ఎన్నికల సమరాన్ని వేడెక్కించారు మోడీ. ఉత్తరప్రదేశ్‌లో మరోసారి హిందూత్వ అస్త్రమే గెలిపిస్తుందని ఫిక్సయ్యారు. హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకే వారణాసిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారని అర్థమవుతోంది.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 403. 2017లో జరిగిన శాసన సభ సమరంలో అత్యధికంగా 309 స్థానాలు కొల్లగొట్టింది. తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. యోగి పాలన చేపట్టాక, రౌడీయిజం తగ్గినా, ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిపోయింది. ఆక్సిజన్ సిలిండర్లు లేక చిన్నపిల్లల మరణాలు నివ్వెరపరిచాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. యోగి సర్కార్‌పై వ్యతిరేకత చాపకిందనీరులా విస్తరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆందోళనలు, లఖింపూర్‌ ఖేరి ఘటన, యోగిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మోడీ ప్రభుత్వంపైన వున్న యాంటీ ఇన్‌కమ్‌బెన్సీ కూడా యోగిని చుట్టుముట్టింది. దీంతో యూపీలో ఈసారి గెలవడం అంతఈజీ కాదని, గెలిచినా బోటాబోటి మెజార్టీతో గట్టెక్కుతామని ఫిక్సయిన మోడీ, అమిత్‌ షాలు, తామే రంగంలోకి దిగారు. అమిత్‌ షా మళ్లీ బూత్‌ లెవల్‌ ఈక్వేషన్స్‌ మొదలెట్టారు. మోడీ మరోసారి హిందూత్వ అస్త్రాన్ని బయటకు తీసి, యోగిని గట్టెక్కించి, తద్వారా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇబ్బందికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందుకే కాశీవిశ్వనాథుని ఆలయంలో హోరెత్తిన హరహరమహాదేవ నినాదాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా, హిందూత్వ నినాదమే తమ ప్రాణవాయువని డిసైడైన బీజేపీ అధినాయకత్వం, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఒక్క ముస్లిం అభ్యర్థికీ సీటివ్వలేదు. ఈ చర్య ద్వారా తాము హిందూత్వకే కట్టుబడ్డామని, మెజార్టీ ప్రజలకు సంకేతమిచ్చారు. ఇది నిజంగా వర్కౌటయ్యింది కాబట్టే, భారీ ఎత్తున సీట్లు రావడానికి కారణమైందనేవారూ వున్నారు. ఇప్పుడు కూడా అదే సంకేతాలిచ్చారు మోడీ. ఔరంగజేబులు కాశీపై దండయాత్ర చేసినా, ఏమీ చెయ్యలేకపోయారని, నాశనంలేని నగరం వారణాసి అంటూ కామెంట్లు చెయ్యడంలో, పక్కాగా పోలరైజేషన్‌ లెక్కలున్నాయన్నది పొలిటికల్ పండితుల విశ్లేషణ.

అటు రాజస్థాన్ రాజధాని జైపూర్‌ బహిరంగ సభలో, కాంగ్రెస్ యువనేత రాహుల్‌ గాంధీ కామెంట్లను పరిశీలిస్తే, బీజేపీ హిందూత్వ ఓటు బ్యాంకును దెబ్బకొట్టడమే లక్ష్యమని మరోసారి అర్థమైంది. తాను హిందువునన్న రాహుల్, హిందూత్వవాదిని మాత్రం కాదన్నారు. రెండింటి మధ్య చాలా తేడా వుందని అర్థాలు, తాత్పర్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. గాంధీ హిందువైతే, గాడ్సే హిందుత్వవాది అన్నారు రాహుల్.

రాహుల్ గాంధీ హిందూ మాటలు, భక్తుడిగా చేతలు కొత్తవేం కాదు. హిందూ ఓట్లన్నీ తమవేనంటూ బీజేపీ భావిస్తుండటంతో, తాను సైతం అదే దారి పట్టారు. గుళ్లూ, గోపురాలు అందుకే తెగ తిరిగేస్తున్నారు. గతంలోనూ ఇలానే చేశారు. ఇవన్నీ వర్కౌట్‌ కాలేదనడానికి ఫలితాలే నిదర్శనం. ఇప్పుడు మళ్లీ హిందూ, హిందూత్వల నడుమ తేడాలు వివరించే ప్రయత్నం చేసి, బీజేపీ ఓటు బ్యాంకుకు గండికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ ఎన్ని యాగాలు, యోగాలు, పూజలు, వ్రతాలు చేసినా, మోడీలా తనపై హిందూ ప్రతినిధిగా ముద్ర వేయించుకోలేరన్నది విశ్లేషకుల మాట.

మొత్తానికి ఒక్కటి మాత్రం క్రిస్టల్ క్లియర్. ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అజెండా హిందూత్వ. ఇటు మోడీ వారణాసి కేంద్రంగా ఇదే సంకేతాలిస్తే, అటు రాహుల్ సైతం, తానే అసలైన హిందువునంటూ చర్చను రేకెత్తించే ప్రయత్నం చేశారు. రాహుల్ వాదాన్ని పక్కనపెడితే, యూపీలో యోగి పాలన పట్ల జనాల వ్యతిరేకత నుంచి డైవర్షన్ చేసేందుకే, మోడీ మళ్లీ హిందూత్వ ఆయుధాన్ని చేతపట్టారా అన్న చర్చ మాత్రం జరుగుతోంది. మరి ఈసారి కూడా అదే వర్కౌట్‌ అవుతుందా? చూడాలి, ఏమవుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories